Share News

అగ్నికి చెక్‌ పెట్టే.. ఫైర్‌ ఫైటింగ్‌ రోబో!

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:46 AM

నాంపల్లి ఫర్నీచర్‌ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో సహాయ కార్యక్రమాల కోసం అధునాతన ‘ఫైర్‌ ఫైటింగ్‌ రోబో’ను వినియోగించారు.

అగ్నికి చెక్‌ పెట్టే.. ఫైర్‌ ఫైటింగ్‌ రోబో!

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): నాంపల్లి ఫర్నీచర్‌ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో సహాయ కార్యక్రమాల కోసం అధునాతన ‘ఫైర్‌ ఫైటింగ్‌ రోబో’ను వినియోగించారు. సాధారణంగా భారీ అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో మంటలు, దట్టమైన పొగల కారణంగా అగ్నిమాపక సిబ్బంది సంబంధిత భవనం/ప్రాంతం లోపలికి వెళ్లేందుకు వీలుండదు. అలాంటి సందర్భంలో లోపలికి వెళ్లి మంటలను ఆర్పేందుకు, లోపలున్న బాధితులకు సహాయం అందించేందుకు ‘ఫైర్‌ ఫైటింగ్‌ రోబో’ ఉపయోగపడుతుంది. వైర్‌లెస్‌ విధానంలో దీనిని బయటి నుంచే నియంత్రించవచ్చు. ఈ రోబో లోపలి పరిస్థితిని వీడియో తీస్తూ, బయట ఉన్నవారికి పంపిస్తుంది. చమురు రిఫైనరీలు, రసాయన ప్లాంట్లు వంటి ప్రమాదకర పరిశ్రమల్లో అతి తీవ్ర ఉష్ణోగ్రతలు, పేలుళ్లు జరుగుతున్న చోట విషవాయువులు వెలువడిన ప్రాంతాల్లో ఇలాంటి రోబోలను వినియోగిస్తారు. వీటిలో నీటిని విరజిమ్మే, పొగను బయటికి పంపే పరికరాలతోపాటు ఉష్ణోగ్రతలు, విషవాయువుల మోతాదులను గుర్తించే సెన్సర్లు, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే కెమెరాలు ఉంటాయి. అగ్ని ప్రమాదం జరిగిన చోట లోపలికి వెళ్లి మంటలను ఆర్పడమే కాదు.. మండుతున్న అడ్డంకులను తప్పించడం, పొగను బయటికి పంపడం ద్వారా సిబ్బంది లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ రోబో వీలుకల్పిస్తుంది.

రెస్క్యూ టెంటర్‌..

అగ్ని ప్రమాదం జరిగిన చోట అడ్డంకులను వేగంగా తొలగించి, బాధితులను కాపాడేందుకు ఈ వాహనంలోని పరికరాలు ఉపయోగపడతాయి. ఇనుమును సైతం కత్తిరించే కట్టర్స్‌, స్పెడ్డర్స్‌, క్లచ్‌గేర్స్‌, గోడలను బద్దలు కొట్టగల బ్రేకర్స్‌, బాధితుల ప్రాణాలు కాపాడేందుకు పలు రకాల పరికరాలు ఇందులో ఉంటాయి. యూరప్‌ నుంచి అగ్నిమాపక శాఖ ఆధునిక రెస్క్యూ టెండర్‌ను కొనుగోలు చేసింది.

బ్రాంచ్‌ స్కై లిఫ్ట్‌

బహుళ అంతస్తు భవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయంలో బాధితులను కాపాడేందుకు బ్రాంచ్‌ స్కై లిఫ్ట్‌ను వినియోగిస్తారు. కొన్ని వరుసలుగా ఉండే నిచ్చెనతో 116 అడుగుల ఎత్తు వరకు చేరుకుని కాపాడవచ్చు.

వాటర్‌ బ్రౌజర్‌..

సాధారణ ఫైరింజన్లతో పోల్చితే మూడింతలు 12 వేల లీటర్ల సామర్థ్యంతో ఉంటుంది. భారీ అగ్ని ప్రమాదాలప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఇక నీటితోపాటు మంటలను అదుపు చేసే రసాయనాలు కూడా కలిపి వినియోగించే వాటర్‌ టెండర్‌ పరికరం కూడా ఉంది.

Updated Date - Jan 25 , 2026 | 08:30 AM