Share News

డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య

ABN , Publish Date - Jul 24 , 2026 | 06:24 AM

రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో సెంట్రీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నారు. బాత్‌రూంలోకి వెళ్లి.. తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు

డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య

  • బాత్‌రూంలో కణతపై తుపాకీతో కాల్చుకుని మృతి

  • తన భార్య, పిల్లలను వేధించొద్దంటూ సూసైడ్‌నోట్‌

హైదరాబాద్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో సెంట్రీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నారు. బాత్‌రూంలోకి వెళ్లి.. తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్థిక సమస్యలతోనే కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన స్వామి 2007లో పోలీసు కానిస్టేబుల్‌గా చేరారు. కొండాపూర్‌ 8వ బెటాలియన్‌లో పని చేస్తున్న స్వామిని 20 రోజుల క్రితమే డీజీపీ ఆఫీసుకు బదిలీ చేశారు. రాత్రి వేళ సెంట్రీ విధుల్లో ఉన్న స్వామి ఉదయం 5.30 సమయంలో బాత్‌రూమ్‌కు వెళ్లి తన వద్ద ఉన్న సర్వీసు రివాల్వర్‌తో కణతపై కాల్చుకున్నారు. తుపాకీ పేలిన శబ్దఽం విని తోటి సిబ్బంది పరుగున వెళ్లి చూడగా స్వామి రక్తం మడుగులో పడిపోయి కనిపించారు. ఆయనను ఆస్పత్రికి తీసుకుని వెళ్లడానికి ప్రయత్నించినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్లు డీజీపీ కార్యాలయం సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. స్వామి మృత దేహం వద్ద ఒక డైరీని క్లూస్‌ టీం గుర్తించింది. అందులో సూసైడ్‌నోట్‌ రాసి ఉన్నట్లు సైఫాబాద్‌ పోలీసులు తెలిపారు. ‘నా సొంత ఆలోచనలతోనే ఆత్మహత్య చేసుకుంటున్నా. నా మరణం తర్వాత నా భార్య, పిల్లలను ఏమీ అనవద్దు. వారు మంచి వారు. వారిని ఎవరు బాధపెట్టవద్దు. ఎవరైనా వారిని బాధపెడితే దెయ్యంగా మారైనా కాపాడుకుంటా’’ అని అందులో రాసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్ధిక సమస్యలే స్వామి ఆత్మహత్యకు ప్రధాన కారణంగా భావిస్తున్నామని సైఫాబాద్‌ ఏసీపీ సంజయ్‌కుమార్‌ తెలిపారు. బెట్టింగ్‌లో స్వామి పెద్ద మొత్తంలో నష్టపోయారని ప్రచారం జరుగుతుండగా.. ఉన్నతాధికారులు ధ్రువీకరించలేదు.

Updated Date - Jul 24 , 2026 | 06:26 AM