కల్తీ టీ పొడి దందా బట్టబయలు
ABN , Publish Date - Apr 24 , 2026 | 03:57 AM
కల్తీ టీ పొడిని బ్రాండెడ్ ప్యాకెట్లలో పెట్టి విక్రయిస్తున్న 10 మందిని హైదరాబాద్ ఆహార కల్తీవిభాగం (హెచ్ ఫాస్ట్) అధికారులు అరెస్టు చేశారు.
హైదరాబాద్‌లో పది మంది అరెస్టు
హైదరాబాద్ సిటీ/అప్జల్‌గంజ్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): కల్తీ టీ పొడిని బ్రాండెడ్ ప్యాకెట్లలో పెట్టి విక్రయిస్తున్న 10 మందిని హైదరాబాద్ ఆహార కల్తీవిభాగం (హెచ్ ఫాస్ట్) అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన పరేష్ రాజన్, సంజు అలియాస్ పతి, సతీశ్, నవీన్, నరసింహ, చున్నీలాల్ చౌదరి, నరసింహులు, బీదర్‌కు చెందిన రవీందర్, మల్లేపల్లికి చెందిన వసీంలు.. నాసిరకం టీ పొడిలోకృత్రిమ రంగుల (సన్‌సెట్ ఎల్లో, టార్టార్జైన్)తోపాటు బెల్లం పాకం, వాడేసిన టీపొడి, కాలం చెల్లిన టీపొడిని కలిపి ఓ మిశ్రమాన్ని తయారు చేసి, దాన్ని ప్రసిద్ధ టీ బ్రాండ్ల ప్యాకెట్లలో పెట్టి గుట్టుగా విక్రయించేవారు. హైదరాబాద్‌లోని 15 ప్రాంతాల్లో దాడులు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్, హెచ్‌ఫాస్ట్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు.