మహానగరం ఇక.. 3 కార్పొరేషన్లు
ABN , Publish Date - Feb 12 , 2026 | 02:41 AM
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ను మూడు నగర పాలక సంస్థలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి.. విభజిస్తూ సర్కారు జీవో
మూడింటికీ ప్రత్యేక అధికారిగా జయేశ్ రంజన్
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా కర్ణన్, సైబరాబాద్‌కు సృజన, మల్కాజిగిరికి వినయ్ కృష్ణారెడ్డి
కోర్ అర్బన్ రీజియన్ వరకు వాటర్‌బోర్డు
మూడు రీజినల్ యూనిట్లు, 12 జోన్లు
కార్పొరేషన్లకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ను మూడు నగర పాలక సంస్థలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజిగిరి మునిసిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)గా విభజిస్తూ జీవో విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలకమండలి గడువు మంగళవారంతో ముగిసిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో హైదరాబాద్ మహానగరంలో బుధవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చినట్లయింది. జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన సర్కారు.. వాటికి కొత్త కమిషనర్లను కూడా నియమించింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్, సైబరాబాద్ కమిషనర్‌గా సృజన, మల్కాజిగిరి కమిషనర్‌గా వినయ్‌కృష్ణారెడ్డిలను నియమించింది. ఈ నేపథ్యంలో ఆ మూడు కార్పొరేషన్లకు సంబంధించిన జోన్లు, సర్కిళ్లు, డివిజన్‌ల పరిధులు ఖరారు చేసి, వాటికి సంబంధించిన మ్యాప్‌లను విడుదల చేసింది. మూడు కార్పొరేషన్లకు కలిపి ప్రత్యేక అధికారిగా నియమితులైన జయేశ్‌రంజన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఆర్‌వీ కర్ణన్, జి.సృజన, టి.వినయ్‌కృష్ణారెడ్డిలు కూడా కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు.
3 కార్పొరేషన్లు.. 300 డివిజన్లు..
జీహెచ్‌ఎంసీని మొత్తం 6 జోన్లు (శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్)గా, 30 సర్కిళ్లు, 150 డివిజన్లుగా విభజించారు. సైబరాబాద్ కార్పొరేషన్‌లో మూడు జోన్‌లు(శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్), 76 డివిజన్లు ఉన్నాయి. మల్కాజిగిరి కార్పొరేషన్‌లో మూడు జోన్‌లు (మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్‌బీనగర్), 74 డివిజన్లు ఉన్నాయి.
క్యూర్ వరకు వాటర్‌బోర్డు
హైదరాబాద్ మహా నగర విస్తరణకు అనుగుణంగా తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ పరిధిలో తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ చేపట్టే వాటర్‌బోర్డు పరిధిని కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) వరకూ విస్తరిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. క్యూర్ వరకు విస్తరించిన మూడు మునిసిపల్ కార్పొరేషన్ల మాదిరిగానే జల మండలి (వాటర్ బోర్డు)ని పునర్వ్యవస్థీకరించింది. వాటర్ బోర్డులో 5 సర్కిళ్లు, 22 డివిజన్లు, 190 సెక్షన్లు ఉండగా వాటిని ఎత్తివేశారు. మూడు రీజినల్ యూనిట్లు, 12 జోన్లుగా చేసి.. కార్పొరేషన్ల తరహాలోనే 60 సర్కిళ్లు, 300 డివిజన్లుగా నిర్ణయించారు. క్యూర్ పరిధిలో మెరుగైన పౌర సేవలు అందించడానికి గాను సర్కారు కొత్తగా ఒక జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ), రెండు ఈడీ పోస్టులను మంజూరు చేసింది. జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి రీజినల్ యూనిట్లుగా చేసి.. ఒక్కో యూనిట్‌కు ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ని నియమించింది. 12 జోన్లకు చీఫ్ జనరల్ మేనేజర్లను నియమించింది. 60 సర్కిళ్లకు డీజీఎంలను నియమించగా.. 300 డివిజన్లకు కూడా మేనేజర్లను నియమించనున్నారు.
రోజూ నీరందించడమే లక్ష్యం
‘‘హైదరాబాద్ మహా నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. క్యూర్ పరిధిలో తాగునీటిని సరఫరా చేయడం, మురుగు నీటి నిర్వహణ చేపట్టడం అత్యంత కీలకం. నగరంలో ప్రస్తుతం రోజు విడిచి రోజు నీరు ఇస్తుండగా.. 2027 డిసెంబరు నుంచి క్యూర్ ప్రాంతం వరకు రోజూ సరఫరా చేయాలని సీఎం రేవంత్ లక్ష్యాన్ని నిర్దేశించారు. 2047 విజన్‌కు అనుగుణంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం’’ అని వాటర్ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు.