Share News

ప్రేమ వల.. టెస్లా ఎర.. షేర్లంటూ టోకరా!

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:27 AM

ధిక లాభాల ఆశ చూపి ఒకరు.. ప్రేమ పేరుతో వల వేసి ఇంకొకరు.. బీమా పాలసీ సొమ్ము ఇప్పిస్తామని మరొకరు.. చివరకు ఇలాన్‌ మస్క్‌, జుకర్‌బర్గ్‌లమంటూ కూడా సైబర్‌ నేరగాళ్లు లక్షల రూపాయలు దోచుకున్న

ప్రేమ వల.. టెస్లా ఎర.. షేర్లంటూ టోకరా!

  • రకరకాల మార్గాల్లో సైబర్‌ నేరగాళ్ల దోపిడీ

  • లండన్‌ వైద్యుడినంటూ.. ప్రభుత్వ ఉద్యోగినంటూ 35.16 లక్షలు స్వాహా

  • ఫేక్‌ యాప్‌తో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నుంచి 51.40 లక్షలు కొట్టేశారు

  • మస్క్‌ పేరుతో ఓ రిటైర్డ్‌ వైద్యుడికి 10.11 లక్షలకు టోకరా

  • రీఫండ్‌ అంటూ మహిళ నుంచి 10.59 లక్షలు కాజేశారు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): అధిక లాభాల ఆశ చూపి ఒకరు.. ప్రేమ పేరుతో వల వేసి ఇంకొకరు.. బీమా పాలసీ సొమ్ము ఇప్పిస్తామని మరొకరు.. చివరకు ఇలాన్‌ మస్క్‌, జుకర్‌బర్గ్‌లమంటూ కూడా సైబర్‌ నేరగాళ్లు లక్షల రూపాయలు దోచుకున్న ఉదంతాలు వెలుగుచూశాయి. బాధితుల ఫిర్యాదుతో సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టిన ఈ కేసుల వివరాలిలా ఉన్నాయి.. బంపీ అనే అంతర్జాతీయ డేటింగ్‌ యాప్‌ లో పరిచయమైన ఆరవ్‌ రోహిల్‌ అనే వ్యక్తి కట్టుకథ అల్లి గచ్చిబౌలికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిని నుంచి రూ.35.16 లక్షలు కాజేశాడు. ఏప్రిల్‌ 25న వారి మధ్య పరిచయం ఏర్పడింది. మొదట యాప్‌లో తర్వాత వాట్సా్‌పలో సంప్రదింపులు కొనసాగించారు. తన తండ్రి భారతీయుడు, తల్లి బ్రిటిష్‌ పౌరురాలని, లండన్‌లో దంత వైద్యుడిగా పనిచేస్తున్నానని ఆరవ్‌ చెప్పాడు. భారత్‌పై ప్రేమతో ఇక్కడే స్థిరపడాలని, భారతీయ యువతినే వివాహం చేసుకోవాలని, హైదరాబాద్‌లో ఆస్పత్రి ప్రారంభించాలన్నది తన లక్ష్యమని నమ్మబలికాడు. రెండు నెలల పాటు సన్నిహితంగా మాట్లాడిన తర్వాత ఆమెను కలవడానికి లండన్‌ నుంచి ఢిల్లీ వస్తున్నట్లు తెలిపి విమాన టికెట్‌ కాపీ కూడా పంపించాడు. మే 25న ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నానని చెప్పిన కొద్దిసేపటికే.. తాము కస్టమ్స్‌ అధికారులమంటూ దీపికాశర్మ అనే పేరుతో ఓ మహిళతో పాటు కొందరు వ్యక్తులు బాధితురాలికి ఫోన్‌ చేశారు. కస్టమ్స్‌ నిబంధనలకు విరుద్ధంగా ఆరవ్‌ వద్ద భారీ మొత్తంలో బ్రిటిష్‌ కరెన్సీ ఉండడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నామని, ఆ సొమ్ము విలువ భారత కరెన్సీలో రూ.63.14 లక్షలకు సమానమని తెలిపారు. అతడ్ని విడుదల చేయాలంటే మనీలాండరింగ్‌, ఉగ్రవాద నిరోధక చట్టాలకు సంబంధించిన జరిమానాలు చెల్లించాలని, ఆరవ్‌ విడుదలైన తర్వాత అతడి వద్ద ఉన్న డబ్బు బాధితురాలి ఖాతాలో జమ చేస్తామని నమ్మబలకడంతో ఆమె రూ.35,16,200 వివిధ బ్యాంకుల ద్వారా బదిలీ చేసి మోసపోయింది.


