Share News

అమ్మా నాన్నా ప్లీజ్‌ గొడవపడొద్దు..నేనెళ్లిపోతున్నా!

ABN , Publish Date - Jul 14 , 2026 | 05:49 AM

రేపటి కోసం గొప్ప కలలు కన్నాడు. కన్న తల్లిదండ్రులను గొప్పగా చూసుకోవాలనుకున్నాడు. కానీ, అమ్మా-నాన్న నిత్యం గొడవ పడుతుండడం చూసి తట్టుకోలేకపోయాడు.

అమ్మా నాన్నా ప్లీజ్‌ గొడవపడొద్దు..నేనెళ్లిపోతున్నా!

  • తల్లిదండ్రుల గొడవలకు బలైన బాలుడు

  • కన్నవారి ఘర్షణను నివారించేందుకు బాలుడి ప్రయత్నం

  • కోపంతో కొడుకును నెట్టేసిన తండ్రి

  • మనస్తాపానికి గురై బాలుడు ఆత్మహత్య

  • హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో విషాదం

హైదరాబాద్‌ సిటీ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రేపటి కోసం గొప్ప కలలు కన్నాడు. కన్న తల్లిదండ్రులను గొప్పగా చూసుకోవాలనుకున్నాడు. కానీ, అమ్మా-నాన్న నిత్యం గొడవ పడుతుండడం చూసి తట్టుకోలేకపోయాడు. మద్యం మత్తులో వచ్చి నాన్న రోజూ అమ్మతో గొడవ పడుతుంటే.. రాజీ చేద్దామని ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో, ఆ పసి హృదయం అర్ధంతరంగా తనువు చాలించింది. హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను పిండేస్తోంది. గచ్చిబౌలి వడ్డెరబస్తీకి చెందిన ఎల్లయ్య, అతని భార్య కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. ఎల్లయ్యకు ప్రతి రోజు మద్యం తాగిరావడం, భార్యతో గొడవ పడడం అలవాటుగా మారింది. భర్త వేధింపులు భరించలేక భార్య కూడా ఎదురుతిరిగేది. ఈనెల 11న రాత్రి కూడా ఎల్లయ్య తాగివచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అర్ధరాత్రివేళ తల్లిదండ్రులు కొట్టుకునే స్థాయికి వెళ్లడం చూసి, కుమారుడు మోహన్‌ (15) జోక్యం చేసుకున్నాడు. ‘రోజూ ఇలా గొడవ పడొద్దు నాన్నా.. ఏమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోండి’అంటూ సర్ధిచెప్పడానికి ప్రయత్నించాడు. కోపోద్రిక్తుడైన ఎల్లయ్య నువ్వు ఎవడివిరా చెప్పడానికి? నాకే ఎదురు చెప్పేంద ధైర్యం వచ్చిందా? అంటూ కొడుకును తోసేశాడు. తీవ్ర మనస్థాపం చెంచిన మోహన్‌, అమ్మమ్మ ఇంటికి వెళ్లి ఓ గదిలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లి గుండెలు బాదుకుంటూ భోరున విలపించడం అక్కడి వారిని కలచివేసింది.

Updated Date - Jul 14 , 2026 | 05:51 AM