Share News

హైస్పీడ్‌ రైల్వే లైన్ల అలైన్‌మెంట్‌లు ఖరారు!

ABN , Publish Date - Jul 17 , 2026 | 05:43 AM

తెలంగాణ మీదుగా బెంగళూరు, చెన్నైలకు కేంద్రం ప్రతిపాదించిన హై స్పీడ్‌ రైలు కారిడార్‌ల అంశంలో తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది.

హైస్పీడ్‌ రైల్వే లైన్ల అలైన్‌మెంట్‌లు ఖరారు!

  • శంషాబాద్‌, ఫ్యూచర్‌ సిటీ, శ్రీశైలం మీదుగా హైదరాబాద్‌- బెంగళూరు మార్గం

  • అమరావతి మీదుగా హైదరాబాద్‌- చెన్నై లైన్‌

  • గతంలో ప్రతిపాదించిన మార్గాల్లో కీలక మార్పులు

  • వాటినే ఖరారు చేయాలని కేంద్రాన్ని కోరనున్న రాష్ట్రం

  • నేడు క్యాబినెట్‌ ముందుకు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్ల అంశం

హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మీదుగా బెంగళూరు, చెన్నైలకు కేంద్రం ప్రతిపాదించిన హై స్పీడ్‌ రైలు కారిడార్‌ల అంశంలో తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. హైదరాబాద్‌- బెంగళూరు, హైదరాబాద్‌-చెన్నై మార్గాల్లోని హైస్పీడ్‌ రైలు లైను అలైన్‌మెంట్‌ల్లో కీలక మార్పులు చేస్తూ వాటినే ఖరారు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ రెండు రైల్వే లైన్ల అలైన్‌మెంట్‌ల అంశంపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గురువారం సమీక్ష కూడా నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, చెన్నై మార్గాల అలైన్‌మెంట్‌లో గతంలో ఇచ్చిన రూట్‌మ్యాప్‌, తాజాగా చేసిన సవరణల వివరాలను అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ఈ హైస్పీడ్‌ రైల్వే లైన్ల అలైన్‌మెంట్‌ల అంశం శుక్రవారం క్యాబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. ఆపై, మార్పులు చేసిన అలైన్‌మెంట్‌లను నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎస్ఆర్‌సీఎల్‌)కు నివేదించి వాటినే ఖరారు చేయాలని ప్రభుత్వం కోరనుందని సమాచారం.


మారిన బెంగళూరు అలైన్‌మెంట్‌..

రాష్ట్రానికి మంజూరైన హైస్పీడ్‌ రైల్వే లైన్ల అంశంపై రైల్వే అధికారులు సీఎం రేవంత్‌ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై ఇదివరకే వివరాలు తెలియజేశారు. ఆ సమయంలోనే బెంగళూరు, చెన్నై మార్గాల్లో సీఎం రేవంత్‌ పలు మార్పులను సూచించారు. తొలుత కేంద్రం ఖరారు చేసిన దాని ప్రకారం.. హైదరాబాద్‌-బెంగళూరు సెక్షన్‌లో తెలంగాణ పరిధిలో 218కి.మీ ఉండనుండగా 3 స్టేషన్లు వస్తాయి. శంషాబాద్‌, మహబూబ్‌నగర్‌, కర్నూలు మీదుగా మార్గాన్ని ప్రతిపాదించారు. అయితే ఈ మార్గాన్ని శంషాబాద్‌, భారత్‌ ఫ్యూచర్‌సిటీ, ఆమనగల్లు, మన్ననూరు, శ్రీశైలం, సోమశిల మీదుగా తీసుకెళ్తే శ్రీశైలానికి రైల్వే మార్గం ఏర్పడుతుందని సీఎం రేవంత్‌ సూచించారు. ఇప్పుడు దీని ప్రకారమే హైదరాబాద్‌-బెంగళూరు హైస్పీడ్‌ రైల్వే లైన్‌ అలైన్‌మెంట్‌ను మార్చినట్టు సమాచారం.


చెన్నై కారిడార్‌.. హైదరాబాద్‌-అమరావతి మీదుగా..

రైల్వే అధికారులు ప్రాఽథమికంగా రూపొందించిన అలైన్‌మెంట్‌ ప్రకారం. హైదరాబాద్‌-చెన్నై మార్గం మొత్తం పొడవు 744 కి.మీ కాగా తెలంగాణలో 236 కిలోమీటర్లుగా ఉంది. 5 స్టేషన్లు వస్తాయి. శంషాబాద్‌, బాటసింగారం, నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం, అమరావతి-గుంటూరు వరకు రూపొందించారు. అయితే నార్కట్‌పల్లి, ఖమ్మం, విజయవాడ వైపు ఇప్పటికే రైలు మార్గాలు ఉన్నందున హైదరాబాద్‌-అమరావతి మధ్యన ప్రతిపాదిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రోడ్డుకు సమాంతరంగా హైస్పీడ్‌ రైల్వే లైను నిర్మిస్తే కొత్త ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ ఏర్పడుతుందని సీఎం రేవంత్‌ సూచించారు. ఈ మార్గాన్ని బందరు పోర్టుకు వరకు నిర్మించడం వల్ల తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డ్రై పోర్టుకు రైలుమార్గం అనుసంధానత కలుగుతుందని కూడా చెప్పారు. ఈ మేరకు శంషాబాద్‌, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి అమరావతి మీదుగా లైన్‌ ఉండేలా రూట్‌ను ఖరారు చేశారని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

Updated Date - Jul 17 , 2026 | 05:44 AM