Share News

చిన్నవానకే ముంపు.. 200 కోట్ల నిర్లక్ష్యం!

ABN , Publish Date - Jun 11 , 2026 | 05:11 AM

వానలు మొదలైతే జనం పరవశించాలి. ఎండల తీవ్రత తగ్గుతుందని ఆనందపడాలి. కానీ హైదరాబాద్‌ మహానగరంలో చినుకుపడితే జనం వెన్నులో వణుకు పుడుతోంది. చెరువుల్లా మారే రహదారులు....

చిన్నవానకే ముంపు.. 200 కోట్ల నిర్లక్ష్యం!

  • హైదరాబాద్‌ నగరంలో వర్షాకాల సన్నద్ధత కోసం ఏటా ప్రత్యేకంగా పనులు

  • పూడికతీత నుంచి గుంతల పూడ్చివేత, రోడ్ల మరమ్మతులు, చెట్ల కొమ్మల కొట్టివేతదాకా..

  • పనుల్లో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం

  • వరద నీటి నిర్వహణలో వైఫల్యం

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): వానలు మొదలైతే జనం పరవశించాలి. ఎండల తీవ్రత తగ్గుతుందని ఆనందపడాలి. కానీ హైదరాబాద్‌ మహానగరంలో చినుకుపడితే జనం వెన్నులో వణుకు పుడుతోంది. చెరువుల్లా మారే రహదారులు, ఉప్పొంగే డ్రైనేజీలు, తెరిచి ఉండే మ్యాన్‌హోల్‌/క్యాచ్‌పిట్‌లు, తెగిపడే చెట్ల కొమ్మలు, విద్యుత్‌ వైర్లు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన దుస్థితి. ఈ తిప్పలు తప్పించేందుకు ఏటా వానాకాలానికి ముందే సన్నద్ధత కోసం చర్యలు చేపట్టాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏటా సుమారు రూ.200 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు లెక్కల్లో చూపుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటోంది. వానాకాల సన్నద్ధత పనులకు సంబంధించిన టెండర్లు కూడా పూర్తిగాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

అరగంట వానకే అతలాకుతలం

మంగళవారం హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో సుమారు అరగంట పాటు గట్టి వర్షం కురిసింది. దీనితో చాలాచోట్ల రోడ్లపై నీళ్లు నిలిచాయి. కార్లు పడవల్లా నీళ్లలో తేలియాడాయి. కిలోమీటర్లకొద్దీ ట్రాఫిక్‌ స్తంభిం చింది. విద్యుత్‌ తీగలు తెగిపడి బండ్లగూడ జహంగీర్‌బాద్‌ ప్రాంతంలో ఇద్దరు విద్యుత్‌షాక్‌తో మృతిచెందా రు. ఇప్పుడే కాదు ఏటా ఇదే తరహాలో ఇబ్బందులు త లెత్తుతున్నా అధికార యంత్రాంగం మొద్దునిద్ర వీడటం లేదు. వానాకాలానికి ముందే జాగ్రత్త పడటం లేదు.


కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నా ఫలితమేది?

ఏటా వానాకాలం సన్నద్ధత కోసం డ్రైనేజీలు, నాలాలు, మ్యాన్‌హోళ్లలో పూడికతీత, అత్యవసర, స్టాటిక్‌ బృందాల ఏర్పాటు, మోటార్లు, ఇతర పరికరాల కొనుగోళ్లు, రోడ్లపై గుంతల మరమ్మతులు, చెట్ల కొమ్మ ల కొట్టివేత తదితర పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఇక వానాకాలం ఆసాంతం కూలిన చెట్లు కొమ్మలు, విద్యుత్‌ స్తంభాల తొలగింపు, మురుగు నీటి నిర్వహణ వంటి పనులు ఉంటాయి. వీటన్నింటికి కోసం అత్యవసర, ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయాలి. 24 గంటలపాటు మూడు షిఫ్టుల్లో బృందాలు అందుబాటులో ఉండాలి. దీనితో వానాకాలం వచ్చిందంటే కొన్ని ప్రభుత్వ విభాగాల అధికారులకు పండుగ వచ్చినట్టేనని.. పనుల్లో భారీగా కమీషన్లు చేతులు మారుతాయని ఆరోపణలు ఉన్నాయి. ఏటా వానాకాలంలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, టీజీఎ్‌సపీడీసీఎల్‌, వాటర్‌బోర్డు తదితర విభాగాలు ప్రత్యేక బృందాల ఏర్పాటు, ఇతర పనుల కోసం రూ.200 కోట్ల వరకు ఖర్చు చేస్తాయని అంచనా. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధిలో గుర్తించిన 859 వరదనీరు నిలిచే ప్రాంతాల వద్ద ఆ బృందాలు పనిచేయాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ఆ బృందాలు వాటర్‌ ల్యాగింగ్‌ పాయింట్ల వద్ద ఉండి ఎప్పటికప్పుడు వరదనీరు తొలగేలా చర్యలు చేపడితే.. రోడ్లపై ముంపు, ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉండవని పదవీ విరమణ చేసిన ఇంజనీరింగ్‌ విభాగం అధికారి ఒకరు పేర్కొన్నారు.

