Share News

రసాయనాలతో మాగబెడుతున్న మామిడి పండ్లతో జాగ్రత్త

ABN , Publish Date - Apr 04 , 2026 | 05:34 AM

రసాయనాలతో మాగబెడుతున్న మామిడిపండ్లు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ నగర సీసీ వీసీ సజ్జనార్‌ సూచించారు.

రసాయనాలతో మాగబెడుతున్న మామిడి పండ్లతో జాగ్రత్త

  • పండ్లను రసాయనాలతో మాగబెట్టి విక్రయిస్తే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్‌

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): రసాయనాలతో మాగబెడుతున్న మామిడిపండ్లు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ నగర సీసీ వీసీ సజ్జనార్‌ సూచించారు. కాసులకు కక్కుర్తిపడి కొందరు రసాయనాలతో పండ్లను మాగబెట్టి విక్రయిస్తున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వారిపై హెచ్‌ఫాస్ట్‌ విభాగం నిఘా పెట్టిందని, పట్టుబడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాల్షియం కార్బైడ్‌ వంటి రసాయనాలతో కృత్రిమంగా మాగబెట్టిన మామిడి పళ్లు మొత్తం ఒకే రంగులో ఉండవని, అవి పసుపు రంగులో నిగనిగలాడతాయని తెలిపారు. పైన పండినట్లు కనిపించినా లోపల పచ్చిగా ఉంటుందని, వాటిని తినడం వల్ల కడుపులో మంట, వికారం, వాంతులు, విరోచనాలతో పాటు దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారని గుర్తుచేశారు. ప్రజలు ఈ విషయం గమనించి సహజంగా పండిన మామిడిపండ్లను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. కల్తీ మామిడిపళ్ల గురించిన సమాచారం తెలిస్తే డయల్‌ 100కు గానీ, హెచ్‌ఫాస్ట్‌ నెంబర్‌ 8712661212కు సంప్రదించి సమాచారం అందించాలని సీసీ సజ్జనార్‌ సూచించారు. కాగా, మామిడి పండ్లను కృత్రిమంగా మాగబెట్టడానికి పరిమితికి మించి రసాయనాలను ఉపయోగిస్తున్న వ్యక్తిని గోషామహల్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పురానాపూల్‌కు చెందిన పండ్ల వ్యాపారి నికాబ్‌వాలా కునాల్‌ చుడీబజార్‌లోని ఒక గదిలో మామిడి పండ్లను అధిక మోతాదులో రసాయనాలు వాడి మాగబెడుతున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం దాడి చేసి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. ‘డైమండ్‌ రైప్‌- ఇథిలీన్‌ రైపెనర్‌’ రసాయన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Apr 04 , 2026 | 05:34 AM