Share News

ఖాకీ వనంలో గంజాయి మొక్కలు

ABN , Publish Date - Aug 17 , 2026 | 05:57 AM

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధికి చెందిన ఎస్‌ఐ రాజేంద్ర నేతృత్వంలోని బృందం కొంతకాలం క్రితం సైబర్‌ నేరానికి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా పుణె వెళ్లింది.

ఖాకీ వనంలో గంజాయి మొక్కలు

  • గంజాయి, డ్రగ్స్‌ స్మగ్లర్లతో కొందరు పోలీసుల కుమ్మక్కు

  • దాడులు, తనిఖీలపై ముందుగానే స్మగ్లర్లకు లీకులు

  • నామమాత్రపు కేసులు, స్వాధీనం చేసుకునే సరుకులో తప్పుడు లెక్కలు

  • మామూళ్ల మత్తులో కొందరు ఎక్సైజ్‌, పోలీసు సిబ్బంది నిర్వాకాలు

హైదరాబాద్‌ సిటీ బ్యూరో ప్రతినిధి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధికి చెందిన ఎస్‌ఐ రాజేంద్ర నేతృత్వంలోని బృందం కొంతకాలం క్రితం సైబర్‌ నేరానికి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా పుణె వెళ్లింది. అక్కడ ఓ నైజీరియా పౌరుడి ఇంటిపై దాడి చేసి సైబర్‌ నేరానికి సంబంధించిన ఆధారాలతోపాటు భారీగా డ్రగ్స్‌ను గుర్తించింది. ఆ డ్రగ్స్‌ సంగతిని రికార్డుల్లో చూపని ఎస్‌ఐ రాజేందర్‌.. వాటిని హైదరాబాద్‌లోని తన ఇంట్లో దాచేశాడు. స్థానిక డ్రగ్‌ పెడ్లర్ల సాయంతో వాటిని అమ్మి డబ్బు చేసుకోవాలని అనుకున్నాడు. కానీ టీఎస్‌న్యాబ్‌ అధికారులు రాజేందర్‌ను పట్టుకున్నారు. రూ.లక్షల విలువైన 1.75 కిలోల మెథాక్వాలోన్‌ అనే డ్రగ్‌ను గుర్తించారు. రూ.10వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన చరిత్ర కూడా రాజేందర్‌కు ఉండడం గమనార్హం. హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఈగల్‌ టీం ఓ గంజాయి ముఠాపై దాడి చేయగా.. ఆ ముఠా పోలీసులపైకే శునకాలను వదిలింది. పోలీసులు ఆ ముఠాను పట్టుకొని విచారించగా.. బాలానగర్‌ ఎస్‌ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లకు ఆ ముఠాతో సంబంధాలు ఉన్నాయని తేలింది.కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌, కేపీహెచ్‌బీ సమీపంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో ఓ ఎన్‌ఆర్‌ఐ గంజాయి సేవించినట్లు తేలింది. అక్కడ విధుల్లో ఉన్న ఓ పోలీసు అధికారి ఆ ఎన్‌ఆర్‌ఐని భయపెట్టి రూ.14లక్షలు వసూలు చేశారు. ఈ సంగతి తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధి సదరు అధికారిని మందలించడంతో ఆ డబ్బును తిరిగి ఇచ్చేశారు.


ఖాకీ వనంలో గంజాయి మొక్కల మాదిరిగా తయారైన కొందరు పోలీసుల తీరు ఇది. డ్రగ్స్‌ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వం అంటుంటే.. కొందరు పోలీసులు మాత్రం ఈ మత్తు దందా చేసే వారికి సహకరిస్తున్నారు. నెలవారీ మామూళ్లు తీసుకోవడంతోపాటు ఆయా ముఠాలిచ్చే పార్టీలకు కూడా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసులు ముందుగా తమ శాఖలోని దొంగలపై దృష్టి పెట్టాలనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.