మాన్‌సూన్‌ బృందాల ఏర్పాటు ఎప్పుడు?

వానాకాలం నేపథ్యంలో ఏటా జూన్‌ నుంచి అక్టోబరు వరకు అత్యవసర, స్టాటిక్‌ బృందాలు అందుబాటులో ఉండాలి. వాతావరణ శాఖ సూచనలను బట్టి అవసరమైతే నవంబరులోనూ కొనసాగిస్తారు. ఇందుకోసం ఏటా మే నెలలోనే టెండర్లు పిలిచి, అర్హత ఉన్న ఏజెన్సీలను ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించాలి. కానీ ఈసారి ఇంకా టెం డర్‌ ప్రక్రియ పూర్తి కాలేదు. అటు వానాకాలం మొదలైంది. ఒక్క గట్టివానతోనే నగరంలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. దీనితో ఏజెన్సీలను ఎప్పుడు ఎంపిక చేస్తారు? బృందాలు ఎప్పుడు రంగంలోకి దిగుతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


స్విమింగ్‌ పూల్స్‌లా ఫ్లైఓవర్లు..

రోడ్లపై వరద నీరు నిలవడం సాధారణమే. కానీ హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లపైనా వరద నిలిచి స్విమింగ్‌ పూల్స్‌లా మారిపోతున్నాయి. గత ఏడాది ఐటీ కారిడార్‌లోని కొత్తగూడ వంతెనపై భారీగా వరద నిలిచి, నాలుగైదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిందిపోయింది. తాజాగా మంగళవారం కురిసిన వర్షానికి ఇందిరాపార్కు- వీఎస్టీ వంతెనపైనా నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలిగింది. ఫ్లైఓవర్ల నుంచి నీళ్లు వెళ్లిపోయేందుకు ఏర్పాటు చేసే మార్గాలు (వెంట్‌లు/స్పౌట్‌లు) మట్టి, చెత్తాచెదారంతో నిండి మూసుకుపోవడమే దీనికి కారణం. వాటిని శుభ్రం చేస్తే ఈ సమస్య తప్పేది. కానీ పట్టించుకునేవారే లేరు.

వాన గంటన్నర.. విద్యుత్‌ అంతరాయం 22 గంటలు!

మంగళవారం సాయంత్రం వాన కురిసింది గంటన్నర పాటే.. కానీ హైదరాబాద్‌ నగరంలోని న్యూబాకారం, విద్యానగర్‌ అచ్యుత్‌రెడ్డి మార్గ్‌, సత్యనగర్‌కాలనీ, బాలాజీనగర్‌లో 22 గంటల పాటు.. సికింద్రాబాద్‌, ఆర్పీ నిలయం, నారాయణగూడ, గాంధీనగర్‌, అశోక్‌నగ ర్‌, వివేక్‌నగర్‌, చిక్కడపల్లి, దోమలగూడ, హిమాయత్‌నగర్‌, జవహర్‌నగర్‌, కవాడిగూడ ప్రాంతాల్లో 16 గంటల పాటు, చిలకలగూడ శ్రీనివాస్‌ నగర్‌ కాలనీలో 8 గంటలకుపైగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చెట్లు, కొమ్మలు, విద్యుత్‌ స్తంభాలు కూలిపడటంతో ఈ సమస్య ఏర్పడింది. దీనితో ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. సహాయక చర్యల్లో తీవ్ర జాప్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.

నీటి ముంపు, ట్రాఫిక్‌ సమస్యపై సమీక్ష

మంగళవారం సాయంత్రం కురిసిన వానతో ఐటీ కారిడార్‌లోని నాలెడ్జ్‌ సిటీ, మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌, టీ-హబ్‌ జంక్షన్‌, బయోడైవర్సిటీ జంక్షన్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్‌, కేబీఆర్‌ పార్క్‌ వైపు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో బుధవారం సైబరాబాద్‌ సీపీ ఎం.రమేశ్‌, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఆధ్వర్యంలో.. సీఎంసీ, ట్రాఫిక్‌, హైడ్రా, జలమండలి, ఎస్పీడీసీఎల్‌, టీజీఐఐసీ, ఇరిగేషన్‌, హెచ్‌జీసీఎల్‌, హెచ్‌ఎండీఏ, అర్బన్‌ ఫారెస్ట్‌ తదితర విభాగాల ప్రతినిధులతో ప్రత్యక్షంగా, జూమ్‌లో సమీక్షించారు. వర్షాకాలంలో ప్రజల భద్రత, ట్రాఫిక్‌ నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని సైబరాబాద్‌ సీపీ ఎం.రమేశ్‌ కోరారు. ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు సంబంధిత శాఖలతో కలిసి నిరంతరం పర్యటించాలని, నీటి ముంపు, ఇతర సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. కాగా, ఇటీవలి వర్షాలతో నగరంలో నీటి ప్రవాహం, వాటర్‌ ల్యాగింగ్‌ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించామని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు హైడ్రా ప్రత్యేక ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేసిందని వెల్లడించారు.

Updated Date - Jun 11 , 2026 | 05:11 AM