సైబర్ క్రిమినల్స్‌కు బ్యాంకు మేనేజర్ల అండ
ABN , Publish Date - Apr 20 , 2026 | 05:28 AM
రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల్లో బ్యాంకు అధికారులు కీలకంగా వ్యహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రోజుకో కొత్తరకం మోసంతో పంజా విసురుతున్న సైబర్ క్రిమినల్స్..
రూ.150 కోట్ల మోసాల్లో పాత్ర
‘అక్టోపస్ 2.0’లో32మంది బ్యాంకుల అధికారులు,20మంది నేరగాళ్ల అరెస్టు
హైదరాబాద్ సిటీ పోలీసుల ఆపరేషన్
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల్లో బ్యాంకు అధికారులు కీలకంగా వ్యహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రోజుకో కొత్తరకం మోసంతో పంజా విసురుతున్న సైబర్ క్రిమినల్స్.. బ్యాంకు అఽధికారుల అండతోనే రెచ్చిపోతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నేరగాళ్లతో చేతులు కలిపి మ్యూల్ ఖాతాలు తెరిచి, రూ.వందల కోట్ల ప్రజాధనం లూటీ చేయడంలో బ్యాంకు అధికారులదే కీలక పాత్ర అని గుర్తించారు. సైబర్ నేరగాళ్ల నుంచి, మధ్యవర్తుల నుంచి రూ.లక్షల్లో కమీషన్లు తీసుకుంటున్న బ్యాంకు అధికారులు.. నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో సైబర్ క్రిమినల్స్‌తో పాటు వారికి సహకరిస్తున్న బ్యాంకు మేనేజర్లు, సిబ్బందిపై ఉక్కుపాదం మోపాలని హైదరాబాద్ సిటీ పోలీసులు నిర్ణయించారు. సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాలతో ‘అక్టోపస్ 2.0’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. 16 బృందాలుగా రంగంలోకి దిగిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు 7 రోజుల్లో 9 రాష్ట్రాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సైబర్ క్రిమినల్స్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. దేశవ్యాప్తంగా 850 సైబర్ నేరాలతో సంబంధం ఉన్న 32 మంది బ్యాంకు మేనేజర్లను, 20 మంది సైబర్ క్రిమినల్స్‌ను అరెస్టు చేశారు. ఈ క్రిమినల్స్ ముఠా రూ.150 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.
తొలి విడత ఆపరేషన్ అక్టోప్‌సను ఫిబ్రవరిలో నిర్వహించి సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో పెట్టుబడులు, ట్రేడింగ్ స్కాంలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను భయపెట్టి వారి కష్టార్జితాన్ని దోచుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో అక్టోపస్ 2.0 చేపట్టారు. ఈ వివరాలను సీపీ సజ్జనార్ ఆదివారం వెల్లడించారు. అన్ని రకాల ఆధారాలు సేకరించి.. పక్కా ప్రణాళికతో మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, బిహార్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. జాయింట్ కమిషనర్ (స్పెషల్ బ్రాంచ్) ఎస్‌ఎం విజయ్‌కుమార్, సైబర్ క్రైం డీసీపీ వీ అరవింద్ బాబు, ఏసీపీ శివమారుతి పర్యవేక్షణలో సీసీఎఎస్, సైబర్ క్రైమ్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్లు, ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగాల నుంచి ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. కాగా, గత ఫ్రిబవరిలో 32 బృందాలుగా ఏర్పడి 16 రాష్ట్రాల్లో గాలించి 104 మంది సైబర్ క్రిమినల్స్‌ను అరెస్టు చేశారు. 151 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు.
వారిని వదిలే ప్రసక్తే లేదు
సైబర్ క్రిమినల్స్‌కు సహకరిస్తున్న బ్యాంకు మేనేజర్లు, సిబ్బందిని వదిలే ప్రసక్తే లేదు. ఆపరేషన్ అక్టోపస్ నిరంతర ప్రక్రియ. నేరగాళ్లు ఎక్కడున్నా వేటాడి, వెంటాడి పట్టుకుంటాం. అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి స్పెషల్ డ్రైవ్ నిర్వహించేలా చూస్తాం. సైబర్ నేరాలకు గురైన బాధితులు వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి.
- వీసీ సజ్జనార్,
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్