డ్రగ్స్ కేసుల్లో ఒక్కసారి దొరికితే.. కెరీర్ ఖతం!
ABN , Publish Date - Apr 14 , 2026 | 04:46 AM
హైదరాబాద్ నగరంలోమాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి పోలీస్ యంత్రాంగం కఠినచర్యలకు ఉపక్రమించింది. ఇకపై, డ్రగ్స్ వాడుతూ దొరికిపోయిన వారిపై కౌన్సెలింగ్‌తో సరిపెట్టకుండా....
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు అనర్హులు
విదేశీ ప్రయాణాలకు పాస్‌పోర్టు క్లియరెన్స్ కష్టం
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలోమాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి పోలీస్ యంత్రాంగం కఠినచర్యలకు ఉపక్రమించింది. ఇకపై, డ్రగ్స్ వాడుతూ దొరికిపోయిన వారిపై కౌన్సెలింగ్‌తో సరిపెట్టకుండా, వారిపై కూడా ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్) చట్టం కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. గతంలో వినియోగదారులను కేవలం బాధితులుగా పరిగణించి రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలించేవారు. కానీ, అక్కడ మార్పు రాకపోగా, కొంతకాలం తర్వాత అదే డ్రగ్స్‌ను వ్యాపారంగా మార్చుకుంటున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. అందుకే ఇకపై ఎవరినీ వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నారు. ‘ఒక్కసారి డ్రగ్స్ కేసులో పేరు నమోదైతే అది క్రిమినల్ రికార్డుల్లో శాశ్వతంగా ఉండిపోతుంది. దీనివల్ల ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు అవసరమైన పోలీస్ వెరిఫికేషన్‌లో అడ్డంకులు ఎదురవుతాయి. అలాగే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారికి పాస్‌పోర్ట్ క్లియరెన్స్ లభించడం కష్టమవుతుంది. క్షణికానందం కోసం చేసే తప్పు జీవితాంతం ఉపాధి అవకాశాలను మూసి వేస్తుంద’ని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
పట్టుబడుతున్న వారిలో విద్యార్థులే అధికం..
ముఖ్యంగా విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డాక్టర్ల వంటి ఉన్నత విద్యావంతులు ఈ మత్తులో చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రుల కళ్లుగప్పి మత్తు పదార్థాలు పొందేందుకు.. విద్యార్థులు ప్రమాదకరమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకుని వాట్సాప్ వంటి యాప్‌లలో కోడ్ భాషలో ఆర్డర్లు ఇస్తున్నారు. ఫుడ్ డెలివరీ, కొరియస్ సర్వీ్‌సల ద్వారా గంజాయి, హషిష్ ఆయిల్‌ను హస్టల్ గదులకే తెప్పించుకుంటున్నారు. ఇటీవల మల్కాజిగిరి సమీపంలోని ఓ ప్రముఖ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థులు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద రూ. 7లక్షల విలువైన హాషిష్ ఆయిల్, రూ. 3లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకుంటున్న విద్యార్థులు సరుకు అవసరమైనప్పుడు వాట్సా్‌పల్లో కోడ్ భాషల్లో స్మగ్లర్స్‌కు ఆర్డర్ చేస్తున్నారు. కొందరు విద్యార్థులైతే ద్విచక్రవాహనాలపై ఏపీ- ఒడి శా సరిహద్దులకు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తేలింది. దుండిగల్, మోకిలా, శంకర్‌పల్లి వంటి ప్రాంతాల్లో ఉన్న కళాశాలల్లో పోలీసులు ఇటీవల ఆకస్మిక దాడులు నిర్వహించారు. సుమారు 50 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారించగా.. గంజాయితో పాటు ఓజీ కుష్ వంటి ఖరీదైన రకాలను వినియోగిస్తున్నట్లు తెలిసింది.
క్రిమినల్ హిస్టరీలో పేరు: డీసీపీ
డ్రగ్స్ వినియోగంపై ఒక్కసారి కేసు నమోదైతే ఆ వ్యక్తి పేరు శాశ్వతంగా క్రిమినల్ హిస్టరీలో చేరిపోతుందని డీసీపీ వైభవ్ గైక్వాడ్ హెచ్చరించారు. ‘ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగం రావాలన్నా.. పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి. పోలీస్ రికార్డుల్లో పేరు ఉంటే ఏ కంపెనీ ఉద్యోగం ఇవ్వదు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారిని సంస్థల నుంచి తొలగించే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా కోల్పోతారు. మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి’ అని డీసీపీ సూచించారు.