ఐటినా ప్రాపర్టీస్ పత్రాలు నకిలీవి
ABN , Publish Date - Jun 10 , 2026 | 05:23 AM
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 41/12, 41/13, 41/14లో దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన ..
ఖానామెట్‌లోని 15 ఏకరాలు సర్కారువే .. హైకోర్టు తీర్పు
హైదరాబాద్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 41/12, 41/13, 41/14లో దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన 15 ఎకరాలు సర్కార్‌వేనని హైకోర్టు తేల్చి చెప్పింది. హక్కులు కోరుతూ ఐటినా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. రూ.5 లక్షల జరిమానా విధించింది. ఆ కంపెనీ చూపిన పట్టా సర్టిఫికెట్లు నకిలీవని, కల్పిత పత్రాల ఆధారంగా ప్రభుత్వ భూములను కాజేసే కుట్ర జరిగిందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అక్రమాలపై నిజాలు నిగ్గు తేల్చేందుకు ఐపీఎస్ అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీలను ఆదేశిస్తూ విచారణను ముగించింది. ఖానామెట్‌లోని 15 ఎకరాల భూమి తమదేనని, అధికారులు దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ హైకోర్టులో ఐటినా పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానివేనని తేల్చి చెప్పారు. తహసీల్దార్ జారీ చేయాల్సిన ఆదేశాలను ‘రికార్డింగ్ ఆఫీసర్’ పేరిట జారీ చేసినట్లు చూపడం అనుమానాస్పదమని, ఆ పత్రాలు కూడా కల్పితమైనవేనని అభిప్రాయపడ్డారు.