డ్రగ్స్ తరలిస్తున్న రైల్వే అధికారి
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:54 AM
నిషేధిత కొకైన్, గంజాయిని తరలిస్తున్న ఓ రైల్వే అధికారి సహా, మరో ఇద్దరిని ఎస్‌వోటీ, మోకిల పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
అతనితోపాటు మరో ఇద్దరి అరెస్టు
నిందితుల్లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కూడా
మహేశ్వరంలో ‘కోటి’ గంజాయి పట్టివేత
ఒకరి అరెస్టు : మహేశ్వరం డీసీపీ
మహేశ్వరం, శంకర్‌పల్లి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): నిషేధిత కొకైన్, గంజాయిని తరలిస్తున్న ఓ రైల్వే అధికారి సహా, మరో ఇద్దరిని ఎస్‌వోటీ, మోకిల పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి 39.72 గ్రాముల కొకైన్, 3 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రారెడ్డినగర్ ఔటర్‌రింగ్ రోడ్డు వద్ద కారును తనిఖీ చేసి వీటిని స్వాధీనం చేసుకున్నామని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిల సీఐ వీరబాబు తెలిపారు. నిందితుల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న పొన్నాల సిద్ధార్థ, నిజాంపేట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చలవాడ హేమంత్ కృష్ణవంశీ, నాచారంకు చెందిన రొయ్యల వ్యాపారి అవధూత విష్ణు తేజలు ఉన్నారు. సిద్ధార్థ గోవా నుంచి ఏడాదిగా నిషేధిత మాదక ద్రవ్యాలను తీసుకువచ్చి నగరంలోని పబ్, క్లబ్‌ల వద్ద విక్రయిస్తున్నట్లు సీఐ చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, రంగారెడ్డి జిల్లాలోని శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై మహేశ్వరం గేటు వద్ద ఎస్వోటీ, మహేశ్వరం పోలీసులు రూ.కోటి విలువైన గంజాయిని పట్టుకున్నారు. ఓ నిందితుడిని అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి మహేశ్వరం గేటు వద్ద ఎస్వోటీ, మహేశ్వరం పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా ఏపీలోని అల్లూరు సీతారామరాజు జిల్లా, జీడిమడుగుల మండలం సంకులమిద్దెకుచెందిన చంటిబాబు అనుమానాస్పదంగా కనిపించాడు. అదుపులోకి తీసుకుని సోదా చేయగా గంజాయి నుంచి తీసిన 9.402 కిలోల హాషి్‌షతో కూడిన పాలిథీన్ కవర్లను గుర్తించారు. దీంతో అతడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు మహేశ్వరం డీసీపీ కె. నారాయణరెడ్డి తెలిపారు. మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారని తెలిపారు. ఒడిశాకు చెందిన రాజారావు వద్ద చంటిబాబు హాషి్‌షను కొనుగోలు చేసి హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడని, నిందితులైన చంటిబాబు, రాజారావులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.