సెల్లార్ కాదు.. శవపేటిక!
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:20 AM
హైదరాబాద్‌లోని ఓ ఫర్నిచర్ దుకాణంలో శనివారం చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు అగ్నికి ఆహుతి అయ్యారు.
మంటల్లో చిక్కుకున్న ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురి మృతదేహాల గుర్తింపు
పెను విషాదం మిగిల్చిన నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం
పూర్తిగా కమిలిపోయిన మృతదేహాలు
20 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్
ఉస్మానియాలో పోస్టుమార్టం పూర్తి
అంబులెన్సుల్లో స్వగ్రామాలకు తరలింపు
బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
దుకాణ యజమాని అరెస్టు, రిమాండ్
భవనాన్ని సీజ్ చేసిన జీహెచ్‌ఎంసీ
అఫ్జల్‌గంజ్/హైదరాబాద్ సిటీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఓ ఫర్నిచర్ దుకాణంలో శనివారం చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు అగ్నికి ఆహుతి అయ్యారు. ఆదివారం మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత సెల్లార్‌లో పూర్తిగా కమిలిపోయిన వారి మృతదేహాలను గుర్తించారు. ఈ ప్రమాదంలో వాచ్‌మేన్ పిల్లలు ప్రణీత్ (12), అఖిల్ (8), వారిని కాపాడేందుకు వెళ్లిన అదే దుకాణంలో పనిచేసే ఇంతిజాయ్ (26), హబీబ్ (30), స్వీపర్ బీబీ (50) మరణించారు. నాంపల్లిలోని చీరాగ్ గల్లీలో ఉన్న బచాస్ ఫర్నిచర్ క్యాసిల్ అనే దుకాణంలో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. సెల్లార్‌లో ఉన్న ఫర్నిచర్ గోదాములో రేగిన మంటలు భవనంలోని మొత్తం నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. వాచ్‌మేన్ యాదయ్య కుటుంబంతో పాటు బీబీ కుటుంబం కూడా సెల్లార్‌లోని గదుల్లో ఉంటున్నారు. యాదయ్య, లక్ష్మి దంపతులు బయటకు వెళ్లగా ప్రణీత్, అఖిల్ సెల్లార్‌లోని తమ గదిలో ఉన్నారు. బీబీ కూడా సెల్లార్‌లోనే ఉంది. సెల్లార్‌లో ఉన్నట్టుండి మంటలు వారి కేకలు విని ఇంతియాజ్, హబీబ్‌లు వారిని కాపాడేందుకు వెళ్లారు. ఐదుగురూ మంటల్లో చిక్కుకుని మరణించారు. శనివారం మధ్యాహ్నం నుంచి 20 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చిందని, ఆదివారం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఉదయం 9 గంటలకు ఒకటి, 11 గంటలకు మరొకటి, తర్వాత వెంటవెంటనే ముగ్గురి మృతదేహాలను గుర్తించి వెలికితీశామని అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. సెల్లార్‌లో ర్యాంపు వద్ద మహిళతో పాటు ఆమెను కాపాడటానికి వెళ్లిన ఇంతియాజ్ మృతదేహం లభించగా.. వాచ్‌మెన్ రూమ్‌లో ఇద్దరు చిన్నారులతో పాటు వారిని రక్షించేందుకు వెళ్లిన హబీబ్ మృతదేహం లభించింది. తమ ఇద్దరు పిల్లలు స్కూల్‌కు వెళ్లి ఉంటే బతికేవారని యాదయ్య, లక్ష్మి దంపతులు గుండెలవిసేలా రోదించారు. యాదయ్య కుటుంబం ఇబ్రహీంపట్నం మాల్ మర్రిగూడ నుంచి బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చింది. మరో మృతుడు నాంపల్లి సుభాన్‌పురాకు చెందిన ఇంతియాజ్ పదిహేనేళ్లుగా ఈ ఫర్నిచర్ దుకాణంలో ట్రాన్స్‌పోర్ట్ లిఫ్టర్‌గా పనిచేస్తున్నాడు. శాస్త్రిపురానికి చెందిన హబీబ్ ఇదే దుకాణంలో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన బీబీ గత పదేళ్లుగా ఇదే షాపులో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఆమె కొడుకు సమీర్ మరో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. చనిపోయిన వారి మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు.
పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించి, ప్రభుత్వ అంబులెన్సుల్లో స్వగ్రామాలకు పంపించారు. ఈ సమయంలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను తరలిస్తున్న అంబులెన్స్‌ను కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకుని ధర్నా నిర్వహించారు. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. చిన్నారులను చూడడానికి మంత్రులెవరూ రాకపోవడం విచారకరమన్నారు.
దుకాణ యజమాని అరెస్ట్
యాదయ్య ఇచ్చిన ఫిర్యాదుపై ఫర్నిచర్ షాఫు యజమాని సతీష్ బచా్‌సను అరెస్ట్ట్ చేశామని అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు వెళ్లిన సయ్యద్ మొయినుద్దీన్‌కు కాళ్లు, చేతులకు గాయాలవడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఫర్నిచర్ దుకా ణం నిర్వహిస్తున్న భవనాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్ చేశారు.