హకీంపేట భూముల వేలం వాయిదా వేయండి
ABN , Publish Date - Jun 24 , 2026 | 05:01 AM
హకీంపేట్ పరిధిలోని 8.24 ఎకరాల భూమి వేలాన్ని వాయిదా వేయాలని హెచ్‌ఎండీఏకు హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది.
హెచ్‌ఎండీఏకు హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): హకీంపేట్ పరిధిలోని 8.24 ఎకరాల భూమి వేలాన్ని వాయిదా వేయాలని హెచ్‌ఎండీఏకు హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఈ భూమి వివాదంపై విచారణకు అడ్వకేట్ కమిషనర్లను నియమించిన నేపథ్యంలో నివేదిక వచ్చే వరకు వేచిచూడాలని స్పష్టంచేసింది. సంయుక్త భూసర్వే నిర్వహించకుండా సర్వే నెంబర్ 102/2, 102/3లో ఉన్న 8. 24 ఎకరాల భూమికి హెచ్‌ఎండీఏ వేలం నోటిఫికేషన్ ఇవ్వడం చెల్లదని పేర్కొంటూ చట్టుపక్కల ఉన్న పలు హౌసింగ్ సొసైటీలు, ప్లాట్ల యజమానులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదిస్తూ హద్దులు గుర్తించకుండా వేలం వేస్తే భవిష్యత్తులో భూవివాదాలు వస్తాయని, వేలం నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ కంచె వేసి ఉన్న ప్రభుత్వ భూములకు మాత్రమే వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. వచ్చే నెల 4న అన్ని పక్షాల సమక్షంలో సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది. అప్పటివరకు వేలం నిలిపేయాలని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే నెల 20కి వాయిదా వేసింది.