Hyderabad High Court: ఉస్మానియా తరలింపుపై కౌంటర్ వేయరా?
ABN , Publish Date - Jan 06 , 2026 | 02:43 AM
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (ఓజీహెచ్)ను గోషామహల్ స్టేడియానికి తరలించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హెచ్‌ఎండీఏ, ఇతర ప్రతివాదులు స్పందన....
అధికారులపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (ఓజీహెచ్)ను గోషామహల్ స్టేడియానికి తరలించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హెచ్‌ఎండీఏ, ఇతర ప్రతివాదులు స్పందన తెలియజేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరి అవకాశం ఇస్తున్నామని ఈసారి కౌంటర్ దాఖలు చేయకపోతే జరిమానా విధించాల్సి వస్తుందని పేర్కొంది. నగర ప్రణాళిక, మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా గోషామహల్ స్టేడియాన్ని ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ గోషామహల్‌కు చెందిన స్థానికుడు గుండోలు రాము హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పలుమార్లు అవకాశం ఇచ్చినప్పటికీ హెచ్‌ఎండీఏ, ఇతర ప్రభుత్వ సంస్థల న్యాయవాదులు మళ్లీ సమయం కోరడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టేడియానికి సంబంధించిన 31ఎకరాల భూమిని ఓజీహెచ్ నిర్మాణానికి కేటాయిస్తూ జారీ అయిన జీవోను సవాలు చేసేందుకు పిటిషనర్‌కు అనుమతి ఇచ్చింది. దీనిపైనా వాదనలు వింటామని పేర్కొన్న ధర్మాసనం.. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.