కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై విధాన నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:48 AM
సుప్రీంకోర్టు ఇచ్చిన ‘స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ ఉమాదేవి’ తీర్పు నేపథ్యంలో కాంట్రాక్టు, తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఓ విధాన నిర్ణయం.....
హైదరాబాద్, మార్చి 12(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ఇచ్చిన ‘స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ ఉమాదేవి’ తీర్పు నేపథ్యంలో కాంట్రాక్టు, తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2 దశాబ్దాలకు పైగా సర్వీసు చేస్తున్నా ఉద్యోగం క్రమబద్ధీకరించడం లేదని పేర్కొంటూ జేఎన్‌టీయూలో పనిచేస్తున్న నర్సింహ అనే రికార్డు అసిస్టెంట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి ధర్మాసనం పిటిషర్ సర్వీసు క్రమబద్ధీకరించాలని పేర్కొంటూ తీర్పు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ జేఎన్‌టీయూ.. డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్ అయిన ఉద్యోగులకు 10 సంవత్సరాల సర్వీసు తర్వాత అన్ని అర్హతలు ఉన్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ‘ఉమాదేవి’ జడ్జిమెంట్ వెలువడిన 2006తర్వాత గానీ లేదా తెలంగాణ ఏర్పడిన తర్వాత గానీ రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం లేదా జీవోలు జారీచేయలేదని వ్యాఖ్యానించింది.