హైదరాబాద్‌లో కొవిడ్ కేసులు?
ABN , Publish Date - Jul 22 , 2026 | 05:55 AM
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొవిడ్ కేసులొస్తున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో కరోనా కారణంగా నలుగురు మృత్యువాత పడ్డారు.
కొద్దిరోజుల క్రితం గాంధీలో కరోనా కేసు నమోదు!
గత నెలలో తార్నాకలో కొవిడ్‌తో మహిళ మృతి!
టెస్టులు చేయకపోవడం వల్లనే ‘సున్నా’ కేసులు
పరీక్ష చేయడానికి కిట్లే లేవంటున్న వైద్యవర్గాలు
హైదరాబాద్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొవిడ్ కేసులొస్తున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో కరోనా కారణంగా నలుగురు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ నగరంలోనూ గత నెల రోజులుగా జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చేవారి సంఖ్య పెరుగుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఇటువంటి అనుమానిత కేసుల్లో పరీక్షలు చేస్తే కొందరికైనా కొవిడ్ పాజిటివ్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ, అటు సర్కారీ దవాఖానాల్లోనూ, ఇటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ టెస్టులు చేయకపోవడంతో కొవిడ్ కేసులున్నా నిర్థారణ కావడం లేదని సమాచారం. అందుకే రాష్ట్రంలో కొవిడ్ కేసులు ‘సున్నా’ అని ప్రజారోగ్య విభాగం రిపోర్టు చేస్తున్నట్టు చెబుతున్నారు. కిందటి నెల మొదటి వారంలో తార్నాకకు చెందిన 38 ఏళ్ల మహిళ జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ సీటీ చెస్ట్ స్కాన్ చేయించుకోగా.. ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్టు వచ్చింది. ఒక కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లిన కొన్నిగంటలకే ఆమె మరణించారు. అనంతరం ఆమె రిపోర్టును పరిశీలించిన ఓ ప్రభుత్వ వైద్యుడు.. కొవిడ్ కారణంగా ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. అలాగే గత నెల్లో గాంధీలో కూడా ఒక కొవిడ్ కేసు నమోదైనట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా.. తెలంగాణలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి ప్రజారోగ్య విభాగం ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదు. టెస్టు కిట్లు లేకపోవడం వల్లే కొవిడ్ పరీక్షలు చేయట్లేదని వైద్యవర్గాలు చెబుతున్నాయి. కొవిడ్ తీవ్రత లేకపోవడంతో నాలుగేళ్లుగా కిట్లు, మాస్కులు, శానిటైజర్స్ కొనుగోలు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలికసదుపాయాల అభివృద్ధి సంస్థ(టీజీఎంఎ్‌సఐడీసీ) పూర్తిగా నిలిపివేసింది. దీంతో.. ఒకవేళ వైరస్ విజృంభించి భారీగా కేసులొస్తే, పూర్తిగా చేతులెత్తేసే పరిస్థితి. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కనీస జాగ్రత్తలు, అవగాహన కల్పించడంలో ప్రజారోగ్య సంచాలకుల విభాగం పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిద్రపోతున్న ఐడీఎస్‌పీ
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రతివారం దేశవ్యాప్తంగా రెస్పిరేటివ్ వైరస్ సరళిపై టెస్టులు చేస్తుంటుంది. జూన్ మొదటివారం నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నట్లు అందులో వెల్లడైంది. తాజాగా జూలై మొదటివారంలో ఆ సంస్థ 162 నమూనాలను పరీక్షించగా.. 58 కొవిడ్ కేసులు నమోదు అయినట్లు వెల్లడించింది. మిగతావన్ని కూడా ఇన్‌ఫ్లూయెంజా కేసులని పేర్కొంది. ఇదే విషయాన్ని ఐసీఎంఆర్ తన డ్యాష్‌బోర్డ్‌లో కూడా వెల్లడించింది. రాష్ట్రాల్లో వైర్‌సలు, ఇతర అంటువ్యాధుల వ్యాప్తిని ముందుగా అంచనా వేసి, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల విభాగానిదే. ఈ బాధ్యతను ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రొగ్రామ్(ఐడీఎ్‌సపీ) విభాగం చూసుకుంటుంది. కానీ రాష్ట్రంలో ఐడీఎ్‌సపీ విభాగం పూర్తిగా నిద్రపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో, హైదరాబాద్‌లో కొవిడ్ కేసులు, వైరస్ వ్యాప్తి, వైద్యశాఖ చేపట్టిన చర్యలు, టెస్టులపై వివరణ కోరేందుకు రాష్ట్ర ఐడీఎ్‌సపీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బాలాజీ రెడ్డిని వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా ‘ఆంధ్రజ్యోతి’ పలుమార్లు సంప్రదించినా ఆయన అందుబాటులోకి రాలేదు. అలాగే హైదరాబాద్ డీఎంహెచ్‌వో డాక్టర్ పుట్ల శ్రీనివాస్ సైతం ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు.