Share News

మసాలాలు కాదు.. ప్రాణం తీసే రసాయనాలు

ABN , Publish Date - Aug 05 , 2026 | 04:48 AM

ఆహార పదార్థాల్లో వినియోగించే మసాలా దినుసులు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయా? చూడగానే వంటల్లో వేయాల్సిందేననిపిస్తోందా? అయితే.. ఒక్క క్షణం ఆలోచించాల్సిందే! ఎందుకంటే..

మసాలాలు కాదు.. ప్రాణం తీసే రసాయనాలు

  • మసాలా దినుసుల్లో విషపూరిత రంగుల వినియోగం

  • నాసిరకం దినుసులకు కెమికల్స్‌ కలిపి ప్రాసెసింగ్‌

  • ఆకర్షణీయంగా మార్చి.. బ్రాండెడ్‌ కవర్లలో మార్కెట్లోకి

  • పరీక్షల్లోనూ దొరకకుండా గ్యారంటీ కలర్స్‌ వాడకం

  • కాటేదాన్‌, బాలాపూర్‌లో హెచ్‌ఫా్‌స్ట దాడులు

  • 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్‌

  • ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

  • ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నేరగాళ్లు

  • కల్తీ దినుసులతో కాలేయం, క్యాన్సర్‌, జీర్ణకోశ వ్యాధులు

  • ఏళ్ల తరబడి కొనసాగుతున్న కల్తీ మసాలాల దందా

  • లక్షల మంది వినియోగదారులు.. రూ.కోట్లలో టర్నోవర్‌

  • భారీ నెట్‌వర్క్‌.. ఛేదించడానికి సిట్‌: సీపీ సజ్జనార్‌

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ఆహార పదార్థాల్లో వినియోగించే మసాలా దినుసులు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయా? చూడగానే వంటల్లో వేయాల్సిందేననిపిస్తోందా? అయితే.. ఒక్క క్షణం ఆలోచించాల్సిందే! ఎందుకంటే.. ఈ దినుసులు కూడా కల్తీ అవుతున్నాయి. మామూలుగా కాదు.. ఆరోగ్యానికి హాని కలిగించే విషపూరితమైన కెమికల్స్‌తో వీటిని కల్తీ చేస్తున్నారు. నాసిరకం దినుసులకు హానికరమైన కెమికల్స్‌ కలిపి ప్రాసెసింగ్‌ చేస్తున్నారు. ఆపై వాటిని ప్రముఖ బ్రాండెడ్‌ కవర్లలో ఆకర్షణీయంగా ప్యాకింగ్‌ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీటిని వినియోగించిన వారు కాలేయం, క్యాన్సర్‌, జీర్ణకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఇలా మసాలా దినుసులను కల్తీ చేసి మార్కెట్లోకి పంపిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ముఠా ఆటకట్టించారు హెచ్‌ ఫాస్ట్‌ పోలీసులు. పాలు లేకుండా యూరియా మిక్సింగ్‌తో పన్నీర్‌, ఫ్యాబ్రిక్‌ డై, రైస్‌బ్రాన్‌ ఆయిల్‌తో ఆవాలు, సింథటిక్‌ రంగులతో లవంగాలు, పారిశ్రామిక రంగులతో వాము, షాజీరా వంటి మసాలాలను ప్రాసెసింగ్‌ చేస్తున్నట్లు నిగ్గుతేల్చారు. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో మంగళవారం అడిషనల్‌ సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌, డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌తో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి, బాలాపూర్‌ పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీగా మసాలా దినుసులను కల్తీ చేసి మార్కెట్‌కు తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.


వెంటనే డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ పర్యవేక్షణలో హైదరాబాద్‌ ఫుడ్‌ అడాల్ట్రేషన్ సర్వైలెన్స్‌ టీమ్స్‌ (హెచ్‌ఫాస్ట్) పోలీసులు, జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఆ ప్రదేశాల్లో దాడి చేశారు. మొత్తం 13 యూనిట్లపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ప్రాణాంతకమైన విషపూరిత రసాయనాలు, దుస్తులు, చీరల తయారీలో వినియోగించే గ్యారెంటీ కలర్స్‌ను మిక్సింగ్‌ చేసి కల్తీ మసాలాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు మైలార్‌దేవ్‌పల్లిలో రెండు కేసులు, బాలాపూర్‌లో ఒక కేసు నమోదు చేశారు. పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను, అవుట్‌లెట్లను నిర్వహిస్తున్న కాటేదాన్‌కు చెందిన రాహుల్‌ బాటీ, బేగం బజార్‌కు చెందిన విశాల్‌ పన్వార్‌, దులీచంద్‌ కచ్చవాను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. వారి వద్ద నుంచి మొత్తం 25 టన్నుల కల్తీ మసాలాలను, 89టన్నులపైగా ముడిసరుకులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.


