ఎలివేటెడ్ కారిడార్.. సర్కారు ఆమోదం!
ABN , Publish Date - Oct 07 , 2026 | 06:10 AM
హైదరాబాద్‌లోని జూబ్లీచెక్‌పోస్ట్ నుంచి ముఫకంజా కాలేజీ వరకు స్టీల్ ఎలివేటెడ్ కారిడార్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్-1కు అనుసంధాన ర్యాంపు నిర్మాణ పనుల ప్రారంభించే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.
రూ.1090 కోట్లతో.. 4.3 కి.మీల మేర నిర్మాణం
కేఎన్‌ఆర్‌తో ఒప్పందం రద్దు.. డిపాజిట్లు వాపస్
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి):హైదరాబాద్‌లోని జూబ్లీచెక్‌పోస్ట్ నుంచి ముఫకంజా కాలేజీ వరకు స్టీల్ ఎలివేటెడ్ కారిడార్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్-1కు అనుసంధాన ర్యాంపు నిర్మాణ పనుల ప్రారంభించే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. గతంలో కేబీఆర్ పార్కు చుట్టూ ఏడు జంక్షన్లలో ప్రతిపాదించిన వంతెనలు, అండర్‌పాస్ నిర్మాణాల ప్రణాళికను రద్దు చేసి.. ప్రత్యామ్నాయంగా చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని ఆమోదిస్తూ స్టాండింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించాలని నిర్ణయిస్తూ పురపాలక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌ఎ్‌ఫసీఎల్, టీవీ-9 జంక్షన్ల వద్ద వంతెన, అండర్‌పాస్ నిర్మాణ పనులను కేఎన్‌ఎర్ సంస్థకు అప్పగించిన నేపథ్యంలో.. ఆ కాంట్రాక్టు రద్దు చేస్తూ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఉపసంహరించుకోవడంతో పాటు సదరు సంస్థకు డిపాజిట్ మొత్తం తిరిగి చెల్లించాలని నిర్ణయించింది. రూ.1090 కోట్ల అంచనా వ్యయంతో 4.3 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ ప్రతిష్ఠాత్మక ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ముగ్ధ జంక్షన్ వరకు ప్యాకేజీ-1గా.. ముఫకంజా ఫ్లై ఓవర్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్-1 అనుసంధాన ర్యాంపు పనులు ప్యాకేజీ-2గా ప్రతిపాదించారు.