Share News

ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను సహించవద్దు

ABN , Publish Date - Feb 13 , 2026 | 05:57 AM

ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను సహించరాదని, ఆయా ఆక్రమణల తొలగింపు, ఫుట్‌పాత్‌ల పునరుద్ధరణ ఓ నిరంతర కార్యక్రమంలా చేపట్టాలని మునిసిపల్‌, జీహెచ్‌ఎంసీ అధికారులను హైకోర్టు ఆదేశించింది....

ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను సహించవద్దు

  • ఆక్రమణల తొలగింపు నిరంతర ప్రక్రియగా చేపట్టాలి

  • సుప్రీం కోర్టు, హైకోర్టు తీర్పులు అమలు చెయ్యాల్సిందే

  • మునిసిపల్‌, జీహెచ్‌ఎంసీ అధికారులకు హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను సహించరాదని, ఆయా ఆక్రమణల తొలగింపు, ఫుట్‌పాత్‌ల పునరుద్ధరణ ఓ నిరంతర కార్యక్రమంలా చేపట్టాలని మునిసిపల్‌, జీహెచ్‌ఎంసీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఏదైనా ఘటన జరిగినప్పుడో, ఫిర్యాదులు అందినప్పుడో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై చర్యలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాగ్‌లింగంపల్లి ఎంఐజీ-2, బ్లాక్‌ నెంబర్‌ 9లోని ఫ్లాట్‌ నెంబర్‌ 4 వద్ద ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ 41 డిప్యూటీ కమిషనర్‌ జారీ చేసిన షోకాజ్‌ నోటీసును సవాల్‌ చేస్తూ ఇందుమతి అనే మహిళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ కాలినడక వెళ్లేవారు ప్రమాదాలకు గురికాకుండా నడకదారులు (ఫుట్‌పాత్‌) కచ్చితంగా ఉండాలి. హైదరాబాద్‌లో చాలా రోడ్లలో ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురయ్యాయి. కోర్టులు ఆదేశించినప్పుడో లేదా ఆక్రమణల వివాదాలు మీడియాలో వచ్చినప్పుడు మాత్రమే ప్రత్యేక డ్రైవ్‌లు చేపడుతూ అధికారులు హడావుడి చేస్తున్నారు. మళ్లీ కొన్ని రోజుల్లోనే ఆక్రమణలు యథాతథ స్థితికి వస్తున్నాయి. ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపు, పునరుద్ధరణను మునిసిపల్‌ అధికారులు నిత్య కార్యక్రమంలా చేపట్టాలి. పౌరులు పన్నులు కడుతున్నా మౌలిక సౌకర్యాలకు నోచుకోవడం లేదు. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు, పునరుద్ధరణ చర్యలపై స్పష్టమైన కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ అమలు చేయకపోవడం సుపరిపాలన అనిపించుకోదు. తగిన సమయంలో చర్యలు తీసుకోకపోతే ఆక్రమణదారులు శాశ్వత హక్కులు పొందుతారు’ అంటూ మునిసిపల్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక, ఇందుమతి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఫుట్‌పాత్‌ల విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు పాటించని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపుపై సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని, సంబంధిత నివేదికను మూడునెలల్లో సమర్పించాలని పేర్కొంటూ విచారణను ముగించింది.

Updated Date - Feb 13 , 2026 | 05:57 AM