Share News

డబ్బిచ్చే కొన్నాం కానీ.. మా బిడ్డను మాకిప్పించండి

ABN , Publish Date - Feb 14 , 2026 | 03:36 AM

నెల వయస్సు ఉన్న ఆడ శిశువును అక్రమ మార్గంలో డబ్బులిచ్చి కొనుగోలు చేశామని, తమ తరఫున తప్పు జరిగిపోయిందని...

డబ్బిచ్చే కొన్నాం కానీ.. మా బిడ్డను మాకిప్పించండి

  • హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కి దత్తత తల్లిదండ్రుల వేడుకోలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): నెల వయస్సు ఉన్న ఆడ శిశువును అక్రమ మార్గంలో డబ్బులిచ్చి కొనుగోలు చేశామని, తమ తరఫున తప్పు జరిగిపోయిందని, కానీ పెంచిన ప్రేమను, బిడ్డ సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని నల్లగొండ శిశు సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో ఉన్న చిన్నారి శరణ్యను తమకే అప్పగించాలని ముత్తినేని వెంకన్న దంపతులు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను వేడుకున్నారు. నల్లగొండ జిల్లా చిన్న సూరారం గ్రామానికి చెందిన ముత్తినేని వెంకన్న దంపతులు నక్క యాదగిరి అనే మధ్యవర్తి వద్ద నెల వయస్సు ఉన్న బాలికను తీసుకుని 2023లో శాస్త్రబద్ధంగా ఆ చిన్నారిని దత్తత చేసుకున్నారు. చిన్నారికి శరణ్య అనే పేరు పెట్టుకున్నారు. ఈలోగా కొంతమంది అక్రమంగా దత్తత తీసుకున్నారని వెంకన్నపై, మధ్యవర్తిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దీంతో చిన్నారి శిశు సంక్షేమ కమిటీ వద్దకు చేరింది. చిన్నారిని తమకు అప్పగించాలని కోరుతూ వెంకన్న దంపతులు హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి ధర్మాసనం.. అక్రమ మార్గంలో దత్తత చెల్లదని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై వెంకన్న దంపతులు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో అప్పీలు చేయగా.. ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది రాఖీ శ్రీధరన్‌ వాదిస్తూ.. బిడ్డను దత్తత తీసుకునే క్రమంలో తప్పు జరిగిపోయిందని.. డబ్బులిచ్చి కొన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే బిడ్డ సంక్షేమమే అంతిమమని.. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఇటీవల సుప్రీంకోర్టు ఆర్టికల్‌ 142 (సంపూర్ణ న్యాయం)ను ఉపయోగించి ఇదే తరహా కేసుల్లో దత్తత తల్లిదండ్రులకే బిడ్డలను ఇవ్వాలని తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. మరోవైపు శిశు సంక్షేమ కమిటీ, మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఇది చైల్డ్‌ ట్రాఫికింగ్‌ రాకెట్‌ అని.. అందులో భాగంగానే 16 మంది పిల్లలను అమ్మేశారని.. అందులో ఈ పాప కూడా ఉందని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ‘పిటిషనర్లు చైల్డ్‌ ట్రాఫికింగ్‌ నిందితుల నుంచి కొనుగోలు చేసి దత్తత తీసుకున్నారు. సుప్రీంకోర్టుకు ఉన్న ప్రత్యేకాధికారం ఆర్టికల్‌ 142 కింద తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఆ కేసులకే పరిమితం.. అదే తీర్పును ఇక్కడ అమలు చేయాలని ఎలా కోరుతారు’ అని ప్రశ్నించింది. ఆ పాపకు సంబంధించి చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ విచారణ నివేదిక, కమిటీ ఎదుట ఉన్న ప్రొసీడింగ్స్‌ వివరాలు సమర్పించాలని కోరింది.

Updated Date - Feb 14 , 2026 | 03:36 AM