Share News

మాదకద్రవ్యాల కేసుల్లో అమాయకులు దుబాయి జైళ్ళలో!

ABN , Publish Date - Apr 02 , 2026 | 02:50 AM

హైదరాబాద్‌లోని గంజాయి స్మగ్లింగ్‌ ముఠాలు ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకొచ్చే అమాయకులను పావులుగా వాడుకుంటున్నాయి. దుస్తులనో మరొకటనో మాయమాటలు చెప్పి వారితో గంజాయి ప్యాకెట్లు పంపిస్తున్నాయి.

మాదకద్రవ్యాల కేసుల్లో అమాయకులు దుబాయి జైళ్ళలో!

  • స్మగ్లింగ్‌ సూత్రధారులు మాత్రం హైదరాబాద్‌లో దర్జాగా..

  • ఉపాధి ఆశ చూపి... మార్గమధ్యలో దుస్తులంటూ గంజాయి ప్యాకెట్లు అంటగడుతున్న ముఠాలు

  • అలా 7 కిలోల గంజాయితో పట్టుబడ్డ యువతికి యావజ్జీవ శిక్ష.. ఎట్టకేలకు దుబాయి రాజు క్షమాభిక్ష

  • మరో వ్యక్తి మాత్రం ఇంకా దుబాయి జైలులోనే..

  • ఖతార్‌ జైలులోనూ కొందరు హైదరాబాదీలు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

హైదరాబాద్‌లోని గంజాయి స్మగ్లింగ్‌ ముఠాలు ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకొచ్చే అమాయకులను పావులుగా వాడుకుంటున్నాయి. దుస్తులనో మరొకటనో మాయమాటలు చెప్పి వారితో గంజాయి ప్యాకెట్లు పంపిస్తున్నాయి. ఇక్కడకొచ్చి పట్టుబడుతున్న అమాయకులు జైళ్లలో మగ్గుతుంటే స్మగ్లర్లు మాత్రం హైదరాబాద్‌లో దర్జాగా తిరుగుతూ ఇంకొందరికి వల వేసే పనిలో ఉంటున్నారు. తాజాగా మాదకద్రవ్యాల రవాణా కేసులో పట్టుబడి దుబాయి జైలు నుంచి క్షమాభిక్షతో విడుదలై హైదరాబాద్‌ చేరుకున్న యువతి కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే వ్యవస్థీకృత నేర ముఠా పొట్టకూటికి విదేశాలకొచ్చే వారిని కొరియర్లుగా వాడుకుని గంజాయిని అంతర్జాతీయంగా స్మగ్లింగ్‌ చేస్తోందని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని బహదూర్‌పురాకు చెందిన అమీనా బేగం (23)ను దుబాయిలో బ్యూటీషియన్‌ ఉద్యోగం అంటూ ఒక ముఠా గత ఏడాది మే 17న థాయ్‌లాండ్‌ మీదుగా దుబాయి పంపింది. అమెతో పాటు హైదరాబాద్‌కు చెందిన దిలావర్‌ అహ్మద్‌ ఖాన్‌ (33) కూడా పయనమయ్యాడు. వీరికి థాయలాండ్‌లో ఏడు కిలోల గంజాయి కలిగిన రెండు ప్యాకెట్లను మహిళల దుస్తులంటూ ఒక హైదరాబాదీ ముఠా అందించింది. మరుసటి రోజు (మే 18న) దుబాయి విమానశ్రాయంలో పట్టుబడ్డ వీరిద్దరికీ ఆ తర్వాత దుబాయి న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించింది. ఉద్యోగంలో చేరాల్సిన తమ కూతురు జైలులో ఉందని హైదరాబాద్‌లోని అమె తలిదండ్రులకు కొన్ని నెలల తర్వాత కానీ తెలియలేదు. వారు న్యాయ సహాయం కోసం ప్రయత్నిస్తుండగానే కోర్టు తీర్పు వచ్చింది. వారు ఎట్టకేలకు హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ద్వారా దుబాయి భారతీయ కాన్సులేట్‌లో న్యాయ సలహాదారుడిగా ఉన్న మహబూబ్‌ నగర్‌కు చెందిన మొహమ్మద్‌ ఇఫ్తేఖార్‌ను సంప్రదించారు. ఆయన సహాయంతో అప్పీల్‌ దాఖలు చేయగా అప్పీల్‌ కోర్టు తోసిపుచ్చింది. ఆ తర్వాత ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్‌ చేశారు.


బ్యాగేజి తన పేరున చెక్‌ కాలేదని, పైగా దానిపై తన వేలిముద్రలు కూడా లేవని అమీనా బేగం న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది. ఈ అప్పీల్‌తో పాటు తాను అమాయకురాలినని, తనకు క్షమాభిక్ష పెట్టాలని దుబాయి రాజదర్బార్‌లో దుబాయి రాజును అభ్యర్థించింది. తనకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడని రోదించింది. 10 నెలలుగా జైలులో ఉన్న అమీనా ప్రవర్తన, కేసు పూర్వాపరాలను పరిశీలించిన దుబాయి రాజు షేక్‌ మహమ్మద్‌ రంజాన్‌ మాసం సందర్భంగా అమెకు క్షమాభిక్ష ప్రసాదించారు. దాంతో అమె విడుదల సాధ్యమైంది.అయితే ఇరాన్‌ యుద్ధ పరిస్థితులతో విమానాల రాకపోకల్లో అంతరాయంతో అమె హైదరాబాద్‌కు వెళ్లడంలో కొంత జాప్యం జరిగింది. ఎట్టకేలకు అమె బుధవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకుంది. ఈ కేసులోని సహా నిందితుడు దిలావర్‌ ఖాన్‌ మాత్రం జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. దుబాయితో పాటు ఖతార్‌లో కూడా ఇదే రకమైన కేసుల్లో హైదరాబాదీలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ తరహా కేసులు అప్పుడప్పుడు వస్తున్నా హైదరాబాద్‌లోని దాని అసలు మూలాల జోలికి మాత్రం పోలీసులు వెళ్లకపోవడం విస్మయం కలిగిస్తోంది.

Updated Date - Apr 02 , 2026 | 02:50 AM