మునిసిపల్‌శాఖ మార్గదర్శకాలతోనే పని చేయాలి!
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:15 AM
హైడ్రా ఏర్పాటు జీవో ప్రకారం.. మునిసిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఆధీనంలో, ఆ శాఖ జారీచేసే మార్గదర్శకాలతో మాత్రమే హైడ్రా పనిచేయాలని.. పరిధికి మించి...
జీవో ఇదే చెబుతోంది.. పరిధిని మించి హైడ్రా వ్యవహరించొద్దు
గతంలో పలుమార్లు చెప్పినా నిర్లక్ష్యమేనా?
హైడ్రాపై కేసులో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
హైడ్రా ఏర్పాటు జీవో ప్రకారం.. మునిసిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఆధీనంలో, ఆ శాఖ జారీచేసే మార్గదర్శకాలతో మాత్రమే హైడ్రా పనిచేయాలని.. పరిధికి మించి వ్యవహరించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా సాహెబ్‌నగర్ కలాన్‌లో సర్వే నంబర్ 132, 133ల్లోని 650 చదరపు గజాల ప్లాట్‌ను హైడ్రా స్వాధీనంచేసుకోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. టైటిల్ వివాదాలు సివిల్ కోర్టులో పెండింగ్‌లో ఉండగా సదరు ఆస్తుల్లో జోక్యం చేసుకోవడం సహించబోమని తెలిపింది. సివిల్ వివాదాల్లో ఉన్న భూముల రక్షణ సంగతి న్యాయస్థానాలు చూసుకుంటాయని.. రాష్ట్రంలోని సర్కారు భూములన్నింటినీ హైడ్రానే రక్షించడం లేదన్న సంగతి గుర్తుంచుకోవాలని ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. గతంలో పలు పిటిషన్ల విచారణ సందర్భంగా ఇదే విషయాన్ని చెప్పినా నిర్లక్ష్యం చూపుతున్నారని పేర్కొంది. సాహెబ్‌నగర్ కలాన్‌లో ప్లాట్‌ను హైడ్రా బలవంతంగా, చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకుందని ముసారాంబాగ్‌కు చెందిన పూర్ణిమ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైడ్రాపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఈ కోర్టులో హైడ్రాకు సంబంధించి వేల పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని.. చాలా కేసుల్లో హైడ్రా చట్టాన్ని పాటించడం లేదని పేర్కొన్నారు. మునిసిపల్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండగా నేరుగా హైడ్రా కమిషనర్ ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. వివరాలు తెలుసుకుని చెప్పాలని హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్‌ను ఆదేశించారు.