డిజిటల్ యుగంలో సీఎఫ్‌వోల పాత్ర కీలకం
ABN , Publish Date - Mar 08 , 2026 | 05:52 AM
డిజిటల్ యుగంలో సీఎఫ్‌వో (చీఫ్ పైనాన్స్ ఆఫీసర్)ల పాత్ర ఎంతో కీలకంగా మారిందని, కృత్రిమ మేధ(ఏఐ), డేటా ఆధారిత రంగాల్లో పెట్టుబడులకు..
టెక్నాలజీ పాత్రను ఏఐ పూర్తిగా మార్చేస్తోంది
ఫిక్కి నిర్వహించిన సీఎఫ్‌వోల సదస్సులో మంత్రి దుద్దిళ్ల
హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): డిజిటల్ యుగంలో సీఎఫ్‌వో (చీఫ్ పైనాన్స్ ఆఫీసర్)ల పాత్ర ఎంతో కీలకంగా మారిందని, కృత్రిమ మేధ(ఏఐ), డేటా ఆధారిత రంగాల్లో పెట్టుబడులకు మార్గనిర్దేశం చేయడంలో వారి సేవలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. శనివారం బాచుపల్లిలోని విజ్ఞానజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఫిక్కి (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) నిర్వహించిన సీఎ్‌ఫవోల సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. ఏఐ ఆధారిత ఆర్థిక సాంకేతిక రంగంలో హైదరాబాద్ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోందన్నారు. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక సంస్థలు నగరంలో తమ ఆవిష్కరణలు, ఇంజనీరింగ్ కేంద్రాలను స్థాపిస్తున్నాయని తెలిపారు. ‘‘టెక్నాలజీ పాత్రను కృత్రిమ మేధ పూర్తిగా మార్చేస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ ఖర్చులను లెక్కించడానికి ఉపయోగపడిన టెక్నాలజీ, ప్రస్తుతం ఆవిష్కరణలు, మెరుగైన ఆర్థిక నిర్ణయాలకు సహాయ పడుతోంది. హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత బలమైన ఫైనాన్షియల్ టెక్నాలజీ ఎకోసిస్టమ్‌లలో ఒకటిగా అభివృద్ధి చెందింది’’ అని పేర్కొన్నారు. నగరంలో ప్రస్తుతం 400 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) మూడు లక్షల మందికి పైగా వృత్తి నిపుణులకు ఉపాధి కల్పిస్తున్నాయని ఆయన అన్నారు.
సివిల్స్ 55వ ర్యాంకర్ సృజనకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీధర్‌బాబు
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 55 ర్యాంకు సాధించిన మంథని ప్రాంతానికి చెందిన సృజనకు మంత్రి శ్రీధర్‌బాబు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయిలో 5.77 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడిన సివిల్స్ పరీక్షల్లో సృజన అందుకున్న అద్భుతమైన విజయం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుందని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.