Share News

అద్దె భారం తగ్గింది

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:14 AM

అనవసరపు అద్దె భారాన్ని తగ్గించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఏళ్లకేళ్లుగా కోట్ల రూపాయలు అద్దె చెల్లిస్తూ ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న 39 ప్రభుత్వ కార్యాలయాలకు పలు సర్కారీ భవనాల్లో స్థలం కేటాయించింది.

అద్దె భారం తగ్గింది

  • హైదరాబాద్‌లో అద్దె భవనాల్లో ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాలకు సర్కారీ భవంతుల్లో చోటు

  • 39 విభాగాలకు 3.55 లక్షల అడుగుల స్థలం

  • వాణిజ్య పన్నుల విభాగానికి 1,95,500 చ.అడుగులు

  • పలు స్థలాల కేటాయింపులపై గందరగోళం

  • ఐటీ శాఖకు చెందిన టీ-హబ్‌కు న్యాక్‌ భవనంలో

  • టీ-హబ్‌లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు స్థలం

హైదరాబాద్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): అనవసరపు అద్దె భారాన్ని తగ్గించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఏళ్లకేళ్లుగా కోట్ల రూపాయలు అద్దె చెల్లిస్తూ ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న 39 ప్రభుత్వ కార్యాలయాలకు పలు సర్కారీ భవనాల్లో స్థలం కేటాయించింది. ఈ మేరకు సీఎస్‌ రామకృష్ణారావు గురువారం సర్య్కులర్‌ జారీ చేశారు. ప్రైవేటు భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల కోసం ఏకంగా ఏటా రూ.800 కోట్ల మేర అద్దె చెల్లిస్తున్నట్టు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దిద్దుబాటు చర్యలు చేపట్టింది. జనవరి 28 నాటికల్లా ఆయా కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. దీనిపై కసరత్తు చేపట్టిన అధికారులు.. హైదరాబాద్‌లో 60 ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు ప్రైవేటు భవనాల్లో ఉన్నాయని.. అవన్నీ కలిపి సుమారు 4.39 లక్షల చదరపు అడుగుల స్థలం వినియోగిస్తున్నాయని తేల్చారు. వాటిని తరలించడం కోసం ఆర్‌ అండ్‌ బీ శాఖ అధికారులు పరిశీలన చేపట్టి.. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో సుమారు 4 లక్షల చదరపు అడుగుల అదనపు స్థలం ఉన్నట్టు గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. ఉన్నతాధికారులు ఆ స్థలాలు, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి.. 39 కార్యాలయాలకు 3,55,454 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు. అత్యధికంగా వాణిజ్య పన్నుల విభాగానికి పలుచోట్ల కలిపి 1,95,500 చదరపు అడుగులు ఇచ్చారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు (ఎస్సార్వో) పలుచోట్ల కలిపి 43,400 చదరపు అడుగులు కేటాయించారు. ఇదే తరహాలో పలు శాఖల పరిధిలోని విభాగాలకు ప్రభుత్వ భవనాలను కేటాయించారు. ఇందులో చాలా వరకు హౌసింగ్‌ బోర్డు పరిధిలో ఉన్నాయి.


సంబంధం లేని కార్యాలయాల్లో.. పనికి దూరంగా...

పలు ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాల కేటాయింపులో కొంత గందరగోళం ఏర్పడింది. పలు కార్యాలయాలను అవి పనిచేసే పరిధిలోని ప్రాంతాల నుంచి దూరంగా తరలించడం.. కొన్నింటిని సంబంధం లేని భవనాల్లోకి మార్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బేగంపేటలో ఉండే వాణిజ్య పన్నుల విభాగం బేగంపేట డివిజన్‌ ఆఫీసుకు హైటెక్‌సిటీ సమీపంలోని టీ-హబ్‌ భవనంలోకి మార్చారు. టీ-హబ్‌లో ఉండాల్సిన ఐటీ శాఖకు చెందిన టీ-ఫైబర్‌ విభాగానికి హైటెక్‌ సిటీలోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌) భవనంలో స్థలం కేటాయించారు. ప్రజలకు దగ్గరగా ఉండాల్సిన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల (ఎస్సార్వో)కు కూడా టీ-హబ్‌లో స్థలాన్ని కేటాయించారు. నిజానికి ఐటీ శాఖకు అనుబంధంగా ఉండే టీ-ఫైబర్‌, డైరెక్టర్‌ ఎలక్ర్టానిక్స్‌, చీఫ్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ (సీఆర్‌వో) కార్యాలయాలకు టీ-హబ్‌లో స్థలం కేటాయించి ఉండాల్సిందని ఆయా శాఖల అధికారులు పేర్కొంటున్నారు. పలు విభాగాలు, కార్యాలయాలకు కేటాయించిన స్థలాల విషయంలో పునఃపరిశీలన చేయాలని కోరుతున్నారు. పంచాయతీరాజ్‌తోపాటు పలు శాఖల విభాగాలకు ఇంకా స్థలాన్ని కేటాయించలేదు. త్వరలోనే రెండోదశ కేటాయింపులు ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

సొంత భవనాల్లోకి వెళ్లనున్న విభాగాలు, కార్యాలయాలు ఇవే..

  • విద్యుత్‌ శాఖ పరిధిలోని బైరామల్‌గూడ, బౌరాన్‌పేట సర్కిల్‌ కార్యాలయాలకు మొజాంజాహి మార్కెట్‌ రోడ్‌లోని హౌసింగ్‌ బోర్డు తుల్జాగూడ కాంప్లెక్స్‌లో స్థలం కేటాయించారు.

  • పంజాగుట్ట, సికింద్రాబాద్‌, అబిడ్స్‌లోని వాణిజ్య పన్నుల శాఖ డివిజన్‌ కార్యాలయాలను నాంపల్లిలోని హౌసింగ్‌ బోర్డు పరిధిలోని మనోరంజన్‌ భవనంలోకి, బేగంపేట డివిజన్‌ ఆఫీసును టీ-హబ్‌లోకి మార్చారు. రెడ్‌హిల్స్‌లోని అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ చిట్స్‌ కార్యాలయానికి తుల్జాగూడ కాంప్లెక్స్‌లో స్థలం కేటాయించారు.

  • పురానీహవేలిలోని యూత్‌ అడ్వాన్స్‌మెంట్‌ విభాగాన్ని నాంపల్లి హౌసింగ్‌ బోర్డు పరిధిలోని గగన్‌విహార్‌ భవనంలోకి మార్చారు.

  • బంజారాహిల్స్‌, ముషీరాబాద్‌, చిక్కడపల్లి ఎక్సైజ్‌ ఆఫీ్‌సలను ఎర్రమంజిల్‌లోని ఆర్‌ అండ్‌ బీ భవనంలోని రెండో అంతస్తుకు మార్చారు.

  • ఎస్సార్‌ నగర్‌, బాలానగర్‌లోని ఎస్సార్వో కార్యాలయాలకు వెంగళరావునగర్‌లోని వైద్యారోగ్య శాఖ క్వార్టర్లలో... వట్టినాగులపల్లి, నార్సింగి, ప్రశాంత్‌నగర్‌లోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు టీ-హబ్‌ భవనాల్లో స్థలం కేటాయించారు.

  • తార్నాక, చంద్రాయణగుట్ట, నారాయణగూడ, మోతిగల్లీలలో ఉన్న ఆర్థిక శాఖ విభాగాలకు నాంపల్లి హౌసింగ్‌ బోర్డు పరిధిలోని గృహకల్ప భవనంలో స్థలం కేటాయించారు.

  • నాంపల్లిలోని మైనారిటీస్‌ స్టడీ సర్కిల్‌, కెరీర్‌ కౌన్సెలింగ్‌ కేంద్రానికి బషీర్‌బాగ్‌లోని షక్కర్‌ భవనంలో స్థలం కేటాయించారు.

Updated Date - Jan 23 , 2026 | 04:14 AM