జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ రోడ్డు విస్తరణ పనుల నిలుపుదల
ABN , Publish Date - Mar 22 , 2026 | 05:34 AM
బంజారాహిల్స్ విరించి ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు రోడ్డు విస్తరణ పనులు నిలిపివేయాలని రాష్ట్రప్రభుత్వం, జీహెచ్‌ఎంసీలకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
పిటిషనర్ల ఆస్తుల సేకరణపై స్టే.. హైకోర్టు ఉత్తర్వులు
హైదరాబాద్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): బంజారాహిల్స్ విరించి ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు రోడ్డు విస్తరణ పనులు నిలిపివేయాలని రాష్ట్రప్రభుత్వం, జీహెచ్‌ఎంసీలకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. భూసేకరణ చట్టం సెక్షన్ 21 కింద పిటిషనర్లకు నోటీసులు జారీ చేసే వరకు తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తున్నట్లు తెలిపింది. పిటిషనర్ల ఆస్తులను స్వాధీనం చేసుకోకుండా ఈ స్టే వర్తిస్తుందని స్పష్టం చేసింది. మార్చి 6న జారీ చేసిన నోటిఫికేషన్‌లో భూసేకరణ చట్టం సెక్షన్ 19 ప్రకారం పునరావాస ప్రాంతాన్ని ప్రకటించలేదని అభిప్రాయపడింది. ఆ ప్రాంతంలో ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న రెండు పత్రికల్లో భూసేకరణ నోటిఫికేషన్ ప్రచురించాలని, అందులో ఒకటి స్థానిక భాష పత్రిక ఉండాలని సూచించింది. భూసేకరణ కారణంగా దెబ్బతింటున్న ఆస్తుల పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. భూ సేకరణ నోటిఫికేషన్‌ను ఎవరికీ తెలియని, ప్రాచుర్యం లేని పత్రికల్లో ప్రచురించడంతోపాటు, ఇతర ప్రక్రియను సవాల్ చేస్తూ జూబ్లీహిల్స్‌కు చెందిన సీవీ నరసింహం సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... నిబంధనలను పాటించకుండా చట్టవిరుద్ధంగా భూసేకరణ చేపడుతున్నారని చెప్పారు. జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నోటిఫికేషన్ జీహెచ్‌ఎంసీ అధికారిక వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్ల ఆస్తుల సేకరణపై స్టే ఇవ్వడం తో పాటు, పలు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.