‘డ్రగ్స్-కాల్పుల’ కేసులో దూకుడు!
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:22 AM
మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో కాల్పులు, డ్రగ్స్ కేసుకు సంబంధించి రిమాండ్‌లో ఉన్న ప్రధాన నిందితులు రోహిత్‌రెడ్డి, రితీష్‌రెడ్డి, నమిత్ శర్మలను మూడు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.
పోలీసు కస్టడీకి ముగ్గురు ప్రధాన నిందితులు.. 3 రోజుల విచారణకు అనుమతించిన కోర్టు
కదలనున్న ‘డ్రగ్స్ కాల్పుల కేసు’ డొంక
కీలక సమాచారమిచ్చిన వారిని ఎదుట కూర్చోబెట్టి నిందితులను ప్రశ్నించాలని అధికారుల యోచన
ఇప్పటికే పలు సంచలన అంశాలు వెల్లడి
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి/శంషాబాద్ రూరల్)
మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో కాల్పులు, డ్రగ్స్ కేసుకు సంబంధించి రిమాండ్‌లో ఉన్న ప్రధాన నిందితులు రోహిత్‌రెడ్డి, రితీష్‌రెడ్డి, నమిత్ శర్మలను మూడు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీనితో వారిని లోతుగా ప్రశ్నించి కీలక అంశాలు రాబట్టేందుకు ప్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సిద్ధమైంది. దర్యాప్తులో మిగతా నిందితులు వెల్లడించిన వివరాల ఆధారంగా ముగ్గురు ప్రధాన నిందితులను ప్రశ్నించనుంది. మొయినాబాద్‌లో రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు పాల్గొన్న పార్టీలో డ్రగ్స్ లభించడం, తనిఖీలకు వెళ్లిన పోలీసులపై నిందితులు జరిపిన కాల్పులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రోహిత్‌రెడ్డి, నమిత్ శర్మ, రితీష్‌రెడ్డి అరెస్టయి, జైలులో రిమాండ్‌లో ఉండగా.. ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్, మరో ఏడుగురు నిందితులు స్టేషన్ బెయిల్‌పై బయట ఉన్నారు. లోక్‌సభ సమావేశాల అనంతరం విచారణకు వస్తానని పుట్టా మహేశ్ చెప్పడంతో.. మిగతా ఏడుగురు నిందితులను సిట్ బృందం రోజువారీగా విచారిస్తోంది. నిందితుల్లో కొందరికి దుబాయ్‌లో పెట్టుబడులు ఉండటం, డ్రగ్స్, నేర మాఫియాలతో సంబంధాలు ఉన్నట్టు తెలియడంతో వారి ఆర్థిక లావాదేవీలను సిట్ ఆరా తీస్తోంది. ఇప్పుడు ప్రధాన నిందితులను కస్టడీలోకి తీసుకుంటుండటంతో కేసు మూలాలన్నీ బయటికి వస్తాయని భావిస్తోంది. ఇప్పటివరకు గుర్తించిన ఆధారాలు, సమాచారాన్ని వారి ముందుపెట్టి ప్రశ్నించేందుకు సిట్ సిద్ధమైంది. అవసరమైన ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసినట్టు తెలిసింది. అవసరమైతే కీలక వివరాలు వెల్లడించిన ఇతర నిందితులను రోహిత్‌రెడ్డి, నమిత్ శర్మ, రితీష్‌రెడ్డి ఎదురుగా కూర్చోబెట్టి విచారించాలని యోచిస్తున్నట్టు సమాచారం. మంగళవారం ఉదయం కస్టడీలోకి తీసుకోగానే వారిని మొయినాబాద్ ఫామ్‌హౌస్‌కు తీసుకువెళ్లి, సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే అవకాశం ఉందని తెలిసింది.
ఆ 24 పార్టీలకు ఎవరెవరు వచ్చారు?
స్టేషన్ బెయిల్‌పై ఉన్న నిందితుల విచారణలో వెల్లడైన సమాచారం ఆధారంగా.. ఇటీవలి పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసిన అభిషేక్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా అభిషేక్ సింగ్ ఇప్పటివరకు 24 సార్లు రోహిత్‌రెడ్డి ఏర్పాటు చేసిన పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు తేలింది. దీనితో ఆ 24 పార్టీలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. సీసీ కెమెరా పుటేజీలు సేకరించి పరిశీలిస్తున్నారు. ఆ పార్టీలకు ఎవరెవరు వచ్చారన్నది ఆరా తీస్తున్నారు.
నమిత్‌శర్మ గ్యాంగ్‌స్టరా?
‘డ్రగ్స్, కాల్పుల కేసు’లో మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితోపాటు కాల్పులు జరిపిన ఢిల్లీ వాసి నమిత్‌శర్మ, డ్రగ్స్ సరఫరా చేసిన అభిషేక్ సింగ్ కీలకంగా ఉన్నారు. పంజాబ్, ఢిల్లీకి ప్రత్యేక బృందాలు వెళ్లి నమిత్‌శర్మ నేర చరిత్ర వివరాలు సేకరించినట్టు సమాచారం. అక్కడ కొన్ని మాఫియా గ్రూపులతో నమిత్‌శర్మకు సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నమిత్‌శర్మ అనే ఒక గ్యాంగ్‌స్టర్ పంజాబ్ పోలీసులు కొన్నాళ్లుగా గాలిస్తున్నారు. అతడికి దుబాయ్ మాఫియాతో సంబంధాలు ఉన్నట్టు చెబుతున్నారు. ఇక్కడ పట్టుబడిన నమిత్‌శర్మ ఆ గ్యాంగస్టర్ కావొచ్చనే సందేహాలు వస్తున్నాయి.
పుట్టా మహేశ్ ఎందుకు వచ్చినట్లు?
డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌తోపాటు ప్రియాంకరెడ్డి అనే మహిళ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రధాన నిందితులను విచారిస్తే పుట్టా మహేశ్, ప్రియాంకరెడ్డి అంశాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రియాంకరెడ్డిపై పలు డ్రగ్స్ కేసులు ఉన్నట్టు తెలిసింది.