ట్రేడింగ్ అంటూ 11.69 కోట్లు కొట్టేశారు
ABN , Publish Date - May 24 , 2026 | 04:49 AM
హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు సైబర్ నేరగాళ్ల మాయలో పడి రూ.11,69,76,265 మొత్తాన్ని సమర్పించుకున్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు...
ఇద్దరికి సైబర్ నేరగాళ్ల టోకరా..
హైదరాబాద్, మే 23(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు సైబర్ నేరగాళ్ల మాయలో పడి రూ.11,69,76,265 మొత్తాన్ని సమర్పించుకున్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు శనివారం నమోదు చేసిన ఈ రెండు కేసుల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో నివసించే ఇషాక్ జార్జ్(72) ఎపిటోమ్ ప్రాజెక్ట్స్ సీఈవోగా పని చేస్తున్నారు.ఆయనకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన కావేరి అనే యువతి ట్రేడింగ్ ప్లాట్‌ఫాం అయిన ముద్ర వన్‌లో పెట్టుబడులు పెట్టాలని సూచించింది. తర్వాత 9 ప్రొ అనే ట్రేడింగ్ సైట్‌ను పరిచయం చేసింది. ఆ కంపెనీ ప్రతినిధుల మాటలు నమ్మిన జార్జ్ సదరు కంపెనీకి రూ.5.95 కోట్లు బదిలీ చేశారు. తర్వాత మరింత డబ్బు ఇస్తే కానీ విత్‌డ్రా కుదరదని చెప్పడంతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గండిపేటకు చెందిన దాసరి రామ్మూర్తి(58) అనే రియల్టర్‌ను అర్జున్ రెడ్డి అనే వ్యక్తి ట్రేడ్ 87 ప్లాట్‌ఫాంకు చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకుని తమ సంస్థ ద్వారా అధిక లాభాలు వస్తాయని ఆశ చూపాడు. ఆ మాటలు నమ్మిన రామ్మూర్తి.. తనతోపాటు తన భార్య, స్నేహితులు, కంపెనీ ఖాతాల నుంచి అర్జున్‌రెడ్డి, శరణ్ హెగ్డే అనే వ్యక్తులు సూచించిన ట్రేడ్ 87, మనీఫ్రోక్స్ కంపెనీల ఖాతాల్లోకి రూ.5,74,76,265 బదిలీ చేశారు. అయితే విత్ డ్రా సమయంలో సమాధానం ఇవ్వడం మానేశారు. దీంతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.