కెమికల్స్‌ కలిపి ప్రాసెసింగ్‌..

లవంగాల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలే నాసిరకం లవంగాలకు.. హానికర కెమికల్స్‌ కలిపి ప్రాసెసింగ్‌ చేస్తున్నారని సీపీ సజ్జనార్‌ తెలిపారు. లవంగాలతోపాటు ఆవాలు, షాజీరా, వాము, మెంతులు, జీలకర్ర, సోంపు, నువ్వులు వంటి మసాలా దినుసులనూ ఇలాగే ప్రాసెసింగ్‌ చేస్తున్నారని చెప్పారు. ఇందుకోసం ఇండోర్‌ నుంచి ప్రత్యేకమైన మెషినరీ తెప్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇలా కల్తీ చేసిన మసాలాలను మార్కెట్లో 30 నుంచి 50 శాతం తక్కువ ధరలకే విక్రయిస్తున్నారని, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌లు, ఇతర వ్యాపార సముదాయాల్లో ఈ నాసిరకం మసాలాలనే ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోందని వివరించారు. మసాలాల్లో వినియోగించే విషపూరితమైన కెమికల్స్‌ (అమ్మోనియం, మెర్క్యూరీ, లెడ్‌ వంటివి) ఆహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా ప్రజలు కాలేయం, క్యాన్సర్‌, జీర్ణకోశవ్యాధులు, మూత్రపిండాలు దెబ్బతినడం, కడుపునొప్పి, అల్సర్‌, అలర్జీ, చర్మవ్యాధులు, నరాల వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని సీపీ వివరించారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసి కూడా కెమికల్స్‌ను వినియోగిస్తున్న ముఠాలపై కఠినమైన (కల్పబుల్‌ హోమిసైడ్‌ ఎమాంగ్‌ టుది మర్డర్‌) సెక్షన్లు పెడుతున్నామని తెలిపారు.

దుస్తులకు వాడే రంగులతో..

ఆహారంలో ఉపయోగించే బుష్‌ సింథటిక్‌ ఆరెంజ్‌ రెడ్‌, గ్రీన్‌ ఫుడ్‌ కలర్స్‌తోపాటు దుస్తుల రంగులు (క్లాత్‌ డైస్‌), పారిశ్రామిక శాశ్వత రంగులు (ఇండస్ట్రియల్‌ పర్మినెంట్‌ కలర్స్‌) షైనింగ్‌ పౌడర్‌ (టాల్కమ్‌ పౌడర్‌), రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ వంటి విషపూరిత రసాయనాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక తయారీ కేంద్రంలో ఏకంగా.. నాసిరకం ఆవాలకు ఫ్యాబ్రిక్‌ డై, టాల్కమ్‌ పౌడర్‌, నూనె కలిపి కృత్రిమమైన మెరుపు, బరువు, పరిమాణాన్ని పెంచుతున్నట్లు తేలింది. మరికొన్ని యూనిట్లలో లవంగాలు, షాజీరా వంటి దినుసులకు ఆకర్షణీయమైన రంగు రావడం కోసం సింథటిక్‌ రంగులను పూస్తున్నారు. కొన్ని యూనిట్లలో షాజీరా, వాము(అజ్వైన్‌)లో పారిశ్రామిక రంగులను కలుపుతున్నట్లు గుర్తించారు.


సీజ్‌ చేసిన మసాలాలు ఇవే..

