తగ్గిన బంగారం కొనుగోళ్లు
ABN , Publish Date - May 14 , 2026 | 03:51 AM
ఏడాది పాటు బంగారం కొనొద్దని ప్రధాని మోదీ పిలుపు, దిగుమతి సుంకం పెంపుతో పసిడి కొనుగోళ్లు తగ్గిపోయాయి. హైదరాబాద్‌లో రెండు రోజులుగా బంగారం..
రెండు రోజుల్లోనే 30-40శాతం తగ్గుదల
ప్రధాని మోదీ పిలుపు.. సుంకం పెంపు ప్రభావం
హైదరాబాద్ సిటీ, మే 13(ఆంధ్రజ్యోతి): ఏడాది పాటు బంగారం కొనొద్దని ప్రధాని మోదీ పిలుపు, దిగుమతి సుంకం పెంపుతో పసిడి కొనుగోళ్లు తగ్గిపోయాయి. హైదరాబాద్‌లో రెండు రోజులుగా బంగారం అమ్మకాలు 30-40 శాతం తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఏడాది పాటు ఎవరూ బంగారం కొనవద్దని, తద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయాలని ప్రధాని మోదీ హైదరాబాద్ వేదికగా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజల్లో పసిడి కొనుగోళ్లపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దానికి తోడు దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15 శాతానికి పెంచడంతో ఆ ప్రభావం కూడా పడింది. ప్రస్తుతం విక్రయాలు నిరాశాజనకంగా ఉన్నాయని, మరో నెల రోజుల పాటు శుభకార్యాలు, మూహూర్తాలు పెద్దగా లేకపోవడంతో మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. రిటైల్ బిజినెస్ ఒక్కసారిగా తగ్గడంతో కొంతమంది వ్యాపారులు తరుగు, తయారీ చార్జీలు తగ్గిస్తామని ఆఫర్లు ప్రకటిస్తున్నారు. గోల్డ్ ట్రేడింగ్ చేసేవారు ఎక్కువగా బంగారం బిస్కెట్లు కొంటుంటారని, రెండు రోజులుగా వారు కూడా కొనుగోళ్లను తగ్గించారని హోల్‌సేల్ డీలర్లు తెలిపారు. తులం బంగారం రూ.13 వేల వరకు పెరిగిందని, రెండు రోజులుగా విక్రయాలు గణనీయంగా తగ్గాయని మానేపల్లి జ్యువెలర్స్ అధినేత గోపికృష్ణ తెలిపారు. బంగారం విక్రయాలపై పూర్తిస్థాయి అంచనాకు రావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందేనని జనరల్ బజార్‌కు చెందిన వ్యాపారి బచ్చు మహేష్ పేర్కొన్నారు. కాగా, బుధవారం ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఒక్కసారిగా పెరిగి రూ.1,67.890కు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఏకంగా రూ.13,910 మేర పెరిగింది. 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.12,750 పెరిగి రూ.1,59,900కు చేరింది.