Share News

తొలిరోజు 115 దరఖాస్తులే!

ABN , Publish Date - Jul 22 , 2026 | 06:04 AM

హైదరాబాద్‌ మహానగరం (క్యూర్‌) పరిధిలో ప్రారంభించిన ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్ల పథకం దరఖాస్తుల ప్రక్రియలో మొదటిరోజు అవగాహన లోపం, సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

తొలిరోజు 115 దరఖాస్తులే!

  • ఎల్‌ఐజీ ఇళ్ల దరఖాస్తుకు సాంకేతిక సమస్యలు

  • సాయంత్రం 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ

  • వాట్సాప్‌ మీ-సేవలోనూ సరిగా పనిచేయని ప్రక్రియ

హైదరాబాద్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మహానగరం (క్యూర్‌) పరిధిలో ప్రారంభించిన ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్ల పథకం దరఖాస్తుల ప్రక్రియలో మొదటిరోజు అవగాహన లోపం, సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో తొలిరోజు దరఖాస్తులు అతి తక్కువ సంఖ్యలో వచ్చాయి. లబ్ధిదారుల దరఖాస్తు వివరాలు సహా అసెంబ్లీ నియోజకవర్గాల ఖరారు వరకు సాఫ్ట్‌వేర్‌లో పూర్తిస్థాయిలో పొందుపరచకపోవడమే ఈ సమస్యలకు కారణమని తెలుస్తోంది. ఎల్‌ఐజీ ఇళ్ల పథకానికి మంగళవారం నుంచే దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో ఉదయం నుంచే దరఖాస్తుదారులు మీ-సేవ కేంద్రాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే ఉదయం 10.30 గంటలకు అందుబాటులోకి రావాల్సిన వెబ్‌సైట్‌.. మధ్యాహ్నం 2 గంటలకు ఎనేబుల్‌ అయింది. ఆ తరువాత కొద్దిసేపటికే పలు సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించేసరికి సాయంత్రమైంది. దాంతో సాయంత్రం 5 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కేవలం 100-115 దరఖాస్తులే వచ్చాయని, ఇందులోనూ కూకట్‌పల్లి నుంచే 75 వరకు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు మీ-సేవ వాట్సాప్‌ నంబరు ద్వారా దరఖాస్తు చేయాలని ప్రయత్నించిన వారికి కూడా ఇబ్బందులే ఎదురయ్యాయి. వెరసి ఎల్‌ఐజీ ఇళ్ల దరఖాస్తుల వ్యవహారం మొదటిరోజు ఆశించినస్థాయిలో జరగలేదని పలువురు మీ-సేవ కేంద్రాల నిర్వాహకులు అన్నారు. దరఖాస్తు ఎలా చేయాలనే అంశంపై మీ-సేవ నిర్వాహకులకు అవగాహన కల్పించకపోవడం, మరోవైపు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మొదటిరోజు ఇబ్బందులు ఏర్పడ్డాయని అంటున్నారు.


అందరి ఆధార్‌లు నమోదు చేయాల్సిందే..

ఎల్‌ఐజీ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తుదారు ఆధార్‌ ఒక్కటే ఉంటే సరిపోదు. కుటుంబంలోని అందరి ఆధార్‌ నంబర్లనూ నమోదు చేయాల్సిందే. వారిలో ఏ ఒక్కరికైనా గతంలో ప్రభుత్వం నుంచి లబ్ధి కలిగి ఉంటే.. పథకానికి అనర్హుడైనట్లు వెబ్‌సైట్‌లో చూపిస్తోందని మీ-సేవ నిర్వాహకులు చెబుతున్నారు. కుటుంబంలోని మహిళ పేరు మీద దరఖాస్తు చేస్తే.. ఆమె తండ్రి, తల్లి, భర్త ఆధార్‌లను కూడా ఇవ్వాలి. ఆ మహిళ తల్లి, తండ్రి గతంలో ప్రయోజనాలు పొందినా.. ఎల్‌ఐజీ ఇళ్ల పథకానికి అనర్హులవుతారు. మరోవైపు దరఖాస్తుదారు తండ్రి, తల్లి మరణించి ఉంటే ‘లేట్‌’ అనే ఆప్షన్‌ను ఎంచుకుని ముందుకువెళ్లేలా అవకాశం కల్పించారు. అయితే ఎవరైనా దరఖాస్తుదారు తల్లి, తండ్రి పేరు మీద గతంలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది ఉంటే.. అతనికి ఇల్లు రాదు. దీంతోపాటు మొదటిరోజు దరఖాస్తుకు వచ్చినవారిలో కొంతమంది తమ తల్లిదండ్రులతో సంబంధంలేదని, తమ భార్య, పిల్లల వివరాలతోనే దరఖాస్తు చేసుకుంటామని చెబుతున్నట్టు తెలిసింది. కానీ, దరఖాస్తు నిబంధనల ప్రకారం తల్లిదండ్రుల ఆధార్‌లు కూడా ఉండాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.


