అధిక లాభాల ఆశ చూపి.. కోట్లలో దోపిడీ!
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:38 AM
అధిక లాభాలు తెచ్చిపెడతామంటూ పెట్టుబడి పేరిట కోట్లాది రూపాయల వసూళ్లకు పాల్పడి మోసం చేసిన రెండు వేర్వేరు ఉదంతాలపై సైబరాబాద్ ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ .....
షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ పేరిట 11.71 కోట్లకు టోకరా
5శాతం వడ్డీతో లాభాలంటూ వ్యాపారవేత్తకు రూ.7.2కోట్ల టోపీ
నౌకాదళ మాజీ అధికారి నుంచి 2.42 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
సైబరాబాద్ ఈవోడబ్ల్యూలో రెండు వేర్వేరు కేసులు నమోదు
హైదరాబాద్ /హైదరాబాద్ సిటీ, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): అధిక లాభాలు తెచ్చిపెడతామంటూ పెట్టుబడి పేరిట కోట్లాది రూపాయల వసూళ్లకు పాల్పడి మోసం చేసిన రెండు వేర్వేరు ఉదంతాలపై సైబరాబాద్ ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ (ఈవోడబ్ల్యూ) పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల్లో ఒకరు భారత నౌకాదళ మాజీ కమాండర్ కావడం గమనార్హం. షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్, కిసాన్ పరివార్ లిమిటెడ్ సంస్థల డైరెక్టర్ నానావత్ భూపాల్ నాయక్ సహా ఏడుగురు కలిసి మోసపూరిత నెట్‌వర్క్ నడిపిన ట్లు మాజీ కమాండర్ సంజీవ్ గుప్తా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ట్రేడింగ్ నిర్వహిస్తోన్న తమ సంస్థ సెబీ గుర్తింపు పొందిందని, మరో సంస్థ సేంద్రియ వ్యవసాయ ప్రాజెక్టులను నిర్వహిస్తోందని నమ్మించి ఏడాదికి 18-48 శాతం రాబడి ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఆరోపించారు. దీంతో సంజీవ్ వద్ద నుంచి రూ.67 లక్షలు, ఆయన కుటుంబీకుల నుంచి మరో రూ. 1.25 కోట్లు కలిపి.. ఒక్క నేవీ అధికారి కుటుంబం నుంచే రూ.1.92 కోట్లు వసూలు చేశారు. వడ్డీతో కలిపి రూ.2.42 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉందని ఫిర్యాదులో వెల్లడించారు. ఈ రెండు సంస్థల్లో ఇతర బాధితులు కూడా భారీగా పెట్టుబడులు పెట్టినట్లు.. అందరి నుంచి రూ.4.51కోట్లకు పైగా వసూ లు చేసి బోర్డు తిప్పేసినట్లు తెలుస్తోంది.
మరో కేసులో, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే ఊహించని లాభాలు వస్తాయని నమ్మి ఓ వ్యాపారవేత్త రూ.7.20 కోట్ల మేర మోసపోయారు. హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన బొద్దులూరి మాధవరావు ఫిర్యాదు మేరకు మాదాపూర్‌కు చెందిన చోడా రవి చంద్రారెడ్డిపై కేసు నమోదైంది. 2023లో తనను తాను రియల్ ఎస్టేట్ వ్యాపారి అని పరిచయం చేసుకున్న నిందితుడు, విలువైన స్థలాలు కొనుగోలు చేసి 5 శాతం వడ్డీతో లాభాలు అందిస్తానని తనని నమ్మించాడని మాధవరావు ఆరోపించారు. అతని మాటలను నమ్మి ఆస్తి విక్రయం ద్వారా వచ్చిన రూ.7.20 కోట్లను రవికి ఇచ్చినట్లు ఫిర్యాదులో తెలిపారు. ప్రారంభంలో కొంత మొత్తాన్ని లాభాల రూపంలో చెల్లించిన నిందితుడు, అనంతరం ఎలాంటి చెల్లింపులు చేయలేదని ఆరోపించారు. భద్రత నిమిత్తం ఇచ్చిన చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయని, అలాగే కొన్ని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తానని ఎంఓయూ కుదుర్చుకున్నప్పటికీ ఎలాంటి ఆస్తిని బదిలీ చేయలేదని పేర్కొన్నారు.
వైద్యులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు..
సైబర్‌నేరగాళ్లు సామాన్యులనే కాకుండా.. వైద్యుల్ని సైతం సులభంగా బురిడీ కొట్టిస్తున్నారు. రాష్ట్రంలో రెండున్నరేళ్లలో 735 మంది వైద్యులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.30కోట్లు నష్టపోయారు. దీంతో రంగంలో దిగిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. మోసపోయిన వైద్యులను, పలు అసోసియేషన్ల ప్రతినిధులను మంగళవారం పిలిచి ఓ అవగాహన శిబిరాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయల్ మాట్లాడుతూ.. నేరగాళ్లు బాధితుల హోదాతో సంబంధం లేకుండా ఉచ్చు బిగిస్తున్నారని తెలిపారు. లాభం వస్తుందని ఆశ పడితే అసలుకే మోసం వస్తుందని గుర్తించాలన్నారు. కేవలం పెట్టుబడి మోసా ల ద్వారా 127 మంది బాధితులు రూ. 22.39 కోట్లు నష్టపోయారని వివరించారు.