Share News

నిపుణులకు ‘కొలువు’ భాగ్యనగరి!

ABN , Publish Date - Apr 11 , 2026 | 04:04 AM

దేశవ్యాప్తంగా యువతకు కొలువు అనే స్వప్నానికి మన హైదరాబాదే నెలవుగా మారుతోంది! దేశంలో వైట్‌ కాలర్‌ ఉద్యోగాలు, ప్రతిభ ఉన్న నిపుణులకు భాగ్యనగరమే గమ్యస్థానం అవుతోంది.

నిపుణులకు ‘కొలువు’ భాగ్యనగరి!

  • వైట్‌కాలర్‌ ఉద్యోగాలకు, ప్రతిభగల నిపుణులకు .. కలల స్థానంగా మారిన హైదరాబాద్‌

  • ఎక్స్‌ఫెనో సర్వేలో రాష్ట్రానికి 3వ స్థానం

  • మొదటి స్థానంలో కర్ణాటక

  • తెలంగాణలో నిపుణులైన ఉద్యోగుల సంఖ్య 17శాతం పెరుగుల

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా యువతకు కొలువు అనే స్వప్నానికి మన హైదరాబాదే నెలవుగా మారుతోంది! దేశంలో వైట్‌ కాలర్‌ ఉద్యోగాలు, ప్రతిభ ఉన్న నిపుణులకు భాగ్యనగరమే గమ్యస్థానం అవుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న 12 మెగా నగరాలకు చెందిన ప్రతిభగల యువత తమ కలల ఉద్యోగ స్థానం హైదరాబాదేనని ఘంటాపథంగా చెబుతోంది. వైట్‌కాలర్‌ ఉద్యోగులను ఆకర్షించే రాష్ట్రాలపై టాలెంట్‌ సొల్యూషన్స్‌ రంగంలో అగ్రగామిగా ఉన్న ఎక్స్‌ఫెనో సంస్థ తాజాగా తన మూడో వార్షిక సర్వే నివేదికను విడుదల చేసింది. సంస్థ సర్వేలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. తద్వారా గత స్థానాన్ని మన రాష్ట్రం నిలబెట్టుకుంది. ఈ సర్వేలో మొదటి స్థానంలో కర్ణాటక, రెండో స్థానంలో హరియాణా నిలిచాయి. కర్ణాటక మొదటిస్థానంలో ఉండేందుకు కారణమైన బెంగళూరులోని యువతలో చాలామంది హైదరాబాద్‌లో ఉద్యోగం చేయాలని కోరుకోవడం గమనార్హం. సర్వేలో భాగంగా ఎక్స్‌ఫెనో సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభ, నైపుణ్యం ఉన్న ఉద్యోగులు, కొత్తగా ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారి అభిప్రాయాలను తెలుసుకుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన 25 లక్షల మంది తమ లక్ష్యం హైదరాబాద్‌లో ఉద్యోగం చేయడమేనని చెప్పారు. ఈ 25లక్షల్లో 12 లక్షల మంది దేశంలోని ఇతర మెగా సిటీలకు చెందినవారే! పైగా మొదటిస్థానంలో కర్ణాటక ఉంటే.. ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరు నుంచి కూడా 4.3 లక్షల మంది మంచి కొలువుకు తమ గమ్యస్థానం భాగ్యనగరి అనే చెప్పారు. ఏడాది కాలంలో తెలంగాణలో ఇతర రాష్ట్రాలు, నగరాల నుంచి వచ్చిన వైట్‌కాలర్‌ ఉద్యోగులు 77,800 ఉండగా...హైదరాబాద్‌ నుంచి బయటకు వెళ్లిన వైట్‌కాలర్‌ ఉద్యోగులు 52,300 మంది కావడం విశేషం. అంటే తెలంగాణ నుంచి బయటకు వెళ్లి ఉద్యోగాలు చేయాలనుకునేవారికన్నా ఇక్కడకు వచ్చినవారి సంఖ్య 25,500 అదనం. ఇది టాలెంట్‌ మిగులుగా సర్వే అభివర్ణించింది. ఇది ఏటికేడు పెరుగుతుండటం మరో విశేషం.


గత ఏడాదికి ఈ ఏడాదికి 31 ు వృద్ధి నమోదైందని సంస్థ తెలిపింది. ఇక తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఉద్యోగార్థులు 2023-2024లో 5.15 లక్షలు ఉండగా, 2024-2025లో 4.03 లక్షలకు తగ్గారు. తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇది 4.73 లక్షలుగా ఉంది. కాగా 26,700 టాలెంట్‌ మిగులుతో హరియాణా (ప్రధానంగా గుర్‌గ్రామ్‌), 76,000 టాలెంట్‌ మిగులుతో కర్ణాటక (ప్రధానంగా బెంగళూరు) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. కాగా తెలంగాణలో ప్రతిభ, నైపుణ్యం ఉన్న ఉద్య్గోగుల సంఖ్య ఈ ఏడాది మార్చి నాటికి 48.9 లక్షలకు పెరిగింది. ఇది 2024-25లో 41.9 లక్షలు మాత్రమే. అంటే గత ఆర్థిక సంవత్సరానికి, ఈ ఆర్థిక సంవత్సరానికి 17శాతం టాలెంట్‌ పూల్‌ పెరిగింది. వరంగల్‌, మెదక్‌, నల్లగొండ, నిజామాబాద్‌ ప్రాంతాల్లో కలిపి 52,700 మంది ఉన్నారు. వీరిలో 39శాతం సాంకేతిక రంగంలోనే ఉన్నారు.

టాలెంట్‌ పూల్‌ మైన్‌సలో ఏపీ

ఈ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌ రాష్ట్రాల టాలెంట్‌ పూల్‌ సూచీ ప్రతికూలంగా ఉంది. అంటే ఆయా రాష్ట్రాలకు ప్రతిభ, నైపుణ్యం ఉండి ఉద్యోగాల కోసం వచ్చేవారి సంఖ్య కన్నా...అక్కడినుంచి బయటి రాష్ట్రాలకు వెళ్లేవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ఈ రాష్ట్రాలకు వస్తున్న టాలెంట్‌ పూల్‌ కంటే వెళ్లిపోతున్న వారి సంఖ్య 9వేల నుంచి 22వేల మంది వరకు ఎక్కువగా ఉంది.

గ్లోబల్‌ కంపెనీలు, జీసీసీల హబ్‌గా హైదరాబాద్‌ ఎక్స్‌ఫెనో సహ వ్యవస్థాపకుడు కమల్‌ కరణ్‌

ఎక్స్‌ఫెనో సహ వ్యవస్థాపకుడు కమల్‌ కరణ్‌ మాట్లాడుతూ, హైదరాబాద్‌ గ్లోబల్‌ కంపెనీలను ఆకర్షించడంలో విజయవంతమైందని చెప్పారు. హైనెకెన్‌, మెక్‌డొనాల్డ్స్‌, మారియట్‌, ఎలి లిల్లీ, ఎంఎ్‌సడీ వంటి అంతర్జాతీయ సంస్థలు తెలంగాణను ఎంచుకోవడం రాష్ట్రానికి పెద్ద ప్లస్‌ పాయింట్‌ అని పేర్కొన్నారు. దాంతో పాటు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, వ్యాపార అనుకూల విధానాలు, ప్రోత్సాహకాలు దేశీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. కొత్తగా ఏర్పడుతున్న గ్రీన్‌ఫీల్డ్‌ గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లు తెలంగాణ అభివృద్ధికి ప్రధాన వనరులుగా మారుతున్నాయని చెప్పారు.

Updated Date - Apr 11 , 2026 | 04:04 AM