ఖాతాలో కోటిపైన చూపించి..!

అమీన్‌పూర్‌కు చెందిన ఓ సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నుంచి సైబర్‌ మోసగాళ్లు నకిలీ ట్రేడింగ్‌ యాప్‌తో రూ.51.40 లక్షలు కాజేశారు. గతేడాది సెప్టెంబరులో అద్వికా శర్మ పేరుతో పరిచయం చేసుకున్న మహిళ షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే భారీగా లాభా లు పొందవచ్చని నమ్మబలికింది. దాంతో బాధితుడు ‘ఆర్‌ఎఆర్‌సీఐఐ’ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఖాతా తెరిచాడు. రూ.50వేలతో పెట్టుబడి ప్రారంభించి, మొత్తం 51.40లక్షలు బదిలీ చేశాడు. సైబర్‌ నేరగాళ్లు అతని ఖాతాలో రూ.1.10 కోట్లకు పైగా ఉన్నట్లు చూపించారు. అతను డబ్బులు ఉపసంహరించుకుంటానని అడగ్గా మరో రూ.75.34 లక్షలు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో మోసపోయినట్లు గ్రహించాడు.

పజిల్స్‌ కొంపముంచాయి!

ప్రపంచ టెక్‌ దిగ్గజాలు ఇలాన్‌ మస్క్‌, మార్క్‌ జుకర్‌బర్గ్‌ పేర్లు చెప్పి సైబర్‌ మోసగాళ్లు ఓ రిటైర్డ్‌ డాక్టర్‌ నుంచి రూ.10.11 లక్షలకు పైగా కాజేశారు. జీడిమెట్ల ప్రాగా టూల్స్‌ కాలనీకి చెందిన ఆయన ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో పాథాలజిస్టుగా పనిచేశారు. గత ఏడాది మార్చిలో ఫేస్‌బుక్‌లో కనిపించిన సైకోమెట్రిక్‌ పజిల్స్‌కు స్పందించిన ఆయనను కొందరు వ్యక్తులు తమను మస్క్‌, జుకర్‌బర్గ్‌గా పరిచయం చేసుకున్నారు. క్లిష్టమైన పజిల్స్‌ పరిష్కరిస్తే బహుమతిగా టెస్లా కారు, నగదు, బంగారు బిస్కెట్లు పంపిస్తామని నమ్మబలికారు. టెస్లా కారును భారత్‌కు పంపిస్తున్నట్లు కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో రూపొందించిన ఫొటోలు, వీడియోలు పంపించారు. వాటికి పన్నులు, డెలివరీ చార్జీలు చెల్లించాలనడంతో బాధితుడు వివిధ బ్యాంకు ఖాతాలు, యూపీఐ ఐడీలకు రూ.10,11,652 బదిలీ చేసి మోసపోయారు.

రూ.52తో మొదలుపెట్టి...

ఎన్నో ఏళ్ల క్రితం ముగిసిన ఇంటి రుణానికి అనుబంధంగా ఉన్న బీమా పాలసీ మొత్తాన్ని తిరిగి ఇప్పిస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు ఓ గృహిణిని నమ్మబలికి రూ.10.59 లక్షలు దోచుకున్నారు. గచ్చిబౌలి అపర్ణ లక్సోర్‌ పార్క్‌ నివాసి అయిన బాధితురాలికి గత ఏడాది జూలైలో అనన్య శర్మ అనే మహిళ ఫోన్‌ చేసింది. బీమా పాలసీ ల్యాప్స్‌ అయిందని, రీఫండ్‌ పొందే అవకాశం ఉందని తెలిపింది. తర్వాత మేనేజర్‌గా పరిచయం చేసుకున్న రాజేష్‌ అగర్వాల్‌ బాధితురాలిని సంప్రదించి మొదట రూ.52 చెల్లించాలని సూచించాడు. అప్పటి నుంచి ఈ ఏడాది మే 21వరకు పలు దఫాలుగా వివిధ పేర్లతో రూ.10.59 లక్షలు వసూలు చేశారు.

Updated Date - Jun 14 , 2026 | 04:27 AM