Share News

ఒకేచోట ఒకేసారి 3 ఫ్లై ఓవర్లు!

ABN , Publish Date - Feb 16 , 2026 | 02:18 AM

సైబరాబాద్‌లోని ట్రాఫిక్‌ కారిడార్‌లో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు గాను ఓకేచోట మూడు ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారు.

ఒకేచోట ఒకేసారి 3 ఫ్లై ఓవర్లు!

  • గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌లో నిర్మాణం

  • ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌

హైద రాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): సైబరాబాద్‌లోని ట్రాఫిక్‌ కారిడార్‌లో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు గాను ఓకేచోట మూడు ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారు. నగరం నలుమూలల నుంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాల నిమిత్తం నిత్యం లక్షలాది మంది ఐటీ కారిడార్‌ ప్రాంతంలో రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌లో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరిచేందుకు ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ కేంద్రంగా ఒకేసారి మూడు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి పూర్వ జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. 4 మార్గాల్లో వచ్చే ట్రాఫిక్‌కు ఎక్కడా అంతరాయం లేకుండా సాఫీగా ముందుకు వెళ్లిపోయేలా ఈ ఫ్లైఓవర్లను డిజైన్‌ చేశారు. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసు ఉన్నతాధికారులతో పలుమార్లు సమన్వయ సమావేశం నిర్వహించిన జీహెచ్‌ఎంసీ, టీజీఐఐసీ అధికారులు ఒకే జంక్షన్‌లో మూడు ఫ్లై ఓవర్లను ఒకేసారి నిర్మించాలని నిర్ణయించారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలకు ఆస్కారం లేకుండా ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ విస్తరణతో పాటు ఫ్లై ఓవర్ల డిజైన్‌ చేసి పనులు చేపట్టారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ అవసరం లేకుండా నలువైపులా వాహనాల రాకపోకలు సాగేలా చూడనున్నారు. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు వెళ్లేందుకు వీలుగా ఒక ఫ్లైఓవరు, అదేవిధంగా శేరిలింగంపల్లి వైపు, డీఎల్‌ఎఫ్‌ వైపు నుంచి, మెహిదీపట్నం వైపు నుంచి వాహనాలు సాఫీగా వెళ్లేలా మరో రెండు ఫ్లైఓవర్లను డిజైన్‌ చేయించి ఇటీవలే నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం పిల్లర్ల నిర్మాణం జరుగుతోంది. ట్రిపుల్‌ ఐటీ వైపు స్థలాన్ని సేకరించి రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేశారు.

కోకాపేటకు సులభంగా..

కొండాపూర్‌, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి ఔటర్‌ రింగు రోడ్డు మీదకు సులభంగా వెళ్లేందుకు ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ కీలకంగా మారింది. ఇప్పటికే గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌తో అనుసంధానం ఉన్నా, ఇది మరో ప్రత్యామ్నాయ మార్గంగా మారనుంది. కోకాపేట నియోపొలిస్‌ ప్రాం తానికి వె ళ్లేలా ఫ్లై ఓవర్లను డిజైన్‌ చేశారు. పాత ముంబై హైవేలోని మెహిదీపట్నం-శేరిలింగంపల్లి మార్గంలో వెళ్లే వాహనదారులు ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా వెళ్లేలా రోడ్డు మార్గాన్ని విస్తరిస్తున్నారు.

Updated Date - Feb 16 , 2026 | 02:18 AM