నియోజకవర్గాల ఖరారులో అస్పష్టత..

అసెంబ్లీ నియోజకవర్గాల ఖరారు విషయంలోనూ కొంత అస్పష్టత ఉంది. దరఖాస్తుదారు మహేశ్వరం నియోజకవర్గంలో నివాసముంటూ.. జూబ్లీహిల్స్‌లోనూ దరఖాస్తు చేసుకునేలా అవకాశం ఉంది. దీంతో మీ-సేవ నిర్వాహకుడు నియోజకవర్గాన్ని సరిగా పేర్కొనకపోయినా, దరఖాస్తుదారు సరిగా వివరాలు ఇవ్వకపోయినా.. నియోజకవర్గం మార్పునకు అవకాశం ఉంటుందా? లేదా? అన్న అనుమానాలున్నాయి. దీంతోపాటు చెల్లించిన ఇంటి టోకెన్‌ అడ్వాన్స్‌ వెనక్కి వస్తుం దా? అనే సందేహం నెలకొంది. అయితే ఓటర్‌ ఐడీ, రేషన్‌కార్డు డేటాబేస్‌ ఆధారంగా దరఖాస్తుదారు పేరు, ఫోన్‌నంబరు నమోదు చేయగానే.. ప్రస్తుతం ఉంటున్న నియోజకవర్గం పేరు వచ్చేలా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయాలని మీ-సేవ నిర్వాహకులు సూచిస్తున్నారు.


దరఖాస్తుదారేరూ.10,162 ఫీజు చెల్లించాలి

ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు చెల్లించే ఫీజు విషయంలోనూ అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం దరఖాస్తుకు రూ.100, ఇంటి టోకెన్‌ అడ్వాన్స్‌ రూ.10 వేలు, మీ-సేవ చార్జీలు రూ.62 కలిపి మొత్తం రూ.10,162 అవుతోంది. ఈ మొత్తాన్ని దరఖాస్తుదారు తన ఖాతా నుంచి గానీ, క్యూఆర్‌ కోడ్‌ విధానంలో గానీ చెల్లించాలి. ఎందుకంటే దరఖాస్తు సమయంలో బ్యాంకు ఖాతా నంబరు తీసుకోవడంలేదు. దరఖాస్తుదారుకు ఒకవేళ ఇల్లు రాకపోతే టోకెన్‌ అడ్వాన్స్‌ను వెనక్కి ఇచ్చే సందర్భంలో సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. ఈ విషయంలో గృహనిర్మాణ శాఖ ఽఅధికారులు దృష్టి సారించి, పేమెంట్‌ ఆప్షన్‌ను దరఖాస్తుదారు ఫోన్‌ నంబరుకు వెళ్లేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలనే సూచనలు వస్తున్నాయి. దరఖాస్తుల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన వాట్సాప్‌ మీ-సేవ (8096958096) నంబరు ద్వారా అందుబాటులోకి వచ్చే చాట్‌బోట్‌ కూడా ఆశించిన స్థాయిలో పనిచేయడంలేదనే ఫిర్యాదులున్నాయి. వాట్సాప్‌ మీ-సేవ నంబరుకు ‘హాయ్‌’ అని మెసేజ్‌ పెట్టగానే కొన్ని సర్వీసులను వినియోగించుకునేందుకు వివరాలను ఇస్తోంది. కానీ ‘ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇండ్లు’ ఆప్షన్‌ను మాత్రం చూపించడంలేదు. మాన్యువల్‌గా పేరును ఎంటర్‌ చేయగానే.. ‘‘మీ-సేవ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోండి’’ అని మెసేజ్‌ వస్తోంది. దీనిపైనా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Jul 22 , 2026 | 06:05 AM