నిర్మాణ జోరు.. లీజు బేజారు..!
ABN , Publish Date - Jun 25 , 2026 | 04:34 AM
వేకెన్సీ ఎకానమీ.. ఇప్పుడు రియల్‌ఎస్టేట్ వ్యాపారులు, బ్యాంకులు, ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న అంశం. పోటీపడి భారీ వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నా..
హైదరాబాద్‌లో 2.65 కోట్ల ఎస్‌ఎఫ్‌టీ వాణిజ్య స్థలం ఖాళీ
ఇది మొత్తం గ్రేడ్-ఏ వాణిజ్య స్థలంలో 22 శాతం
వేకెన్సీ ఎకానమీ రేటులో ఢిల్లీ తర్వాత హైదరాబాదే
లీజు ఒప్పందాలకు మించి వాణిజ్య భవనాల నిర్మాణం
దీంతో ఖాళీగా మిగిలిపోతున్న విలువైన స్థలాలు
మారుతున్న పని విధానంతో తగ్గుతున్న లీజు డీల్స్
కుష్‌మన్, వేక్‌ఫీల్డ్, ఇక్రా, జేఎల్‌ఎల్ సర్వేల్లో వెల్లడి
హైదరాబాద్, జూన్ 24( ఆంధ్రజ్యోతి): వేకెన్సీ ఎకానమీ.. ఇప్పుడు రియల్‌ఎస్టేట్ వ్యాపారులు, బ్యాంకులు, ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న అంశం. పోటీపడి భారీ వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నా.. అదే స్థాయిలో అద్దెలు, లీజులు రాకపోవటంతో కోట్ల చదరపుటడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) స్థలం నిరుపయోగంగా ఉంటోంది. వేకెన్సీ ఎకానమీలో దేశంలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. ఒక నగరం లేదా దేశంలో వాణిజ్య భవనాల్లో లీజు ఒప్పందాలు లేకుండా స్థలం ఖాళీగా ఉండిపోవడాన్ని వేకెన్సీ ఎకానమీ అంటారు. ఇది బిల్డర్లకు మాత్రమే పరిమితం అయ్యే నష్టం కాదు. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఒక గొలుసుకట్టుగా పడుతుంది. భవనాలు నిర్మించాక లీజులు, అద్దెలు రాకపోతే బిల్డర్లు బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించలేరు. వాణిజ్య భవనాలపై ప్రభుత్వానికి వచ్చే జీఎస్టీ ఆదాయం తగ్గిపోతుంది. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు తగ్గిపోతే.. అది సిమెంటు, స్టీల్, ఉపాధి రంగాలపై ప్రభావం చూపిస్తుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కమర్షియల్ ఆఫీస్ స్పేస్ లభ్యత, ఖాళీపై కుష్‌మన్, వేక్‌ఫీల్డ్, ఇక్రా, జేఎల్‌ఎల్ సంస్థలు తమ తాజా నివేదికల్లో స్పష్టమైన గణాంకాలు వెల్లడించాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న గ్రేడ్-ఏ కార్యాలయ స్థలం సుమారు 12 కోట్ల చదరపు అడుగులు (120 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ) దాటిందని తెలిపాయి. 2022 నుంచి 2026 మొదటి త్రైమాసికం వరకు లీజింగ్ వివరాలను ఈ సంస్థలు వెల్లడించాయి. 2022లో 60.7 లక్షల ఎస్‌ఎఫ్‌టీ వాణిజ్య స్థలంపై లీజు ఒప్పందాలు కుదరగా, 2023లో 1.05 కోట్ల ఎస్‌ఎఫ్‌టీ, 2024లో 90.58 లక్షల ఎస్‌ఎఫ్‌టీ, 2025లో 80.20 లక్షల ఎస్‌ఎఫ్‌టీ, 2026 మొదటి త్రైమాసికంలో 30.15 లక్షల ఎస్‌ఎఫ్‌టీకి లీజు ఒప్పందాలు జరిగాయని పేర్కొన్నాయి.
