లేబర్ కష్టాలు..!
ABN , Publish Date - Jul 24 , 2026 | 06:05 AM
హైదరాబాద్‌లో భవన నిర్మాణ రంగానికి కార్మికుల కొరత వచ్చిపడింది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులు చాలామంది స్వస్థలాలకు వెళ్లిపోవటంతో మాల్ మోసే మనుషులు కరువయ్యారు.
హైదరాబాద్‌లో భవన నిర్మాణ రంగానికి కార్మికుల కొరత
నెలకు రూ.40 వేలు ఇస్తామన్నా దొరకని వైనం
కార్మికుల్ని సమకూర్చలేక చేతులెత్తేస్తున్న ఏజెన్సీలు
ఉత్తరాది నుంచి కార్మికల రాక తగ్గడమే కారణం
ఎన్నికలకు వెళ్లి తిరిగి రాని బెంగాల్ వాసులు
లేబర్ అడ్డాలపై వేలాదిగా ఉన్నా ఏజెన్సీల్లో పనిచేసేందుకు విముఖత
అడ్డా కార్మికులకు రోజు కూలీ రూ.800-1000
నైపుణ్య కార్మికులైతే రోజుకు రూ.1,400 వరకు..
ఏజెన్సీ కింద పనిచేస్తే నెలకు రూ.10-12 వేలే
లేబర్ కొరతతో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం
నిర్మాణ ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేయలేక
ఇబ్బందులు పడుతున్న కంపెనీలు
హైదరాబాద్ సిటీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో భవన నిర్మాణ రంగానికి కార్మికుల కొరత వచ్చిపడింది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులు చాలామంది స్వస్థలాలకు వెళ్లిపోవటంతో మాల్ మోసే మనుషులు కరువయ్యారు. నెలకు రూ.40 వేల వరకు చెల్లించేందుకు నిర్మాణ సంస్థలు ముందుకొచ్చినా కూలీలు దొరకటం లేదు. దీంతో కార్మికులను సమకూర్చే ఏజెన్సీలు కూడా చేతులెత్తేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్,ఒడిశా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది సాధారణ, నైపుణ్య కార్మికులు హైదరాబాద్‌లో నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా నార్సింగి, కోకాపేట, పుప్పాలగూడ, మణికొండ, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, మియాపూర్, నిజాంపేట, బాచుపల్లి, కొంపల్లి, ఉప్పల్, ఎల్‌బీనగర్ తదితర ప్రాంతాల్లో భారీ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణంలో ఈ రాష్ట్రాల వారే ఎక్కువగా పనిచేస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా మూడు షిప్టుల్లోనూ పనిచేసేందుకు వీరు సిద్ధంగా ఉంటారు. అందుకే భారీ నిర్మాణ రంగ కంపెనీలు ఈ రాష్ట్రాల వారినే ఎక్కువగా పనిలో పెట్టుకుంటాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్మాణ రంగంలో దాదాపు 7-8 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు.
తిరిగి రావటానికి విముఖత
భవన నిర్మాణ రంగంలో సాధారణ, నైపుణ్య కార్మికులుంటారు. మాల్ మోసే సాధారణ లేబర్ నుంచి తాపీ, సెంట్రింగ్ మేస్త్రీలు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, గ్రానైట్, మార్బుల్స్, ఇంటీరియర్ పనులు చేసే నైపుణ్య కార్మికులు కీలకపాత్ర పోషిస్తారు. గత 3 నెలలుగా హైదరాబాద్‌లో ఈ కార్మికుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో పలు ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలో పనులు సాగడం లేదు. కోకాపేటలో ప్రముఖ నిర్మాణ సంస్థ చేపట్టిన ప్రాజెక్టులో ఆరు నెలల క్రితం వరకు రోజుకు ఒక్కో షిప్టులో 300 మంది వరకు పనిచేసేవారు. ప్రస్తుతం 100 మందితోనే పని చేయిస్తున్నారు. ఉత్తరాది కార్మికులు చాలామంది సొంత ప్రాంతాలకు వెళ్లి తిరిగి రాకపోవటమే ఈ కొరతకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన చాలామంది అక్కడే ఉండిపోయారు. వారిని రప్పించేందుకు ఆయా రాష్ట్రాల్లోని లేబర్ ఏజెన్సీల ద్వారా ప్రయత్నించినా వీలు కాలేదని తెలిసింది. దీంతో హైదరాబాద్‌లో నిర్మాణ కంపెనీలకు కార్మికులను సమకూర్చే లేబర్ ఏజెన్సీలు కూడా చేతులెత్తేస్తున్నాయి. నగరంలోని లేబర్ అడ్డాల వద్ద వేలాది మంది కార్మికులున్నా.. ఏజెన్సీల కింద పని చేసేందుకు వారు ఆసక్తి చూపడం లేదు. ఈ ఏజెన్సీలు ఎక్కువ సమయం పనిచేయించుకొని తక్కువ కూలీ ఇస్తాయని.. అందుకే తాము వాటి కింద పనిచేయటం లేదని పలువురు కార్మికులు తెలిపారు. లేబర్ అడ్డాల వద్ద సాధారణ కార్మికులకు రోజుకు రూ.800 నుంచి రూ.1,000 వరకు కూలీ ఇస్తుండగా, నైపుణ్య కార్మికులకు రూ.1,200 నుంచి రూ.1,400 వరకు చెల్లిస్తున్నారు.
ఏజెన్సీల శ్రమ దోపిడీ..
భారీ నిర్మాణ కంపెనీలు సొంతంగా లేబర్‌ను సమకూర్చుకోలేక ఏజెన్సీలపై ఆధారపడతాయి. ఒక్కో కార్మికుడిపై ఈ సంస్థలు నెలకు రూ.30 వేల వరకు ఖర్చు చేస్తుంటాయి. అయితే, ఇందులో ఏజెన్సీల కమీషనే అధికం. కార్మికుడి చేతికి వచ్చేది నెలకు రూ.10-12 వేలు మాత్రమే. అదనంగా పనిచేసినా షిప్టుకు రూ.500లకు మించి ఇవ్వటంలేదు. ఇంత తక్కువ కూలికి పనిచేయటం ఇష్టం లేకనే ఉత్తరాది వారు రావటం లేదని అంటున్నారు. ప్రస్తుతం కొరత కారణంగా ఒక్కో కార్మికుడికి కంపెనీలు రూ.40 వేల వరకు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నా కూలీలు దొరకడం లేదని డెవలపర్లు అంటున్నారు. దీంతో ఆయా పనులు చేసేందుకు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న ఏజెన్సీలు ఇరకాటంలో పడ్డాయి.
ప్రాజెక్టులపై ప్రభావం
నగరంలోని నిర్మాణ సంస్థలు, డెవలపర్లు ప్రీలాంచ్ కింద భారీగా ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. ఒకటి రెండేళ్లలో ఇళ్లను అప్పగిస్తామని కొనుగోలుదారులకు హామీ ఇస్తున్నారు. రెరాలో ప్రాజెక్టు ఆమోదం సందర్భంలోనూ ప్రాజెక్టును పూర్తి చేసేందు కు నిర్ణీత గడువునిచ్చారు. ఇప్పుడు కార్మికుల కొరతతో ప్రాజెక్టులు సకాలంలో పూర్తవుతాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే సకాలంలో పూర్తి చేయలేమని ఓ డెవలపర్ నిస్సహాయత వ్యక్తంచేశారు.