వాము 7,920 కిలోలు, జీలకర్ర 6,700 కిలోలు, లవంగాలు 550 కిలోలు, షాజీరా 2,280 కిలోలు, 500 కిలోల ముడిసరుకు, సోంప్‌ 540 కిలోలు, ఆవాలు 4,960 కిలోలు, ముడిసరుకు 65,000 కిలోలు, జీలకర్ర పొడి/డస్ట్‌ 2,350 కిలోలు, మెంతులు 13,460 కిలోలు, తెల్ల నువ్వులు 10,000 కిలోలు, షైనింగ్‌ పౌడర్‌, 90 కిలోలు, రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ 12 లీటర్లు, సింథటిక్‌ ఫ్యాబ్రిక్‌ డై 1.5 కిలోలు, రోలింగ్‌ మెషిన్లు 3. మొత్తం నిల్వలు 25,300 కిలోలు.

కల్తీ మసాలాలతో రూ.కోట్లలో టర్నోవర్‌!

మైలార్‌దేవ్‌పల్లి, బాలాపూర్‌ పరిధిలో కల్తీ మసాలాలా తయారీ కేంద్రాలు, అవుట్‌లెట్స్‌పై హెచ్‌ఫా్‌స్ట పోలీసులు దాడులు చేసి.. అరెస్టు చేసిన నిందితులను విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. వారు గత కొన్నేళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్నట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన డిస్ట్రిబ్యూటర్లకు వీరే మసాలాలను సరఫరా చేస్తున్నట్లు తేలిందని సమాచారం. వీరి వద్ద సరుకుల కొనుగోలు, క్రయ విక్రయాలు, డిస్ట్రిబ్యూషన్‌కు సంబంఽధించిన ఆర్థిక లావేదేవీలను పరిశీలించగా.. లక్షల్లో వినియోగదారులు ఉన్నట్లు, రూ.కోట్లలో టర్నోవర్‌ జరుగుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. ఈ నెట్‌వర్క్‌లో అనేక మంది వ్యాపారులు ఉన్నట్లు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, నగరాలకు మసాలాలు సరఫరా చేస్తున్న ముఠాల్లో హైదరాబాద్‌కు చెందిన ఈ ముగ్గురి పాత్ర కీలకంగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అన్ని కోణాల్లో ఈ కేసును విచారించాల్సిన అవసరం ఉందని సీపీ సజ్జనార్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌ను) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.


140 రోజుల్లో 202 ఎఫ్‌ఐఆర్‌లు..

హెచ్‌ ఫాస్ట్‌ ఏర్పాటైన 140 రోజుల్లోనే 202 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 246 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను సీజ్‌ చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా.. తదుపరి చర్యల కోసం 232 కేసులను జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ ేసఫ్టీ అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఇటీవల జరిపిన దాడుల్లో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్‌, 12 టన్నులకు పైగా కుళ్లిన కోడి, మేక మాంసం, 60 టన్నుల కోడి వ్యర్థాలు, 1.5 టన్నుల సింథటిక్‌ పనీర్‌, 2.5 టన్నుల కల్తీ పెరుగు, 3.2 టన్నుల క్రీమ్‌, నెయ్యి, 25.8 టన్నుల పండ్లు, 9.2 టన్నుల కల్తీ ఊరగాయలు, 3.8 టన్నుల కల్తీ టీపొడిని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు. ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న ఐస్‌ క్రీమ్‌లు, సమోసాలు, బిస్కెట్లు తయారు చేసే యూనిట్లపై కూడా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులతో కలిసి ఆయా ప్రాసెసింగ్‌ కేంద్రాల నుంచి అనుమానాస్పద శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం పంపినట్లు వెల్లడించారు. కల్తీ నెట్‌వర్క్‌ను అంతం చేయడానికి, వినియోగదారులకు సురక్షితమైన ఆహార ఉత్పత్తులు అందేలా చూసేందుకు హెచ్‌ ఫాస్ట్‌ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో కల్తీ ఆహారం తయారవుతున్నట్లుగానీ, అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని వండుతున్నట్లు గానీ తెలిస్తే.. వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ‘డయల్‌ 100’ ద్వారా హెచ్‌ ఫాస్ట్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 8712661212 నంబర్‌కు సమాచారం అందించవచ్చని, వారి వివరాలు పూర్తి రహస్యంగా ఉంచుతామని చెప్పారు.

Updated Date - Aug 05 , 2026 | 04:52 AM