ఈ మొత్తం లీజుల్లో 75 శాతం కంటే ఎక్కువ వెస్ట్‌జోన్ (మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట) పరిధిలోనే జరిగాయి. గతంలో ఐటీ కంపెనీలే ఎక్కువగా లీజు ఒప్పందాలు చేసుకునేవి. 2024 నుంచి కో వర్కింగ్ సంస్థలు లీజు ఒప్పందాలు చేసుకోవడం పెరిగింది. 2026లో వీటి వాటా సుమారు 30 శాతానికి చేరినట్లు నివేదికల్లో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో లీజులు భారీగానే ఉన్నా.. నిర్మాణాలు అంతకు మించి జరుగుతుండటంతో వేకెన్సీ రేటు అధికంగాఉందని కుష్‌మన్, వేక్‌ఫీల్డ్ సంస్థలు పేర్కొన్నాయి. కొత్త నిర్మాణాల వల్ల 88.2 లక్షల ఎస్‌ఎఫ్‌టీ స్థలం అందుబాటులోకిరావడంతో 2024, 2025 సంవత్సరాల్లో 1.70 కోట్ల ఎస్‌ఎఫ్‌టీ స్థలాన్ని కంపెనీలు అద్దెకు తీసుకున్నా.. వేకెన్సీ ఎకానమీ రేటు తగ్గలేదు. గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ), ఐటీ కంపెనీలు ఈ స్థలాలను లీజు చేసుకున్నాయి. 2025 డిసెంబరు నాటికి హైదరాబాద్ మొత్తం కమర్షియల్ స్పేస్‌లో 22.06 శాతం ఖాళీగా మిగిలిపోయిందని గుర్తించాయి. అంటే సుమారు 2.65 కోట్ల ఎస్‌ఎఫ్‌టీ వాణిజ్య స్థలం నిరుపయోగంగా ఉందని పేర్కొన్నాయి. 2026 మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) మార్కెట్ ఊపందుకుంది. కొత్త నిర్మాణాలు కాస్త తగ్గడంతో ఖాళీ స్థలం కూడా స్వల్పంగా తగ్గింది. ఈ మూడు నెలల్లో కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి రాకపోవటంతో పాత ఖాళీ స్థలాల్లో దాదాపు 31.5 లక్షల ఎస్‌ఎఫ్‌టీ స్థలాన్ని కంపెనీలు లీజు చేసుకున్నాయి. ప్రస్తుతం వేకెన్సీ రేటు 20.22 శాతం ఉంది. నగరంలో సుమారు 2.65 కోట్ల ఎస్‌ఎఫ్‌టీ స్థలం నిరుపయోగంగా ఉందని కంపెనీలు తెలిపాయి. కొత్తగా 1.10 కోట్ల ఎస్‌ఎఫ్‌టీ వాణిజ్య స్థలం త్వరలో అందుబాటులోకి రానున్నట్లు చెప్పాయి. వేకెన్సీ ఎకానమీ అత్యధికంగా గచ్చిబౌలి, ఫైనాన్స్ డిస్ర్టిక్ట్/కోకాపేట ప్రాంతాల్లో ఉంది. ఇక్రా నివేదిక ప్రకారం ఈ ప్రాంతాల్లో వేకెన్సీ రేటు 25 నుంచి 30 శాతం వరకు ఉంది.
పని విధానంలో మార్పే కారణం
వర్క్ కల్చర్‌లో మార్పుల వల్ల కూడా వాణిజ్య స్థలం లీజులు తగ్గుతున్నాయని నివేదికల్లో పేర్కొన్నారు. హై బ్రిడ్ వర్క్ కల్చర్ వల్ల ఆఫీస్ స్పేస్ అవసరం తగ్గుతుందని ఐటీ, కార్పొరేట్ కంపెనీలు గుర్తించాయి. డిజిటలైజేషన్, ఈ- కామర్స్ ప్రభావంతో భౌతిక దుకాణాలు, మాల్స్ స్థలాలకు డిమాండ్ తగ్గినట్లు కంపెనీలు పేర్కొన్నాయి. మార్కెట్ అవసరాలను గుర్తించకుండా భారీగా నిర్మాణాలు చేపట్టడం కూడా కొంత ఇబ్బందికరంగా మారినట్లు గుర్తించాయి. ఆర్థిక అనిశ్చితి కూడా లీజులపై ప్రభావం చూపుతున్నట్లు తెలిపాయి.