హైడ్రాకు మరిన్ని అధికారాలు
ABN , Publish Date - May 19 , 2026 | 04:39 AM
హైడ్రా కు మరిన్ని అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం రెండు కీలక ఉత్తర్వులిచ్చింది. టెండర్ల ఖరారు కోసం అధికారాల వికేంద్రీకరణతోపాటు..
రూ.10 కోట్ల లోపు టెండర్ల ఖరారు బాధ్యత కమిషనర్‌కే
వర్షాకాల అత్యవసర పనులు కూడా..
హైదరాబాద్, మే18 (ఆంధ్రజ్యోతి): హైడ్రా కు మరిన్ని అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం రెండు కీలక ఉత్తర్వులిచ్చింది. టెండర్ల ఖరారు కోసం అధికారాల వికేంద్రీకరణతోపాటు.. వర్షాకాలం అత్యవసర పనులను జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ల పరిధిలోనూ హైడ్రా ద్వారా నిర్వహించాలని సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 548 ప్రకారం.. రూ.10 కోట్ల లోపు ఉన్న పనులను హైడ్రా కమిషనర్ స్వయంగా ఖరారు చేయవచ్చని ప్రభుత్వం అనుమతించింది. అంతకుమించి ఉన్న పనుల విషయంలో ప్రజారోగ్య శాఖ ఈఎన్ సీ ఆధ్వర్యంలో ప్రత్యేక టెండరు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇక జీవో 549 ద్వారా రానున్న వర్షాకాలంలో మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అత్యవసర పనుల బాధ్యతను హైడ్రాకి అప్పగించింది. పట్టణ వరదల నిర్వహణ, క్యాచ్ పిట్‌లను శుభ్రం చేసే పనులు, చెట్లు, నీటి నిల్వ తొలగింపు, నాలాల పూడిక తీత వంటి అత్యవసర పనులను హైడ్రా చేపట్టనుంది. ఇందుకు అవసరమైన నిధులను జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లు సమకూర్చాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.