భరించలేనంత బరితెగింపు

గంజాయి, మాదకద్రవ్యాల ముఠాలతో సంబంధాలు పెట్టుకునే పోలీసుల బరితెగింపు ఏ స్థాయికి చేరుకుందంటే.. ఈగల్‌ బృందాలు దాడులకు వెళుతుంటే ఆ సమాచారాన్ని గంజాయి ముఠాలకు అందజేసి వారు తప్పించుకునేలా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పట్టుబడిన నిందితుల ఫోన్లు, కాల్‌ డేటా విశ్లేషణల్లో పలువురు పోలీసుల నెంబర్లు ఉండటంతో నిఘా వర్గాలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో గంజాయి పట్టుకున్నట్లుగా చెబుతున్నా.. పట్టుకున్న దాని కంటే చాలా తక్కువ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా కొందరు పోలీసులు తప్పుడు ప్రకటనలు ఇస్తున్న వైనాన్ని ఉన్నతాధికారులు గుర్తించి అంతర్గత విచారణ జరుపుతున్నారు. పోలీసు శాఖలో అవినీతి కొత్త కాకున్నా.. ఈ స్థాయి బరితెగింపు ఇటీవల ఎక్కువైందని ఉన్నతాధికారులు కూడా అనధికారికంగా ఒప్పుకుంటున్నారు.


టోకెన్‌ కేసుల వ్యూహం...

గంజాయి ముఠాలతో తమ అనుబంధం బయటకు పొక్కకుండా ఉండేందుకు కొందరు పోలీసు, ఎక్సైజ్‌ అధికారులు ఎత్తులు వేస్తున్నారు. తమ పరిధిలో అప్పుడప్పుడు దాడులు నిర్వహించి.. స్వల్ప మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రకటనలు (టోకెన్‌ కేసులు) విడుదల చేస్తున్నారు. మరికొందరు పోలీసులు తమ పరిధిలో అసలు కేసులే కట్టడం లేదు. కానీ, ఎస్‌ఓటీ, ఈగల్‌ బృందాలు ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో దాడులు చేసి గంజాయి కేసులు పెడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. హైదరాబాద్‌లో గంజాయి భారీగా అమ్మకాలు సాగుతాయన్న పేరున్న ప్రాంతాల్లో గడిచిన రెండేళ్లలో ఒక్క కేసు నమోదు కాని స్టేషన్లపై న్నతాధికారులు దృష్టి సారిస్తే విస్మయానికి గురి చేసే అంశాలు వెలుగు చూసే అవకాశం ఉందంటున్నారు. అలాగే, ఒకప్పుడు గుడుంబాకు అడ్డా అయిన హైదరాబాద్‌లోని ధూల్‌పేట ఇటీవల గంజాయి విక్రయాలకు కేంద్రంగా మారింది. గతంలో పోలీసులు మెరుపుదాడులు నిర్వహించి గంజాయి వినియోగించే వారిని అదుపులోకి తీసుకొని వారి కుటుంబసభ్యుల ఎదుట కౌన్సెలింగ్‌ నిర్వహించేవారు. ఇప్పుడు అలాంటి చర్యలు చేపట్టడం లేదు. హైదరాబాద్‌లో గంజాయి హాట్‌స్పాట్‌ల వివరాలు స్థానిక పోలీసులకు తెలిసినా చర్యలు తూతూ మంత్రంగానే ఉంటున్నాయనే విమర్శలు అధికమయ్యాయి.

గొలుసు తెంచితేనే!

గంజాయి, మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకట్ట వేసేందుకు లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు, ఎక్సైజ్‌, ఎస్వోటీ, హెచ్‌న్యూ, ఈగల్‌ వ్యవస్థలు ఉన్నాయి. ఇవన్నీ వేటికవే పని చేస్తున్నాయి. ఈ మధ్యన వీరి మధ్య సమాచార మార్పిడి కోసం సమన్వయం చేసుకునేలా సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటి మాదిరే ఈ వ్యవస్థల్ని కొనసాగిస్తూ.. విచారణ అధికారం మాత్రం ఒకరికే దఖలు పర్చటం ద్వారా అనైతిక బంధాలకు అడ్డుకట్ట వేసేందుకు వీలవుతుందన్న అభిప్రాయాన్ని మాజీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు వ్యక్తం చేశారు. గంజాయి, మాదకద్రవ్యాలను ఎవరు స్వాధీనం చేసుకున్నా.. ఆ కేసు దర్యాప్తు మాత్రం ఒకరి చేతిలో ఉండేలా మార్పులు చేయాలన్నారు. ఇలా చేస్తే..స్థానిక పోలీసుల పాత్ర నామమాత్రంగా మారి గంజాయి ముఠాలకు, అవినీతి పోలీసులకు మధ్య ఉన్న గొలుసు తెగుతుందని పేర్కొన్నారు.

Updated Date - Aug 17 , 2026 | 05:58 AM