సైబరాబాద్‌లో భారీ సైబర్ మోసం
ABN , Publish Date - Apr 12 , 2026 | 03:58 AM
సైబరాబాద్‌లో మరో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసుల పేరుతో బెదిరింపులు, నకిలీ ‘డిజిటల్ వెరిఫికేషన్’ పేరుతో ఓ డిప్యూటీ సూపరింటెండెంట్...
1,33 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): సైబరాబాద్‌లో మరో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసుల పేరుతో బెదిరింపులు, నకిలీ ‘డిజిటల్ వెరిఫికేషన్’ పేరుతో ఓ డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజినీర్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.33 కోట్లకు పైగా దోచుకున్నారు. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం... బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న బాధితుడికి 2026 జనవరి 9న మొదటిసారి గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. మహిళలను వేధిస్తున్నాడని, మానవ అక్రమ రవాణా, మనీలాండరింగ్ వంటి తీవ్రమైన నేరాల్లో ఇంజినీర్ పాల్గొన్నట్లు దుండగులు ఆరోపించారు. ముంబైలో జరిగిన ఒక రైడ్‌లో స్వాధీనం చేసుకున్న 289 డెబిట్ కార్డుల్లో ఒకటి ఇంజినీర్‌దేనని, ఆ కార్డులో రూ.3కోట్లు ఉన్నట్లు చెప్పి భయపెట్టారు. దీంతో బాధితుడు వివిధ దశల్లో రూ.1,33,73,975ను ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఈ మొత్తం తిరిగి ఇస్తామని చెప్పిన దుండగులు నకిలీ రశీదులు పంపించారు. తమను నిజమైన అధికారులుగా నమ్మించేందుకు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ వీడియో కాల్స్‌లో సీబీఐ కార్యాలయాన్ని పోలిన బ్యాక్‌గ్రౌండ్ ఉపయోగించారు. ఘటనపై సైబర్‌కైరమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.