ఉత్తర తెలంగాణకు రయ్..రయ్!
ABN , Publish Date - Jun 28 , 2026 | 03:44 AM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్‌పెట్టడం, ఉత్తర తెలంగాణ జిల్లాలకు రవాణాను సులభతరం చేయ డం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు ....
రెండు ఎలివేటెడ్ కారిడార్లకు రూ.4,300 కోట్ల ఎన్‌డీబీ రుణం
ప్యారడైజ్ జంక్షన్ నుంచి నిర్మాణం
తప్పనున్న ట్రాఫిక్ ఇబ్బందులు
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్‌పెట్టడం, ఉత్తర తెలంగాణ జిల్లాలకు రవాణాను సులభతరం చేయ డం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమం అవుతోంది. ఈ రెండు ప్రాజెక్టులకు రూ.4,300 కోట్ల రుణం అందించేందుకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థ న్యూ డెవల్‌పమెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) ముందుకొచ్చింది. సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి రెండు మార్గాల్లో ఈ కారిడార్లను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 30న ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ అధికారులు, బ్యాంకు అధికారులు, విదేశాంగ శాఖ అధికారులతో కీలక సమావేశం జరగనుంది. రెండు ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.5,106 కోట్లుకావడం, ఇంత మొత్తాన్ని ఒకేసారి బడ్జెట్‌లో కేటాయించడం కష్టమవడంతో ఎన్‌డీబీ నుంచి ప్రభుత్వం రుణం తీసుకుంటోంది. ఇటీవల రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపడంతో.. కారిడార్లకు అవసరమైన 150 ఎకరాల రక్షణశాఖ భూములను ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది.
రెండు కీలక కారిడార్లు ఇవీ..
కారిడార్-1: కరీంనగర్, సిద్దిపేట, రామగుండం, మంచిర్యాల తదితర కీలక ప్రాంతాలకు వెళ్లే రాజీవ్ రహదారి (ఎస్‌హెచ్-01)ని చేరుకునే ఎలివేటెడ్ కారిడార్ ఇది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై శామీర్‌పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డు వరకు 18.12 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఇందులో ఫ్లైఓవర్ 11.14 కిలోమీటర్లు, కంటోన్మెంట్ ప్రాంతంలో మిలటరీ నిబంధనల దృష్ట్యా సుమారు 300 మీటర్ల మేర అండర్‌పాస్, మిగతా 6.68 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ చేపడతారు. దీనికి రూ.3,619 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
కారిడార్-2: నగరం మధ్య నుంచి జాతీయ రహదారి-44 (ఎన్‌హెచ్-44)కు చేరుకునే కారిడార్ ఇది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయినపల్లి మీదుగా డెయిరీఫాం రోడ్డు (మిలటరీ డెయిరీ ఫాం) 5.40 కిలోమీటర్ల పొడవునా నిర్మిస్తారు. అందులో ఫ్లైఓవర్ 3.05 కిలోమీటర్లు, అండర్‌పాస్ 1.35 కిలోమీటర్ల మేర ఉండనుంది. దీనికి రూ.1,487 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
బ్రిక్స్ దేశాల అభివృద్ధి బ్యాంకు!
అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక అవసరాలను తీర్చడానికి బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) కూటమి దేశాలు ఏర్పాటు చేసినదే న్యూ డెవల్‌పమెంట్ బ్యాంకు(ఎన్‌డీబీ). భారత ప్రతిపాదన మేరకు 2014లో ఏర్పాటైన ఈ బ్యాంకు తర్వాతి ఏడాదినుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. రోడ్లు, మెట్రో రైళ్లు, ఇంధనం, నీటి సరఫరా వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఎన్‌డీబీ రుణాలు ఇస్తుంది.