Share News

స్వీపర్‌ సర్‌!

ABN , Publish Date - Apr 09 , 2026 | 06:44 AM

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్‌)లో భాగంగా జీహెచ్‌ఎంసీ కనీస విద్యార్హత (పదో తరగతి), సాంకేతిక విషయాలపై ఏమాత్రం అవగాహన లేని పారిశుధ్య కార్మికులను, ఇతర సిబ్బందిని బూత్‌ స్థాయి అధికారులుగా (బీఎల్‌ఓలు) ఎంపిక చేసింది.

స్వీపర్‌ సర్‌!

  • జీహెచ్‌ఎంసీ పరిధిలో బీఎల్‌వోలుగా పారిశుధ్య కార్మికులు

  • టెన్త్‌ కూడా చదవనివారికి బాధ్యతలు.. 94 మంది ఎంపిక

  • యాప్‌లు, ఓటర్ల జాబితాల పరిశీలనపై వారికి అవగాహన ఏది?

  • సర్వేలో తీవ్ర ఇబ్బందులు.. సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌

  • విమర్శలతో దిద్దుబాటు చర్యలు.. ఆ 94 మంది తొలగింపు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్‌)లో భాగంగా జీహెచ్‌ఎంసీ కనీస విద్యార్హత (పదో తరగతి), సాంకేతిక విషయాలపై ఏమాత్రం అవగాహన లేని పారిశుధ్య కార్మికులను, ఇతర సిబ్బందిని బూత్‌ స్థాయి అధికారులుగా (బీఎల్‌ఓలు) ఎంపిక చేసింది. ఇలాంటి బీఎల్‌వోలు 94 మంది ఉన్నట్లు తేలడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల సేకరణ, ఓటర్ల జాబితా పరిశీలన, మొబైల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిన దృష్ట్యా ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది లేదా స్థానిక ప్రభుత్వ ఉద్యోగులను బీఎల్‌ఓలుగా ఎంపిక చేయాలి. వారికి ఒకటి రెండు రోజులు శిక్షణ ఇవ్వాలి. కానీ, అధికారులు మాత్రం పారిశుధ్య కార్మికులు, ఆఫీస్‌ సబార్డినేట్లను ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న 4,062 పోలింగ్‌ కేంద్రాలకు నియమించిన బీఎల్‌ఓల్లో పదో తరగతి కూడా ఉత్తీర్ణులు కాని వారు 94 మంది ఉన్నారు. దీంతో వారు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడడంతోపాటు సర్‌ సర్వే సక్రమంగా జరగడం లేదన్న ఫిర్యాదులు వచ్చాయి. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఇటీవల పాతబస్తీలోని బర్కాస్‌ ప్రాంతంలో వెలుగుచూసిన ఓ ఉదంతం అధికారుల నిర్వాకాన్ని బయటపెట్టింది. ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియపై కనీస అవగాహన లేకపోవడంతో దాని గురించి వివరించలేకపోయిన ఓ బీఎల్‌వో.. తాను ఓ పారిశుధ్య కార్మికుడినని ఒప్పుకోవడం సంచలనం సృష్టించింది. ఒక్కో బీఎల్‌ఓ పోలింగ్‌ కేంద్రం పరిధిలోని 1,200 నుంచి 1,500 వరకు ఉండే ఓటర్ల వివరాలను ఇంటింటికి వెళ్లి పరిశీలించాల్సి ఉంటుంది. గతంలో బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో సర్‌కు వెళ్లిన కిందిస్థాయి సిబ్బంది ఒత్తిళ్లకు గురవడం గమనార్హం. గడువులోగా పని పూర్తికాకపోవడం, ఒకవైపు ప్రజల ప్రశ్నలు, మరోవైపు అధికారుల వేధింపులు, ఇంకోవైపు రాజకీయ నాయకుల బెదిరింపులు మధ్య నలిగిపోయారు. ఒత్తిళ్లను తట్టుకోలేక కొందరు సిబ్బంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఇక్కడ బీఎల్‌ఓల తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో జీహెచ్‌ఎంసీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బల్దియాలోని ఎన్నికల విభాగం అధికారులు కనీస విద్యార్హత లేని 94 మంది బీఎల్‌ఓలను తొలగించి, కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని బుధవారం నిర్ణయించారు.


ఏం చేస్తున్నారు..?

సర్‌లో భాగంగా హైదరాబాద్‌ జిల్లా పరిధిలో జీహెచ్‌ఎంసీ ఓటర్ల వివరాల క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. ఇంటింటికి వెళుతున్న సిబ్బంది.. యజమాని పేరు ప్రతిపాదికగా కుటుంబ సభ్యుల పేర్లు మొబైల్‌ యాప్‌లో మ్యాపింగ్‌ చేస్తున్నారు. ఇందుకోసం 2022, 2002 నాటి ఓటర్ల జాబితాను పరిశీలిస్తున్నారు. కుటుంబ యజమానిగా 40 ఏళ్లు దాటిన మహిళలు, పురుషులను పరిగణనలోకి తీసుకుని, ఇతర సభ్యుల పేర్లు కూడా యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఉదాహరణకు 55 ఏళ్ల ఓ వ్యక్తి ఓటు హక్కు వివరాలను 2002, 2022 ఓటర్ల జాబితాల్లో పరిశీలిస్తారు. అప్పటి పోలింగ్‌ బూత్‌ నంబర్‌, వార్డు, నియోజకవర్గం వివరాలను పరిగణనలోకి తీసుకొని ఆ వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉందా? వేర్వేరు ప్రాంతాల్లో ఉందా? అన్నది చూస్తారు. రెండు, మూడు చోట్ల ఓటు ఉంటే ఓటరు ఇష్టం మేరకు కేవలం ఒక చోట మాత్రమే కొనసాగిస్తారు. మిగతాచోట్ల తొలగిస్తారు. కాగా, పాతబస్తీలో సర్‌ సన్నాహక సర్వే తీరు చర్చనీయాంశంగా మారింది. బీఎల్‌ఓలతోపాటు ఓ పార్టీ ప్రతినిధులు ఇంటింటికి వెళుతుండడంపై ఇతర పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, జిల్లాలో ఇంకా అధికారికంగా సర్‌ సర్వే ప్రారంభం కాలేదని, షెడ్యూల్‌ ప్రకటన తర్వాత బీఎల్‌ఓలపై ఒత్తిడి పెరగకుండా ముందస్తుగా క్షేతస్ర్థాయి పరిశీలన ప్రారంభించామని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Apr 09 , 2026 | 06:45 AM