Share News

డీపీతో దోచేశారు

ABN , Publish Date - Mar 22 , 2026 | 05:26 AM

సైబర్‌ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఏదో ఒక రూపంలో అమాయకులను కొల్లగొడుతూనే ఉన్నారు.

డీపీతో దోచేశారు

  • మాజీ డీజీపీ మనుమరాలి వాట్సాప్‌ డీపీ

  • ఫొటోతో ఆమె అకౌంటెంట్‌కు సందేశం

  • 1.20 కోట్లు కొట్టేసిన సైబర్‌ నేరగాళ్లు

  • విదేశీ ఉద్యోగం పేరిట ఓ యువకుడికి

  • రూ.10.15 లక్షలకు కుచ్చుటోపీ

  • ఓటీపీ, ఫోన్‌ ధ్రువీకరణ లేకుండా ఓ

  • వ్యక్తి ఖాతా నుంచి రూ.40 లక్షల బదిలీ

  • సైబరాబాద్‌ పరిధిలో 3 రోజుల్లో 7 కేసులు

  • రూ.1.55 కోట్లు కాజేసిన కేటుగాళ్లు

హైదరాబాద్‌ సిటీ, హైదరాబాద్‌, మార్చి 21(ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఏదో ఒక రూపంలో అమాయకులను కొల్లగొడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఓ మాజీ డీజీపీ మనుమరాలికి టోకరా వేసిన సైబర్‌ నేరగాళ్లు ఆమె అకౌంటెంట్‌ను బురిడీ కొట్టించి రూ.1.20 కోట్లు కాజేశారు. మరోపక్క, డబ్బు మీద అత్యాశతో కొందరు సైబర్‌ నేరగాళ్ల వలలో పడి తమ కష్టార్జితాన్ని పోగొట్టుకున్నారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో సైబర్‌ నేరాలకు సంబంధించి 3 రోజుల్లో ఏడు కేసులు నమోదయ్యాయి. ఇందులో ఐదు కేసులు స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులకు సంబంధించినవే కావడం గమనార్హం. ఈ ఏడు కేసుల్లోని బాధితులు రూ.1.55 కోట్ల మేర పోగొట్టుకున్నారు. ఆయా కేసులకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త, 18 కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్న ఓ మాజీ డీజీపీ మనుమరాలికి టోకరా వేసిన సైబర్‌ నేరగాళ్లు రూ.1.20కోట్లు కొల్లగొట్టారు. మార్చి 13న బాధితురాలి ఫొటో డీపీగా ఉన్న నంబర్‌ నుంచి కంపెనీ అకౌంటెంట్‌ వాట్సా్‌ప్‌కు సందేశం వచ్చింది.


తాను ముఖ్యమైన సమావేశంలో ఉన్నానని, తాను చెప్పిన ఖాతాకు వెంటనే రూ.1.20 కోట్లు బదిలీ చేయాలని అందులో ఉంది. మెసేజ్‌ తమ డైరెక్టర్‌ నుంచి వచ్చిందని భావించిన సదరు అకౌంటెంట్‌ వెంటనే రూ.1.20కోట్లు బదిలీ చేశాడు. అనంతరం, మరోసారి డబ్బు పంపాలంటూ అదే నంబర్‌ నుంచి మార్చి 17న మళ్లీ సందేశం వచ్చింది. అయితే, డైరెక్టర్‌ కార్యాలయంలోనే ఉండడంతో చెక్‌ అప్రూవల్‌ కోసం అకౌంటెంట్‌ ఆమెను నేరుగా సంప్రదించారు. ఈ సందర్భంగా రూ.1.20 కోట్ల విషయం ప్రస్తావించగా.. తాను ఎలాంటి సందేశం పంపలేదని బాధితురాలు చెప్పారు. దీంతో అకౌంటెంట్‌ తనకు వచ్చిన సందేశం, లావాదేవీ వివరాలను చూపించారు. అయితే, సైబర్‌ మోసాన్ని గుర్తించిన బాధితురాలు వెంటనే 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సీపీ సజ్జనార్‌ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు.


పెట్టుబడులు.. అధిక లాభాల పేరిట మాయ

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ఓ వ్యక్తిని టెలిగ్రామ్‌ యాప్‌లో గుర్తు తెలియని ఓ వ్యక్తి సంప్రదించాడు. సాండ్‌ పేపర్‌ కంపెనీ పేరుతో స్టేక్‌ ఫ్లూటో అనే ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశపెట్టాడు. ఈ మాయలో పడిన బాధిత వ్యక్తి.. తనతో పాటు భార్య, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి మొత్తం రూ.30,47,000 ఆ యాప్‌లో పెట్టుబడిగా పెట్టాడు. అనంతరం యాప్‌ నిర్వాహకులు స్పందించకపోవడంతో మోసాన్ని గ్రహించాడు. ఇక, అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ పేరిట హైదరాబాద్‌లోని చందానగర్‌ హుడా కాలనీకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.10.15 లక్షలకు పైగా కొట్టేశారు.

