కొడుకు ‘రోబో చెయ్యి’ అడిగాడు.. తండ్రి చేసిచ్చాడు!
ABN , Publish Date - Aug 05 , 2026 | 05:14 AM
బడిలో నిర్వహించే ‘టెక్ ఫెయిర్’ కోసం రోబో తయారుచేయాలనుకున్నాడో విద్యార్థి! వెంటనే ఇంటికి వెళ్లి తండ్రికి ఆ మాట చెప్పాడు. కొడుకు ఆసక్తిని గమనించిన ఆ తండ్రి.. అతణ్ని ఏమాత్రం నిరుత్సాహపరచకుండా తానూ రంగంలోకి దిగాడు.
‘క్లాడ్’ ఏఐ సాయంతో కుమారుడి స్కూల్ ప్రాజెక్టు పూర్తి చేసిన తండ్రి
క్లిష్టమైన పనిని ఏఐ వినోదాత్మకంగా మార్చేసిందంటూ కితాబు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): బడిలో నిర్వహించే ‘టెక్ ఫెయిర్’ కోసం రోబో తయారుచేయాలనుకున్నాడో విద్యార్థి! వెంటనే ఇంటికి వెళ్లి తండ్రికి ఆ మాట చెప్పాడు. కొడుకు ఆసక్తిని గమనించిన ఆ తండ్రి.. అతణ్ని ఏమాత్రం నిరుత్సాహపరచకుండా తానూ రంగంలోకి దిగాడు. ఇద్దరూ కలిసి స్థానికంగా దొరికే ఉపకరణాలతో, ‘క్లాడ్’ ఏఐ సహాయంతో ఎట్టకేలకు.. వాయిస్ కమాండ్లతో పనిచేసే రోబోటిక్ ఆర్మ్‌ను తయారుచేశారు. ఎంతో క్లిష్టమైన ఈ పనిని ఏఐ సహాయంతో ఆడుతూపాడుతూ చేసేశామంటూ ఆ తండ్రి ‘రియల్‌హైదరాబాద్’ అనే ‘ఎక్స్’ ఖాతాలో పెట్టిన పోస్టు ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతోంది. ‘‘ఓ వారం క్రితం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన మా అబ్బాయి తమ స్కూల్‌లో టెక్ ఫెస్ట్ ఉంది, ఓ రోబో తయారు చేయాలనుకుంటున్నానని చెప్పాడు. మాకున్న సమయానికి రోబో తయారు చేయడమంటే చాలా పెద్ద లక్ష్యమే అనిపించింది. అందుకే వాయిస్ కమాండ్స్‌తో పనిచేసే రోబో చెయ్యి తయారు చేయాలని నిర్ణయించుకున్నాము. దానికి సంబంధించిన డిజైన్ల కోసం యూట్యూబ్‌లో వెతికి, క్లాడ్ సహాయంతో రోబోటిక్ ఆర్మ్ 3డీ డిజైన్‌లను రూపొందించాం. టోలిచౌకీలో ఆ డిజైన్‌ను ప్రింట్ చేయించాం. అతి తక్కువ ఖర్చుతో వారు దాన్ని ముద్రించి, ర్యాపిడో ద్వారా వేగంగా డెలివరీ చేశారు. ఆ తరువాత.. రోబోటిక్ ఆర్మ్ తయారీకి అవసరమైన మోటార్లు, చిప్స్, కెపాసిటర్లు, రెసిస్టర్లు, వైర్లను కోఠీలో కొనుగోలు చేశాం. వాయిస్ కమాండ్లకు అనుగుణంగా రోబోటిక్ ఆర్మ్ పనిచేయడానికి అవసరమైన కోడ్ రాయడానికి క్లాడ్‌నే వాడాం. దాంట్లోని ఏఐ ఏజెంట్లయిన ఓపస్ 5, ఫాబెల్‌తో డిజైన్‌ను మెరుగుపరిచాం’’ అని ఆ తండ్రి తన పోస్టులో వివరించారు. స్కూల్ ప్రాజెక్ట్ అయినప్పటికీ ఈ రోబో హ్యాండ్ తయారీ తమకు ఓ అద్భుత అనుభవంగా మిగిలిందని.. దీని పుణ్యమాని తన కుమారుడితో కలిసి నాణ్యమైన సమయం గడిపానని పేర్కొన్నారు.