ఓపెన్ పబ్‌లుగా క్రీడా మైదానాలు!
ABN , Publish Date - Apr 02 , 2026 | 02:58 AM
దేశ క్రీడా రాజధానిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షకు కొందరి కాసుల కక్కుర్తితో తూట్లు పడుతున్నాయి.
కచేరీలు, సభలు, విందులు, వినోదాలకు కేరాఫ్ అడ్ర్‌సగా మారుతున్న స్టేడియాలు
క్రీడాకారుల సాధనకు అడ్డంకిగా ఈవెంట్లు
ఒత్తిళ్లకు తలొగ్గుతున్న శాట్ అధికారులు
ఆట ఏదైనా సరే క్రీడాకారులు మైదానంలోకి అడుగుపెట్టే ముందు భూమాతకు నమస్కరిస్తారు. ఆ తర్వాతే బరిలోకి దిగుతారు. క్రీడాకారులు అంత పవిత్రంగా భావించే మైదానాలు.. నిర్వాహకుల కాసుల కక్కుర్తి వల్ల కళ తప్పుతున్నాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియాలు.. సంగీత కచేరీలు, బహిరంగ సభలు, కుల సంఘాల సమావేశాలకు, సినీ కార్యక్రమాలకు, క్రిస్మస్, ఇఫ్తార్ విందులకు కేరా్‌ఫగా మారిపోయాయి. క్రీడాకారులు ఉత్సాహంతో ఉరకలేయాల్సిన మైదానాలు.. మద్యం మత్తులో యువత వేసే చిందులకు అడ్డాలు అయిపోతున్నాయి.
హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): దేశ క్రీడా రాజధానిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షకు కొందరి కాసుల కక్కుర్తితో తూట్లు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా బడ్జెట్‌లో క్రీడారంగానికి భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తోంది కానీ, చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి పనులు జరగకపోగా.. హైదరాబాద్‌లోని ప్రముఖ స్టేడియాలు మాత్రం కన్వెన్షన్ హాళ్లుగా మారిపోతున్నాయి. గత ఏడాది దేవిశ్రీ ప్రసాద్ కాన్సర్ట్, రెండు వారాల కిందట అనిరుధ్ కాన్సర్ట్, మూడు రోజుల కిందట ఇళయరాజా కాన్సర్ట్‌తో గచ్చిబౌలి స్టేడియం సంగీత విభావరులకు కేరా్‌ఫగా మారిపోయింది. మరోవైపు.. సినిమా షూటింగ్‌లు, మ్యూజిక్ కాన్సర్ట్‌లు, క్రిస్మస్, ఇఫ్తార్ విందులు, రాజకీయ సభలు, కుల సమావేశాలకు ఎల్బీ స్టేడియం అడ్డా అయిపోయింది. అనిరుధ్, ఇళయరాజా కాన్సర్ట్‌ల కోసం రెండు వారాల పాటు గచ్చిబౌలి స్టేడియంను బుక్ చేయడంతో క్రీడాకారుల సాధనకు బ్రేక్ పడింది. ఇఫ్తార్ విందు, ఆతర్వాత జరిగిన ఒక సామాజిక వర్గ సభ కారణంగా దాదాపు పది రోజులు ఎల్బీ స్టేడియంలో క్రీడాకారుల ప్రాక్టీసు నిలిచిపోయింది.
మద్యం సీసాలు.. చెత్తాచెదారం
గత రెండు వారాంతాల్లో గచ్చిబౌలిలో జరిగిన మ్యూజిక్ కాన్సర్ట్‌ల్లో మద్యం పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అక్కడ బీరు ఏరులై పారింది. మద్యం మత్తులో యువత స్టేడియంను ఓపెన్ పబ్‌గా మార్చేశారు. బీరు సీసాలు కాన్సర్ట్ మరుసటి రోజున కూడా కుప్పలుగా స్టేడియంలో దర్శనమిచ్చాయి. అంతేకాక ఈ కాన్సర్ట్‌ల కోసం వేసే భారీ స్టేజీలు, సెట్లు సింథటిక్ ట్రాక్‌పై వేసేందుకు అనుమతి ఇవ్వడంతో ఎక్కడకక్కడ పెచ్చులూడి బాగు చేయడానికి కూడా వీలు లేనంతగా ట్రాక్ దెబ్బతింది. కొత్త సింథటిక్ ట్రాక్ వేయాలంటే దాదాపు రూ.10 కోట్లు ఖర్చు అవుతుందని, ఈ మొత్తం కాన్సర్ట్ నిర్వాహకులు భరిస్తారా? అని క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. ఎల్బీ స్టేడియం విషయానికొస్తే రెండు వారాల కిందట జరిగిన ఇఫ్తార్ విందులో కుప్పలుగా పోసిన మాంసాహార వ్యర్థాలను తొలగిస్తుండగానే ఒక సామాజిక వర్గం సమావేశానికి స్టేడియాన్ని ఇచ్చేశారు. దీంతో వ్యర్థాలతో స్టేడియం చిందరవందరగా ఉంది.
అద్దెలకిస్తే కానీ నడపలేరా?
కాన్సర్ట్‌లు, సినిమా షూటింగ్‌లు, ఇతరత్రా సభలతో అద్దెల రూపంలో స్టేడియాల నిర్వహణకు భారీగా నిధులు వస్తాయనుకుంటే పొరపాటే. కొన్ని కార్యక్రమాలకు అద్దె కాదు కదా కనీస అనుమతులు లేకుండా స్పోర్ట్స్ అథారిటీ అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేస్తుండడం గమనార్హం. ఈ స్టేడియాల పరిస్థితిని చూస్తోన్న క్రీడా ప్రేమికులు, క్రీడాకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేడియాల నిర్వహణకు కావాలంటే ప్రధాన స్టేడియాల పరిసరాల్లోని ఖాళీ ప్రదేశాల్లో వాణిజ్య సముదాయాలను అభివృద్ధి చేసి, అద్దెకు ఇవ్వండి కానీ ప్రధాన స్టేడియాలను విందులు, వినోదాల పేరుతో ధ్వంసం చేయవద్దని క్రీడాకారులు కోరుతున్నారు. క్రీడారంగానికి ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తున్నా ఇలాంటి ఈవెంట్ల నిర్వహణకు అడ్డు చెప్పకపోతే క్రీడాకారులకు నష్టం జరుగుతుందని వాపోతున్నారు. క్రీడా వాతావరణాన్ని దెబ్బ తీసే ఇలాంటి ఈవెంట్ల నిర్వహణకు సిఫారసులు చేసే బడానేతలు, ఉన్నతాధికారులను సీఎం నియంత్రించాలని క్రీడా సంఘాలు కోరుతున్నాయి.