Share News

లాభాల ఆశ.. రూ.2.86 కోట్లు స్వాహా

ABN , Publish Date - Aug 14 , 2026 | 06:03 AM

ట్రేడింగ్‌.. ఆన్‌లైన్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం, టాస్క్‌లు, రివ్యూలతో నెలకు లక్షల్లో సంపాదించొచ్చంటూ.. సైబర్‌ నేరగాళ్లు అమాయకులను ముంచేస్తున్నారు.

లాభాల ఆశ.. రూ.2.86 కోట్లు స్వాహా

  • చార్టర్డ్‌ అకౌంటెంట్‌కు రూ.2.45 కోట్ల బురిడీ.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి రూ.38 లక్షల టోకరా

  • ఐటీ ఉద్యోగి నుంచి రూ.3.26 లక్షల లూఠీ

  • ట్రేడింగ్‌, టాస్క్‌ల పేరుతో ముంచేసిన నేరగాళ్లు

  • హైదరాబాద్‌ పరిధిలో మూడు ఘటనలు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ట్రేడింగ్‌.. ఆన్‌లైన్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం, టాస్క్‌లు, రివ్యూలతో నెలకు లక్షల్లో సంపాదించొచ్చంటూ.. సైబర్‌ నేరగాళ్లు అమాయకులను ముంచేస్తున్నారు. ట్రేడింగ్‌, పెట్టుబడుల పేరుతో ఒక చార్టర్డ్‌ అకౌంటెంట్‌ను రూ.2.45 కోట్లకు, ఆన్‌లైన్‌ రివ్యూల పేరుతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రూ.38 లక్షలు, ఆన్‌లైన్‌ టాస్క్‌లపై కమిషన్‌ ఆశ చూపించి మరో మహిళా ఐటీ ఉద్యోగి నుంచి రూ.3.26 లక్షలను లూఠీ చేసిన ఘటనలు హైదరాబాద్‌లో వెలుగు చూశాయి. సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఈ కేసుల వివరాలు వెల్లడించారు.

ఉత్తుత్తి ట్రేడింగ్‌..

రాజేంద్రనగర్‌ పరిధిలోని గండిపేటకు చెందిన 27 ఏళ్ల చార్టర్డ్‌ అకౌంటెంట్‌ నరసింహారెడ్డికి టెలిగారమ్‌, ఈ-మెయిల్‌ ద్వారా అపరిచిత వ్యక్తుల నుంచి సందేశాలు వచ్చాయి. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. మొదట రూ.2 లక్షల పెట్టుబడి పెట్టించగా, కొద్దిరోజుల్లోనే రూ.5 లక్షల లాభం వచ్చినట్లు నకిలీ ట్రేడింగ్‌ యాప్‌ ‘ఎక్స్‌నెట్‌’లో చూపించారు. తర్వాత రూ.5 లక్షల పెట్టుబడిపై రూ.9.50 లక్షల లాభాన్ని చూపించారు. నమ్మిన బాధితుడు.. గతేడాది నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 31 వరకు.. వారు చెప్పిన ఖాతాలకు రూ.2,45,09,550 ను బదిలీ చేశాడు. తీరా ఆ డబ్బును ఉపసంహరించుకుందామని ప్రయత్నించగా, నెగెటివ్‌ బ్యాలన్స్‌ కనిపించింది. అదేంటని ప్రశ్నించగా మరింత మొత్తం కట్టాలని నేరగాళ్లు ఒత్తిడి చేశారు. ఆ తర్వాత ఎక్స్‌నెట్‌ యాప్‌ను నిలిపివేయడంతో బాధితుడు సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు.


భారీగా లాభాలు చూపించి..

మియాపూర్‌కు చెందిన సాప్ట్‌వేర్‌ ఉద్యోగి లక్ష్మీనారాయణ(45)కు.. టెలిగారమ్‌లో ‘కీర్తన’ అనే మహిళ నుంచి పార్ట్‌టైమ్‌ ఉద్యోగం పేరిట మెసేజ్‌ వచ్చింది. ఆన్‌లైన్‌ టాస్క్‌లు, రివ్యూలు ఇస్తే.. భారీఆదాయం, కమీషన్‌ వస్తుందని అతడ్ని నమ్మించారు. విడతల వారీగా రూ.35 లక్షల వరకు బదిలీ చేయించుకున్నారు. నకిలీయాప్‌లో రూ.38.26 లక్షల లాభం వచ్చినట్టు చూపించి, డ్రా చేయాలంటే రూ.15 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో.. డీఎల్‌ఎఫ్‌ సైబర్‌ సిటీలో ఉంటూ ఐటీ కంపెనీలో పనిచేసే యువతి నుంచి రూ.3,24,818ను నేరగాళ్లు బదిలీ చేయించుకున్నారు. రూ.6024లు మాత్రమే తిరిగి రావడంతో బాధితురాలు సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు.

మ్యూల్‌ ఖాతాల ముఠా అరెస్ట్‌

సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలను సమకూర్చి, వాటి ద్వారా మోసపూరిత లావాదేవీలకు సహకరిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాజులరామారంలోని ద్వారకానగర్‌లో ఓ ఫ్లాట్‌లో సోదాలు నిర్వహించి.. గూగుల్‌ పే స్కానర్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ తోట దుర్గాప్రసాద్‌, పెద్ది శ్రీనివా్‌సరెడ్డి, గుండెగోని బాలరాజు, తలపల్లి రమణ, సింహాద్రి అనిల్‌ను అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వీరు అమాయకులకు డబ్బు ఆశ చూపించి వారి బ్యాంకు ఖాతాలను సైబర్‌ నేరగాళ్లకు అందజేసినట్టు గుర్తించారు. మరికొందరిని బెదిరించి.. వారి నుంచి ఆధార్‌, పాన్‌, ఇతర గుర్తింపు పత్రాలతో మ్యూల్‌ ఖాతాలు తెరిపించినట్టు తెలిసింది. ఈ విధంగా తెరిచిన మ్యూల్‌ ఖాతాలను సైబర్‌ నేరగాళ్లకు విక్రయించారు. ఈ ముఠాకు గణేశ్‌ అనే వ్యక్తి కీలక సూత్రధారిగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి పెద్ద మొత్తంలో గుర్తింపు పత్రాలు, క్యూఆర్‌ స్కానర్లు, స్వైపింగ్‌ మెషిన్లు, చెక్‌బుక్‌లు, ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.


‘సర్‌’ పేరుతో ఉచ్చు.. జాగ్రత్త

హైదరాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఇటీవలే ముగిసిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) సర్వే పేరుతోనూ ఇప్పుడు సైబర్‌ నేరస్తులు మోసాలకు తెగబడుతున్నారని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్‌బీ) అధికారులు హెచ్చరించారు. సర్‌ ఫారం తిరస్కరణకు గురైందని.. ఓటరు వివరాల సవరణ, అప్‌డేట్‌ చేసుకునేందుకు లింక్‌లు పంపిస్తున్నట్టు చెప్పారు. వాటి ద్వారా బ్యాంకు లాగిన్‌ వివరాలు, కార్డు వివరాలు, పిన్‌ నంబరు వంటి కీలక సమాచారాన్ని సేకరించి, సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నట్టు వివరించారు. అలాంటి సందేశాల్ని నమ్మి మోసపోవద్దని సూచించారు. అనుమానాస్పదంగా అనిపిస్తే, 1930కు సమాచారం అందించాలని సీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖాగోయల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Aug 14 , 2026 | 06:05 AM