20.98 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

ఫారెక్స్‌, స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో భారీ లాభాలు వస్తాయని నమ్మబలికి సైబర్‌ నేరగాళ్లు ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను రూ.20.98 లక్షల మేర మోసం చేశారు. హైటెక్‌ సిటీ ప్రాంతంలో నివాసముండే బాధిత ఐటీ ఉద్యోగికి డిసెంబరు 23న సచిన్‌ అనే వ్యక్తి వాట్సాప్‌ ద్వారా పరిచయమై ఆర్క్‌ ఇన్వెస్ట్‌ సంస్థకు చెందిన ట్రేడర్‌నని పరిచయం చేసుకున్నాడు. ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో అధిక లాభాలు పొందవచ్చని నమ్మించాడు. ఓ వెబ్‌సైట్‌ లింక్‌ను పంపి అందులో విడతల వారీగా రూ.20,98,194 పెట్టుబడులు పెట్టించాడు. వెబ్‌సైట్‌లో భారీ లాభాలు కనిపిస్తున్నా విత్‌ డ్రా చేసుకునే అవకాశం లేకపోవడం, అవతలి వ్యక్తులు స్పందించకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.


యాక్సిస్‌, ఐసీఐసీఐ పేర్లతో మోసాలు

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నవంబరు 9న ఫేస్‌బుక్‌లో కనిపించిన ట్రేడింగ్‌ ప్రకటనను క్లిక్‌ చేయగా.. కె7 యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ అనే వాట్సాప్‌ గ్రూపులో యాడ్‌ అయ్యారు. యాక్సిస్‌ బ్యాంక్‌ లోగోను ఉపయోగిస్తూ పెట్టుబడులపై అధికలాభాలు అందిస్తామని నమ్మించిన ఆ గ్రూపులోని వ్యక్తులు బాధితుడితో విడతల వారీగా రూ. 27.74 లక్షలు పెట్టుబడులు పెట్టించారు. ట్రేడింగ్‌ యాప్‌లో లక్షల్లో లాభాలు చూపిస్తూ వాటిని విత్‌డ్రా చేసుకోవాలంటే మరిన్ని డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. దీంతో బాధితుడు అసలు కంపెనీ కస్టమర్‌ కేర్‌ను సంప్రదించగా మోసపోయానని గ్రహించాడు. అలాగే, హైదరాబాద్‌లోని అమీన్‌పూర్‌ ప్రాంతానికి చెందిన ఓ రిటైర్డు ఇంజనీర్‌ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ స్టాక్‌ మార్కెట్‌ ఎనాలసిస్‌ అనే వాట్సాప్‌ గ్రూపులో చేరి రూ.16.10 లక్షలు పోగొట్టుకున్నాడు.

ఓటీపీ లేకుండా బ్యాంకు ఖాతాలో రూ.40 లక్షలు బదిలీ

ఎలాంటి ఓటీపీ, ఫోన్‌ ధృవీకరణ లేకుండా ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూ.40 లక్షలు బదిలీ అయ్యాయి. హైదరాబాద్‌లోని పుప్పాలగూడ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారవేత్త.. జనవరి 23-27 మధ్య కాలంలో తన ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఎలాంటి ఓటీపీ ధృవీకరణ లేకుండా గుర్తు తెలియని వ్యక్తులు తన బ్యాంకు ఖాతా నుంచి రూ.40లక్షలు బదిలీ చేసినట్టు కనిపెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


విదేశీ ఉద్యోగం పేరుతో రూ.10.15 లక్షల మోసం

హైటెక్‌ సిటీలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో టెక్నీషియన్‌గా పని చేస్తున్న ఓ యువకుడికి విదేశీ ఉద్యోగం పేరిట ఎర వేసిన సైబర్‌ నేరగాళ్లు అతని వద్ద రూ.10.15 లక్షలు కాజేశారు. ఆస్ట్రేలియాలోని ఫియోనా స్టాన్లీ హాస్పిటల్‌లో ఉద్యోగ అవకాశం అంటూ బాధిత యువకుడికి జనవరి 23న ఈమెయిల్‌ వచ్చింది. బాధితుడు ఆ మెయిల్‌కు స్పందించగా.. టెలిఫోన్‌లో ఇంటర్వ్యూ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు... ఉద్యోగానికి ఎంపికైనట్లు జనవరి 20న నియామక పత్రాన్ని మెయిల్‌ చేశారు. వీసా ప్రక్రియను ఒక కన్సల్టెన్సీ సంస్థ చూసుకుంటుందని చెప్పారు. అయితే, ఆస్ట్రేలియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ పేరుతో పాల్‌ మర్ఫీ అంటూ ఓ వ్యక్తి బాధిత యువకుడిని సంప్రదించాడు. బాధితుడితో వేర్వేరు ఖాతాల్లో మొత్తం రూ.10,15,750 జమ చేయించాడు. అనంతరం మార్చి 5న మరో రూ.లక్ష డిమాండ్‌ చేయగా.. అనుమానంతో వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన బాధిత యువకుడు మోసపోయినట్టు గ్రహించాడు.

Updated Date - Mar 22 , 2026 | 07:50 AM