కోర్టు కేసుల్లో 12 లక్షల గజాల ప్రభుత్వ స్థలాలు!
ABN , Publish Date - Aug 10 , 2026 | 06:23 AM
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాలో దాదాపు 12 లక్షల చదరపు గజాల ప్రభుత్వ స్థలాలు కోర్టు కేసుల్లో ఉన్నాయి. మొత్తం ప్రభుత్వ భూమి 21.74 లక్షల చదరపు గజాల స్థలాలుండగా..
రాజధాని హైదరాబాద్‌లో ఇదీ పరిస్థితి
మొత్తం ప్రభుత్వ స్థలాలు 21.74 లక్షల చదరపు గజాలు.. దాంట్లో సగానికిపైగా న్యాయపరమైన చిక్కుల్లోనే!
వాటి సమీప ఇళ్ల యజమానులకు తిప్పలు
నిషేధిత జాబితాలో పెట్టడంతో క్రయవిక్రయాలకు ఆటంకం
22ఏతో హడలిపోతున్న బాధితులు
న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి
దృష్టి సారించిన కలెక్టర్.. వివరాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు ఆదేశం
ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాలో దాదాపు 12 లక్షల చదరపు గజాల ప్రభుత్వ స్థలాలు కోర్టు కేసుల్లో ఉన్నాయి. మొత్తం ప్రభుత్వ భూమి 21.74 లక్షల చదరపు గజాల స్థలాలుండగా.. అందులో సగానికిపైగా న్యాయపరమైన వివాదాల్లోనే చిక్కుకోవటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ అంశంపై హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలా దృష్టి సారించారు. ‘కోర్టు కేసుల్లో ఎన్ని సర్కారు స్థలాలు ఉన్నాయి? రెవెన్యూ తరఫున కౌంటర్లు సరిగా దాఖలు చేస్తున్నారా? లేదా? వాటి తాజా పరిస్థితి ఏమిటి?’ తదితర అంశాలపై సమగ్ర వివరాలను 2-3 రోజుల్లో తనకు సమర్పించాలని రెవెన్యూ పరిధిలోని వివిధ విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో తహసీల్దార్లు, అధికారులు అప్రమత్తమయ్యారు. వివిధ కోర్టుల్లో 238 కేసులు హైదరాబాద్ జిల్లాలోని 16 మండలాల పరిధిలో 1139 ప్రభుత్వ ల్యాండ్ బ్యాంకు పార్సిళ్లు ఉన్నాయి (ఏదైనా ప్రాంతంలోని మొత్తం భూమిని ఒక పార్సిల్‌గా పరిగణిస్తారు). మొత్తం ప్రభుత్వ ల్యాండ్ పార్సిళ్లలో 21,74,479.68 చదరపు గజాల స్థలాలుండగా.. అందులో 169 ల్యాండ్ పార్సిళ్లలోని సుమారు 11,93,595.12 చదరపు గజాల ఖాళీ స్థలం కోర్టు కేసుల్లో ఉంది. ఇందులో షేక్‌పేట్ మండలంలో అత్యధికంగా 50 కేసులు ఉన్నాయి. ముషీరాబాద్‌లో 19, ఆసి్‌ఫనగర్‌లో 23, గోల్కొండలో 18, సైదాబాద్‌లో 16, మారెడ్‌పల్లిలో 16, ఖైరతాబాద్‌లో 16, నాంపల్లిలో 9, సికింద్రాబాద్‌లో 12, అమీర్‌పేట్‌లో 13, అంబర్‌పేట్‌లో 12, బహదూర్‌పురాలో 3, బండ్లగూడలో 9, చార్మినార్‌లో 3, హిమాయత్‌నగర్‌లో 7, తిరుమలగిరిలో 12 భూ సంబంధిత కేసులు నడుస్తున్నాయి. ఇవన్నీ సివిల్, హైకోర్టు, సుప్రీంకోర్టులలో ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి.
పొరపాటు ఎక్కడ జరిగింది?
అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్‌సీ), కోర్టు కేసుల్లో ఉన్న ప్రభుత్వ భూముల పక్కన ఉన్న ప్రైవేట్ స్థలాలను కూడా 22ఏ చట్టం నిషేధిత జాబితాలో పెట్టటంతో రాష్ట్రంలో అనేక మంది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇతర జిల్లాలతో పోల్చితే ఈ సమస్య హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఎక్కువగా ఉంది. ఈ సెక్షన్ కింద చూపిస్తున్న భూములను రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్టర్ చేయకుండా నిలిపివేస్తుండడంతో పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక అందజేసేందుకు హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలా సిద్ధమైనట్లు సమాచారం. కోర్టుల్లో నడుస్తున్న కేసుల ప్రభావం ప్రైవేటు పట్టా భూములపైన కూడా ఉందా? అన్ని రకాల హక్కులు కలిగిన భూములు ఎందుకు నిషేధిత జాబితాలోకి వెళ్లాయి? వాటిని రిజిస్ట్రార్లు ఎందుకు తిరస్కరిస్తున్నారు? పొరపాటు ఎక్కడ జరిగిందనే విషయాన్ని పూర్తిగా పరిశీలించి వివరాలు ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రజలకు గుదిబండగా 22ఏ సెక్షన్
ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం తీసుకొచ్చిన 22ఏ సెక్షన్ సామాన్య, మధ్య తరగతి ప్రజలకు గుదిబండగా మారింది. హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన, కట్టుకున్న లక్షలాది ఇళ్లను, ఖాళీ స్థలాలను నిషేధిత జాబితా కింద చూపిస్తున్నారు. వాటి క్రయవిక్రయాల కోసం రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లినప్పుడు ఇది బయటపడుతోంది. ఇటీవల పత్రికలు, ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడంతో బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తహసీల్దార్ ఆఫీసుకు, కలెక్టరేట్లకు వెళ్లి వాకబు చేస్తున్నారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎన్ని రోజుల్లో ఎన్‌ఓసీ వస్తుంది అంటూ అధికారులను అడుగుతున్నారు. 22ఏ చట్టం నుంచి తమకు ఉపశమనం కల్పించాలని పలువురు బాధితులు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.