కోర్టు డిక్రీ ఉందని తెలిసీ ఫెన్సింగ్ ఏర్పాటా?
ABN , Publish Date - Feb 26 , 2026 | 03:31 AM
సివిల్ వివాదంలో ఉన్న ప్లాట్లకు సంబంధించిన యజమానులు ఎవరో నిర్ధారిస్తూ కోర్టు తుది డిక్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆ స్థలం తమదని ...
తొలగించకుంటే రోజుకు రూ.లక్ష జరిమానా.. వ్యవహార శైలి దురుసుతనం, ఏకపక్షం
హైడ్రాపై హైకోర్టు తీవ్ర వాఖ్యలు.. పరిహారం కింద తొలుత రూ.లక్ష చెల్లించాలని ఆదేశం
క్షేత్రస్థాయి పరిస్థితిపై అడ్వకేట్ కమిషనర్‌తో విచారణ.. బాబానగర్ ప్లాట్లపై వివాదం
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): సివిల్ వివాదంలో ఉన్న ప్లాట్లకు సంబంధించిన యజమానులు ఎవరో నిర్ధారిస్తూ కోర్టు తుది డిక్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆ స్థలం తమదని పేర్కొంటూ జీహెచ్‌ఎంసీ, హైడ్రా ఫెన్సింగ్ వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దానిని తక్షణం తొలగించకుంటే రోజుకు రూ.లక్ష వంతున జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాప్రా మున్సిపాల్టీ పరిధిలోని ఉప్పల్ మండలం మల్లాపూర్ గ్రామం, బాబానగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని సర్వే నెంబర్ 100లో ఉన్న ప్లాట్ నెంబర్ 184, ప్లాట్ నెంబర్ 185లకు సంబంధించి టైటిల్ వివాదంపై సివిల్ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ ఆ స్థలం జీహెచ్‌ఎంసీకి చెందినదని పేర్కొంటూ హైడ్రా ఫెన్సింగ్ వేసి బోర్డు పెట్టడంపై జొన్నలగడ్డ పద్మిని తదితరులు హైకోర్టులో వేర్వేరు పిటిషన్‌లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం.. అడ్వకేట్ కమిషనర్‌ను నియమించి క్షేత్రస్థాయి నివేదిక తెప్పించుకుంది. కోర్టు తుది తీర్పు ఇచ్చిందని తెలిసినప్పటికీ ఫెన్సింగ్ వేసి బోర్డు పెట్టడంపై హైడ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో హైడ్రా ఏకపక్షంగా, దురుసుగా ప్రవర్తించిదని పేర్కొంటూ నష్ట పరిహారం కింద రూ. లక్ష పిటిషనర్లకు చెల్లించాలని ఆదేశించింది. ‘ ఫెన్సింగ్ వేయడం, బోర్డు పెట్టడంగానీ చేయాలంటే కచ్చితంగా సివిల్ కోర్టు లేదా హైకోర్టు ఆదేశాలు ఉండాలి. ప్రస్తుత అంశంపై హైకోర్టు ఎదుట రిట్ పిటిషన్‌లు దాఖలై విచారణలో ఉండగా హైడ్రా దూకుడుగా వ్యవహరించి ఫెన్సింగ్ వేసింది. చట్టం నిర్దేశించిన ప్రొసీజర్‌ను అనుసరించకుండా ఇప్పుడు తన చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది’ అని వ్యాఖ్యానించింది. తక్షణం ఫెన్సింగ్, బోర్డులను తొలగించకపోతే..వాటిని తొలగించేంతవరకు రోజుకు రూ. లక్ష చొప్పున పిటిషనర్లకు చెల్లించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది.