కబ్జాలో రూ.10 లక్షల కోట్ల విలువైన సర్కారు భూములు
ABN , Publish Date - May 08 , 2026 | 06:52 AM
గ్రేటర్ హైదరాబాద్, అవుటర్ రింగ్‌రోడ్డు పరిధిలో రూ.10 లక్షల కోట్ల విలువైన భూములు కబ్జాలో ఉన్నాయని, వాటిలో రూ.85 వేల కోట్ల విలువైనవి స్వాధీనం చేసుకున్నామని..
రూ.85 వేల కోట్ల భూముల స్వాధీనం
‘హైడ్రా రక్ష’ పోర్టల్‌లో ఆ వివరాలు
రాజకీయాలకతీతంగా కూల్చివేతలు
‘ ప్రజావాణి’కి ఫిర్యాదుల వెల్లువ
ఫిర్యాదుల స్వీకరణకు నెల విరామం
హైడ్రా కమిషనర్ ఏవీ. రంగనాథ్
మిర్యాలగూడ, మే 7 (ఆంధ్రజ్యోతి) : గ్రేటర్ హైదరాబాద్, అవుటర్ రింగ్‌రోడ్డు పరిధిలో రూ.10 లక్షల కోట్ల విలువైన భూములు కబ్జాలో ఉన్నాయని, వాటిలో రూ.85 వేల కోట్ల విలువైనవి స్వాధీనం చేసుకున్నామని హైడ్రా కమిషనర్ ఏవీ. రంగనాథ్ చెప్పారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములు 2,100 ఎకరాలను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.85 వేల కోట్ల వరకు ఉంటుందన్నారు. వారం వారం నిర్వహించే ‘ప్రజావాణి’లో అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని, సుమారు 30 వేల ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వీటిని పరిష్కరించేందుకు, ఫిర్యాదుల స్వీకరణకు నెల రోజులపాటు విరామం ఇచ్చామన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎంఐఎం, అధికార, ప్రతిపక్ష నేతల అక్రమ కట్టడాలను సైతం కూల్చివేశామని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అక్రమ కట్టడాలుగా గుర్తిస్తే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే చట్టబద్ధత కలిగిన హైడ్రా వాటిని తొలగించవచ్చని వివరించారు. హైడ్రా రక్షించిన భూములకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయటంతో పాటు హైడ్రా రక్ష పోర్టల్‌లో సంబంధిత వివరాలు పొందుపరిచామని ఏవీ రంగనాథ్ తెలిపారు. దీంతో భవిష్యత్‌లోనూ ఆ భూములు ఆక్రమణకు గురి కాకుండా చూడవచ్చన్నారు. ఇప్పటి వరకు 25 చెరువులను స్వాధీనం చేసుకున్నామని, మరో 100 చెరువుల స్వాధీనానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన డిప్యూటీ సీఎం సీపీఆర్వో మధుసూదన్ సంస్మరణ సభకు హాజరై నివాళులర్పించారు.