TS High Court: ప్రభాకర్‌రెడ్డితో కుమ్మక్కయ్యారా?
ABN , Publish Date - Jan 09 , 2026 | 05:05 AM
దుర్గం చెరువు భూమిని ఆక్రమించి అక్రమ పార్కింగ్ దందా నడుపుతున్న కేసులో నిందితుడితో హైడ్రా అధికారులు కుమ్మక్కయ్యారా? అని హైకోర్టు ప్రశ్నించింది.
హైడ్రా అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
ఆక్రమణ ఆరోపణలున్న భూముల వేలానికి ఆదేశించమంటారా?
దుర్గంచెరువులో అక్రమ పార్కింగ్ దందాపై విచారణ సందర్భంగా వ్యాఖ్య
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): దుర్గం చెరువు భూమిని ఆక్రమించి అక్రమ పార్కింగ్ దందా నడుపుతున్న కేసులో నిందితుడితో హైడ్రా అధికారులు కుమ్మక్కయ్యారా? అని హైకోర్టు ప్రశ్నించింది. గతంలో మొదటిసారి ఈ పిటిషన్ విచారణకు రాలేదంటే అర్థం చేసుకోవచ్చు, కానీ ప్రస్తుత విచారణకు హైడ్రా తరఫు న్యాయవాది గానీ, హైడ్రా అధికారులు గానీ ఎందుకు రాలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘హైడ్రా తరఫు న్యాయవాది గానీ, అధికారులు గానీ ఎవరూ హాజరుకాలేదు. పిటిషనర్, నిందితుడు కొత్త ప్రభాకర్ రెడ్డితో ఏమైనా కుమ్మక్కయ్యారా? ఆక్రమణ ఆరోపణలున్న భూముల వేలానికి ఆదేశించమంటారా? ఈ ఒక్క కేసులోనే కాదు.. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైన చాలా కేసుల్లోనూ హైడ్రా తరఫున ఎవరూ హాజరుకావడం లేదు. హైడ్రా తరఫున ఎవరూ సరిగ్గా కోర్టు విచారణకు సహకరించడం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దుర్గంచెరువులో దాదాపు ఐదెకరాల భూమిని ఆక్రమించి ప్రైవేటు పార్కింగ్ స్థలంగా మార్చి ప్రతినెలా రూ.లక్షల్లో అక్రమంగా ఆర్జిస్తున్నారని పేర్కొంటూ బీఆర్‌ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మరో వ్యక్తి వెంకట్‌రెడ్డిపై హైడ్రా సూపర్‌వైజర్ ఫిర్యాదుమేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. పోలీసులు తనఫై అక్రమంగా కేసు నమోదు చేశారని, దాన్ని కొట్టేయాలని పేర్కొంటూ కొత్త ప్రభాకర్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇప్పటికే ఒకసారి జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ధర్మాసనం ఎదుట విచారణకు రాగా.. ఆక్రమణలపై జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వివరాలు సమర్పించాలని పోలీసులు, హైడ్రాకు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా గురువారం ఈ పిటిషన్ మరోసారి విచారణకు వచ్చింది. హైడ్రా తరఫున ఎవరూ హాజరుకాకపోవడంపై జస్టిస్ అనిల్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాదనలు వినడానికి నిరాకరించారు. మరోవైపు పిటిషనర్, నిందితుడు కొత్త ప్రభాకర్ రెడ్డి తరఫు న్యాయవాది ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి వాదిస్తూ ‘వాళ్లు రాకపోతే ఏంటి? పిటిషనర్ తరఫున వాదన వినిపించే హక్కు నాకుంది. నా క్లయింట్ కేసు మీరు వినకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా’ అంటూ కోర్టు నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈ కేసును మరో జడ్జికి బదిలీ చేసేందుకు వీలుగా చీఫ్ జస్టిస్ ఎదుట ఉంచాలని రిజిస్ర్టీకి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.