ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య కుక్క పంచాయతీ
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:51 AM
ఇద్దరు ఉన్నతాధికారులు గొడవకు దిగారు. అది పెరిగి పెద్దయి.. చివరికి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకునేదాకా వెళ్లింది.
మహిళ ఐఆర్‌ఎస్ అధికారితో ఐఎఫ్‌ఎస్ అధికారి గొడవ
ఆయనపై మహిళా అధికారి పోలీసులకు ఫిర్యాదు
బంజారాహిల్స్ ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు ఉన్నతాధికారులు గొడవకు దిగారు. అది పెరిగి పెద్దయి.. చివరికి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకునేదాకా వెళ్లింది. అయితే ఆ ఇద్దరు తగాదా పడింది ఓ పెంపుడు కుక్క విషయంలో! బంజారాహిల్స్ రోడ్ నంబరు 10లోని ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్‌లో మహిళా ఐఆర్‌ఎస్ అధికారి నితికా సింగ్ నివసిస్తున్నారు. మరో క్వార్టర్‌లో ఐఎ్‌ఫఎస్ అధికారి సుతన్ ఉంటున్నారు. ఈ నెల 13న నితిక సింగ్ పెంపుడు శునకం సుతన్ ఇంటివద్ద కాలకృత్యాలు తీర్చుకుంది. ఈ పరిణామంతో ఆగ్రహించిన ఆయన, నితికా సింగ్ ఇంటి వద్దకు వెళ్ళి హంగామా సృష్టించారు. ఆయన తీరుపై నితికా సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సిబ్బందిపై సుతన్ కేకలు వేసినట్లు, ఇంటి తలుపులు బలంగా కొట్టినట్లు, ఓ పూల కుండీని విసిరి ఆస్తికి నష్టం కలిగించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై అసభ్యంగా వ్యాఖ్యలు చేశారని, అశ్లీల సంకేతాలు చేశారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. సుతన్ కారణంగా తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని పోలీసులను నిత్ సింగ్ కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు సుతన్‌పై బీఎన్‌ఎ్‌స చట్టంలోని సెక్షన్లు 75, 79, 324(4), 351(2), 352 కింద కేసు నమోదు చేశారు.